హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్(జెనో) ఉద్యోగులపై ఆ సంస్థ యాజమాన్యం ఉక్కుపాదం మోపింది. వారి నిరసన హక్కును హరించేందుకు కుట్రలు చేసింది. నిరసన ప్రదర్శనలు, ధర్నాలు, ఆందో ళనలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలకు ఉపక్రమిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు గురువారం సర్క్యులర్ జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. యాజమాన్యం నిర్ణయం విద్యుత్తు శాఖలో ప్రకంపనలు సృష్టిస్తున్నది. రాష్ట్రంలోని అన్ని విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు, ఎర్రగడ్డలోని ఈఆర్సీ కార్యాలయ ప్రాంగాణాల్లో నిరసనలకు దిగవద్దని, అధికారులు, ఉద్యోగుల వాహనాలకు ఆటంకం కల్పించవద్దని స్పష్టంచేసింది. జెన్కో యాజమాన్యం వైఖరిపై ఉద్యోగ వర్గాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. తెలంగాణ ఉద్యమంలోనూ ఇంతటి నిర్బంధం లేదని తేల్చిచెబుతున్నది. సంస్థల్లో ఆంధ్రా అధికారులు పెత్తనం చెలాయిస్తూ తెలంగాణ వారిపై కుట్రలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేసింది.
ఉద్యోగుల క్రమశిక్షణను మెరుగుపరిచేందుకని, సామర్థ్యం పెంచేందుకని ఈ నిర్ణయం తీసుకున్నట్టు యాజామాన్యం బయటకు చెప్తున్నది. కానీ, వాస్తవాలు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయని జెన్కో సిబ్బంది ఆరోపిస్తున్నారు. క్రమశిక్షణ ముసుగులో కొందరు ఆంధ్రా అధికారులు నిరంకుశంగా వ్యవహరిస్తూ తెలంగాణకు చెందిన ఉద్యోగులు, ఇంజినీర్లపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. విద్యుత్తు సంస్థల పరిరక్షణ కోసం తాము చేస్తున్న పోరాటాలను అణచివేసేందుకే యాజమాన్యం ఈ నిషేధాజ్ఞలు తెరపైకి తెచ్చిందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో యాష్ హ్యాండ్లింగ్, కోల్ హ్యాండ్లింగ్ యూనిట్ల ప్రేవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వారి గొంతునొక్కేందుకే ఈ నిర్ణయం తీసుకున్నదని మండిపడుతున్నారు.
జెన్కోలో నిరసనలు, ధర్నాలపై నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉద్యోగులు, సిబ్బంది ముక్తకంఠంతో ఖండించారు. వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్లో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో జెన్కో యాజమాన్య అప్రజాస్వామిక విధానాలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలను ఆమోదించారు. నిరసనలు, ర్యాలీలపై విధించిన అప్రజాస్వామిక నిషేధ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో ప్రైవేటీకరణకు ఉద్దేశించిన టెండర్ నోటిఫికేషన్ను తక్షణమే రద్దు చేయాలని తీర్మానించారు. జెన్కో యాజమాన్యం తమ డిమాండ్లను పెడచెవిన పెడితే ఊరుకోబోమని తేల్చిచెప్పారు. యాదాద్రి థర్మల్ ప్లాంట్ల ప్రైవేటీకరణను నిలిపివేయకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
తెలంగాణ జెన్కో యాజమాన్యం సంస్థ ఉద్యోగులపై ఆంక్షలు విధించడం దుర్మార్గమని, వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలని టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగులు, సిబ్బంది శాంతియుతంగా తమ అభిప్రాయాలను వ్యక్తంచేయకుండా నిరసనలు, ధర్నాలు, ర్యాలీలపై ఆంక్షలు విధించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని మండిపడ్డారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణ టెండర్లను వ్యతిరేకిస్తున్న ఉద్యోగుల గొంతును అణచివేసేందుకే యాజమాన్యం ఈ నిషేధాజ్ఞలు జారీ చేసిందని అనుమానం వ్యక్తంచేశారు.