నిజామాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రంలో సాధారణంగా వానకాలంలో పంటల సాగు విషయంలో రైతులకు రంది ఉండదు. ఎరువుల మాట అటుంచితే.. చాలా ప్రాంతాల్లో సాగుకు మాత్రం ఈసీజన్లో నీరు పుష్కలంగా లభ్యమవుతుంది. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేండ్ల పాటు సాగు పండుగలా సాగింది. తెలంగాణలో సాగు ఎలా పెరిగిందనేది.. కేంద్రం ప్రకటించిన అధికారిక లెక్కలే సాక్ష్యాలుగా నిలిచాయి. కానీ ప్రస్తుతం పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నది. వానకాలం ప్రారంభదశలోనే ఎన్నడూ లేని గడ్డు పరిస్థితులను రైతులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో ఏ మూలన చూసినా సాగునీరు అందని దుర్భర పరిస్థితుల నేపథ్యంలో నారుదశలోనే పంట ఎండుతున్నది. ఆయా చోట్ల నారుమడిని కాపాడుకునేందుకు రైతులు అరిగోస పడుతున్నారు.
రాష్ట్రంలో సాగునీటి కొరత విషయంలో సర్కార్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. సాగు నీటి కొరత ఇప్పుడే ఇలా ఉంటే ఇక రానున్న మూడు నెలల పాటు నరకం చూడాల్సి వస్తుందంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ నిర్వాకంతో ధైర్యం కోల్పోతున్న చిన్న, సన్నకారు రైతులంతా ఈ సీజన్‌కు దండం పెడుతున్నారు. సాగునీటి ప్రాజెక్టులు ఉంటే ఆయకట్టు రైతుకు ఎంతో ధైర్యం ఉంటుంది. నీళ్లకు ఢోకా ఉండదనే అభయం దక్కుతుంది. కాంగ్రెస్ పాలనలో తలాపున జీవ నదులు, ప్రాజెక్టులు ఉన్నప్పటికీ రైతుకు సాగు ధీమా దక్కడం లేదు. సహజంగా యాసంగిలో సాగునీటి కోసం అల్లాడుతుంటారు. రేవంత్ సర్కార్ పాలనలో వానకాలమే గడ్డు కాలమైంది. ఎల్‌నినో బూచీని అడ్డుపెట్టి రైతును పొలాలకు దూరం చేస్తున్నారు. ఫలితంగా ప్రాజెక్టుల కిందే నారుమడులు ఎండిపోతున్నాయి. జలాశయాలు తక్కువ నీటి మట్టంతో రోజురోజుకూ ఆవిరై పోతున్నాయి. నార్లు పోసిన పొలాలు ఎండిపోతున్నాయి. రైతు కండ్లలో ఆందోళనతో కూడిన కన్నీళ్లు నిండుతున్నాయి. తెలంగాణ ఇరిగేషన్ శాఖ లెక్కల ప్రకారం జలాశయాల్లో నీటి నిల్వలు బాగా తగ్గాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు సామర్థ్యం 80.5టీఎంసీలు కాగా కేవలం 15టీఎంసీలు కంటే తక్కువకే కొట్టుమిట్టాడుతున్నది. ఎగువ గోదావరి నుంచి చుక్క నీరు ఇన్‌ఫ్లో రూపంలో రావడం లేదు. బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తినప్పటికీ ప్రయోజనం శూన్యం. ఎల్లంపల్లి, లోయర్ మానేరు డ్యామ్‌లు సగం కంటే తక్కువతో కనిపిస్తున్నాయి. నాగార్జునసాగర్ 513 అడుగుల వద్ద దాదాపుగా డెడ్ స్టోరేజీకి చేరుకున్నది. ఎల్‌నినో ప్రభావం, తక్కువ వర్షాల కారణంగా ఇన్‌ఫ్లో లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం పునరుద్ధరణలో ఉద్దేశపూర్వక ఆలస్యం చేసి ప్రాణహిత వద్ద గోదావరి నీటిని సముద్రంలోకి పోనివ్వడం ద్వారా రైతులను మరింత ఇబ్బంది పెడుతున్నది.
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో నారుమడులు ఎండిపోతున్నాయి. నిజాంసాగర్ ప్రాజెక్టు దిగువ గ్రామంలో దయనీయ దుస్థితి ఉన్నది. కామారెడ్డి – మెదక్ సరిహద్దులోని పోచారం ప్రాజెక్టులో నారు మడులను వదిలేసి రైతులు సాగుకు దూరం అవుతున్నారు. నల్లగొండలో సాధారణ విస్తీర్ణం కంటే సగం తక్కువే పుటం మడులు వేశారు. నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ కింద వరి నారుమడులు సగం మంది ఇంకా వేయలేదు. నారు వేసిన వారంతా నాట్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఎల్‌నినో హెచ్చరికలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదు. కాళేశ్వరం పంపులు పూర్తి సామర్థ్యంతో నడపకపోవడం, మేడిగడ్డలోని రెండు పిల్లర్ల రిపేర్లలో సర్కార్ నిర్లక్ష్యం వెరసి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన జలాశయాలు 29 ఉండగా వీటి నీటి సామర్థ్యం 1059 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుతం 330 – 340 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నట్టు తెలుస్తున్నది. నిజాంసాగర్, శ్రీరాంసాగర్, మిడ్ మానేరు, అప్పర్ మానేరు, శ్రీశైలం, నాగార్జునసాగర్‌తో పాటుగా ఇతర మధ్యతరహా ఇరిగేషన్ ప్రాజెక్టులు డెడ్‌స్టోరేజీకి చేరుతున్నాయి. ఇన్‌ఫ్లో రాకపోవడం, వర్షాలు లేకపోవడంతో సాగునీరు ఇచ్చే పరిస్థితి లేదు. తెలంగాణ వ్యవసాయ శాఖ సమాచారం ప్రకారం ఈ వానకాలంలో పంటల సాగు మందగించింది. జూన్ చివరి నాటికి మొత్తం సాగు సుమారు 1.47లక్షల ఎకరాలకు మాత్రమే చేరిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నిరుడు ఇదే సమయానికి 2.84లక్షల ఎకరాల్లో సాగు మొదలైంది. జూలై 12వ తేదీ నాటికి 55.32 లక్షల ఎకరాల్లోనే పంటల సాగు మొదలైంది. వానకాలం పంటల సాగు లక్ష్యం 1.31కోట్ల ఎకరాలు. నిరుడు వానకాలంలో 1.10కోట్ల ఎకరాల్లో పంటలు పండించారు. ఈ సీజన్లో లోటు సాగు కొనసాగుతున్నది. నిరుడు యాసంగిలో 89.41లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయయి.
సాగు నీరందని పరిస్థితుల నేపథ్యంలో రైతుకు ఆర్థిక నష్టం తప్పడం లేదు. జూన్ మొదటి వారానికే చాలా మంది నారుమడులు సిద్ధం చేసుకోవడం మొదలు పెట్టారు. కానిప్పుడు వర్షాభావ పరిస్థితుల మూలంగా వేసిన నారుమడులు చాలా చోట్ల దెబ్బతిన్నాయి. తద్వారా రైతుకు ఎకరానికి రూ.5వేలు నష్టం వాటిల్లుతున్నది. నారుమడి తయారు చేసేందుకు మొదట దుక్కి వేయాల్సి ఉంటుంది. కల్టివేటర్ ట్రాక్టర్ ఉపయోగిస్తే 15 నుంచి 20 నిమిషాలు పడుతున్నది. ఇందుకోసం రూ.500 నుంచి రూ.700 వరకు ఖర్చు అవుతుంది. రోటావేటర్‌కు సరాసరి రూ.వెయ్యి చెల్లించాల్సిందే. నారు అలికేందుకు రూ.500 కూలీకి ఇవ్వాల్సిందే. విత్తన ఖర్చు దాదాపుగా ఎకరాకు రూ.వెయ్యి బ్యాగ్ కొనాల్సిందే. నారుమడి ఎదుగుదలకు ఫర్టిలైజర్ రూ.500 వరకు వెచ్చించాలి. మళ్లీ ఏదైనా రోగం అంటుకుంటే స్ప్రే కొట్టేందుకు రూ.400, మధ్యలో ఒకసారి గడ్డి మందు చల్లేందుకు రూ.200 అవుతున్నది. దాదాపుగా నెల రోజుల పాటు శ్రమ పడితే నారుమడి రైతు చేతికి వస్తుంది. ఈ మొత్తం ప్రాసెస్‌కు ఎకరాకు మొత్తం రూ.4500 నుంచి రూ.5000 కచ్చితంగా పెట్టుబడి పెట్టాల్సిందే. ఎకరం కంటే ఎక్కువ విస్తీర్ణానికి నారు మడి తయారు చేసుకుంటే దుక్కి, కల్టివేటర్ వినియోగం కలిసి వచ్చినా… విత్తనం, పురుగు మందుల రూపంలో పెట్టుబడి ఖర్చు మరింత పెరుగుతుంది. ఇదంతా వాతావరణం సరిగా అనుకూలిస్తేనే. సాగుకు నీరు లేకపోవడం, వాతావరణంలో మార్పులు చేర్పులు ఉంటే నారుమడి చేతికి రాదు. అప్పుడు కొత్తగా నారుమడి సిద్ధం చేసుకోవడానికి రెట్టింపు వ్యయం పెట్టాల్సిందే. ప్రస్తుతం కూడా దాదాపు అదే పరిస్థితి ఉన్నది. సాగుకు రైతులంతా కదిలినా.. సాగునీటి నిర్వహణలో సర్కార్ విఫలమవడం ఇప్పుడు ఇబ్బందులకు కారణమవుతున్నది.
కామారెడ్డి, మెదక్ జిల్లా సరిహద్దులో పోచారం ప్రాజెక్టులో నీళ్లు లేవు. ప్రధాన కాలువ నుంచి పారకం లేక ఆయకట్టు రైతులు విలవిల్లాడుతున్నారు. ఇదిగో ఇతని పేరు కురుమ లక్ష్మీనారాయణ. ఇతను ఒక కౌలు రైతు. 8 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు.

