సిటీబ్యూరో, ఆగస్టు 15 ( నమస్తే తెలంగాణ ) : రవాణా శాఖ అకస్మాత్తుగా తీసుకుంటున్న నిర్ఱయాలపై వాహనదారులు భగ్గుమంటున్నారు. ఇష్టానుసారంగా పన్నుల భారం మోపడాన్ని విమర్శిస్తున్నారు. భారం మోపకుండా ఆదాయాన్ని సృష్టించే మార్గాలను అమలు చేయాల్సింది పోయి.. ప్రజలపైనే భారం వేసి డబ్బులు సమకూర్చుకోవాలన్న నిర్ణయం సరైనది కాదని వాహన సంఘాలు సైతం ఆరోపిస్తున్నాయి. మొన్న సర్వీస్ చార్జీలను ఇష్టానుసారంగా పెంచిన ఆర్టీఏ తాజాగా వాహన ట్యాక్స్‌ను ఇబ్బడిముబ్బడిగా పెంచేసి వాహనదారుల జేబును గుల్ల చేసింది. రాష్ట్రంలో గ్రేటర్ జిల్లాలోని అత్యధికంగా వాహనాలు కొనుగోళ్లు జరుగుతాయి. రియల్ ఎస్టేట్ ప్రభావంతో వాహన రంగం కుదేలైంది. కొత్త వాహనాల జోరు నగరంలో పెద్దగా కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సర్వీస్ చార్జీలు, పన్ను భారం తగ్గించి వాహనాల కొనుగోలును ప్రోత్సహించాల్సింది పోయి అధికంగా పన్ను భారం వేస్తూ వాహనదారులకు కష్టాలను మిగిలిస్తున్నది.
ద్విచక్రవాహనం కొనుగోలు చేయాలన్నా.. కారు కొనాలన్నా పన్ను భారం మోయాల్సిందే. వాహన ధరల ఆధారంగా శ్లాబులు విభజించి ఆర్టీఏ భారం మోపింది. లక్ష రూపాయలు దాటితే గానీ ద్విచక్ర వాహనాలు మార్కెట్లోకి రావడం లేదు. లక్ష రూపాయల ధర దాటిన ద్విచక్ర వాహనంపై 15 శాతం, రెండు లక్షలు దాటితే 18 శాతం లైఫ్ ట్యాక్స్ భారం మోపింది. రాజు అనే వ్యక్తి రాయల్ ఎన్ఫీల్డ్ వాహనం కొనుగోలు చేసి ఖైరతాబాద్ రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వెళితే లైఫ్ ట్యాక్స్ రూ.42వేలు వసూలు చేశారు. అయితే గతంలో ద్విచక్రవాహనాలకు ఎక్స్‌షోరూం ధర రూ.50 వేల వరకు ఉంటే 9 శాతం, రూ. 50వేల కంటే ఎక్కువ ఉంటే 12 శాతం ధర ఉండేది. అంటే ఈ లెక్కన రాజు కొనుగోలు చేసిన వాహనానికి 27,600 మాత్రమే పన్ను ఉండేది.
కానీ ప్రస్తుతం ప్రభుత్వం పెంచిన ధర ప్రకారం అదనంగా రూ.14,400 రూపాయలు అదనంగా కట్టాల్సి వచ్చింది. ఇప్పుడు లక్ష దాటిన ద్విచక్రవాహనానికి కూడా 15 శాతం పన్ను అంటే 15,000 రూపాయలు చెల్లించాలి. గతంలో ఇది 12వేలు మాత్రమే ఉండేది. అంతేకాదు సెకండ్ హ్యాండ్ వాహనం కొన్నా.. పన్ను భారం మోయాల్సిందే. ఇక ప్రతి ఒక్కరి కల… ఓ కారు కొనుగోలు చేయడం. కానీ అది ఇప్పుడు భారంగా మారింది. 20 లక్షల నుంచి 50 లక్షల మధ్య ధర ఉంటే 20 శాతం పన్ను, రూ.50 లక్షలు దాటితే 21 శాతం పన్ను భారం పడుతుంది. నగరంలో కనీసంగా రూ. 20 లక్షల ధర దాటిన వాహనాలనే అధికంగా కొనుగోలు చేస్తుంటారు. ఇప్పుడు వారిపై 20 శాతం పన్ను భారం అంటే రూ.5 లక్షలు అధికంగా చెల్లించాల్సి వస్తుంది. ఇక 50 లక్షలు మించితే 21 శాతం పన్ను కట్టించుకుంటున్నారు.