పుటం(తుకం) వేసుకున్నాడు. సాగుకు నీళ్లు లేవు. ధైర్యం చేసి మూడెకరాల్లో నాట్లు వేశాడు. అదిప్పుడు ఎండిపోయింది. మిగిలిన ఐదారు ఎకరాల్లో నాట్లు వేద్దామనుకుంటే ధైర్యం సరిపోవడం లేదు. చుక్క నీరు లేక, భూగర్భ జలాలు అడుగంటి పొలాలు ఖాళీగా వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని కౌలు రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
ఈ చిత్రంలో నారుమడికి నీరు పడుతున్న వ్యక్తి పేరు సిద్ధరాములు. కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం జంగంపల్లి ప్రాథమిక వ్యవసాయ
సహకార సంఘం(పీఏసీఎస్) చైర్మన్‌గా కొనసాగుతున్నాడు. తనకున్న 8 ఎకరాల వ్యవసాయ భూమిలో వరి వేసేందుకు నారుమడి సిద్ధం చేసుకున్నాడు. వానలు లేక, సాగునీటి కటకట నేపథ్యంలో నారును బతికించుకునేందుకు ఇలా ట్యాంకర్‌తో నీరు పడుతున్నాడు. వాటర్ ట్యాంకర్‌కు రూ.వెయ్యి, కూలీలకు రూ.600 చొప్పున రోజూ ఖర్చు చేయాల్సి వస్తున్నదని చెబుతున్నాడు.
చేతిలో బిందెలు, ప్లాస్టిక్ బకెట్లతో పత్తి మొక్కలకు నీరు పడుతున్న ఈ దుర్భర సన్నివేశం మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోనిది. రైతు తేనె వీరన్న నాలుగున్నర ఎకరాల భూమిలో పత్తి పంట సాగు చేస్తున్నాడు.

ఇప్పటికే రూ.1.20 లక్షలు పెట్టుబడి పెట్టాడు. సాగు నీరు లేక, వానలు పడకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతూ పత్తిని కాపాడుకునేందుకు ప్రతి మొక్కకూ చేతితో నీరు పోస్తూ బతికించుకుంటున్నాడు.
ఈ చిత్రం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేటలో ఓ రైతు వేసిన నారుమడి. కడెం ప్రాజెక్టు ఆయకట్టు కింద వరి సాగు చేసిన రైతుకు నీరు అందని పరిస్థితి ఉంది. సాధారణంగా వానకాలం ప్రారంభంలోనే కడెం ప్రాజెక్టు నిండుతుంది. కడెం గేట్లు ఎత్తితే నీరు వచ్చి ఎల్లంపల్లి ప్రాజెక్టులో చేరుతాయి.

ఇప్పుడు కడెం ప్రాజెక్టు నిండలేదు. దీంతో నిర్మల్ జిల్లా కడెం ఆయకట్టు మండలాల్లో వరి సాగుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వరి నారుకు కూడా నీరు అందించలేని పరిస్థితి నెలకొన్నది.
నిర్మల్ పట్టణ శివారులో వరి నారు మడులను కాపాడుకునేందుకు రైతులు అపర భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. మంజులాపూర్‌కు చెందిన రైతు భోజన్న ఏకంగా మోటర్లు పెట్టి మురుగు కాలువ నుంచి నీరు తోడి నారుమడికి మళ్లిస్తున్నాడు.

రెండు రోజులు ఆలస్యమైతే నారుమడి ఎండుతుందనే భయంతో పెట్రోల్‌తో నడిచే మోటరు ఇంజిన్‌ను తీసుకు వచ్చి సాహసం చేస్తున్నాడు. సాగు నీరు లేకపోవడంతో రైతు పడుతున్న కష్టాలకు ఈ చిత్రాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.
చారిత్రక నిజాంసాగర్ ప్రాజెక్టు నీరు లేక బోసిపోతున్నది. ఆయకట్టు రైతులకు సాగునీరు వదలడం లేదు. పుటం(తుకం) వేసిన రైతులంతా నాట్లు వేయలేక భూములను బీడుగా వదిలేస్తున్నారు. ఇతని పేరు కుర్తి రవి. నిజాంసాగర్ మండలం మగ్ధూంపూర్ రైతు.

ఆరు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. నీరు లేక బీడుగా వదిలేసినట్టుగా చెబుతున్నాడు. ఈ సీజన్లో పంటలు సాగు చేయాలనే ఆలోచనను చంపుకొన్నట్టుగా ఆవేదన వ్యక్తంచేస్తున్నాడు.