పెద్దపల్లి, అక్టోబర్ 4(నమస్తే తెలంగాణ): తెలంగాణ రైతులు పండించిన సన్నరకాల వడ్ల పేరుతో రాష్ట్రంలో జరుగుతున్న మరో భారీ కుంభకోణం వెలుగుచూసింది. సీఎమ్మార్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) విషయంలో రైస్‌మిల్లర్లు బురిడీ కొట్టించడం, సర్కార్ తలూపడం భారీ నష్టానికి దారితీసే అవకాశం ఏర్పడింది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.1,200 కోట్ల నష్టం జరుగుతుందని, మిల్లర్లకు రూ.600 కోట్ల లాభం చేకూరుతుందని కొద్దిరోజుల క్రితం జరిగిన విజిలెన్స్ విచారణలో తేలినట్టు సమాచారం. 2025-26 ఖరీఫ్‌లో మిల్లర్లు తీసుకున్న సన్నరకాల వడ్లకు సంబంధించి 16 లక్షల మెట్రిక్ టన్నుల సీఎమ్మార్ బియ్యం ప్రభుత్వానికి బకాయి పడ్డారు.
సన్నరకాల వడ్లను బియ్యం చేసి అమ్ముకున్న మిల్లర్లు.. ఎఫ్‌సీఐకి సన్నబియ్యం బదులు కామన్(దొడ్డు) రకం బియ్యం ఇస్తామని ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో దొడ్డు రకానికి, సన్నరకానికి ధరలో ఉన్న తేడాను క్వింటాకు రూ.22.90 చొప్పున చెల్లిస్తామని అంగీకరించారు. ప్రభుత్వం సైతం మిల్లర్ల డిమాండ్‌కు తలొగ్గడంతో ప్రతి మిల్లరూ ధరలో ఉన్న తేడా రేషియో ప్రకారం రెండ్రోజుల నుంచే డీడీలు చెల్లిస్తున్నారు. రైతుల నుంచి ప్రభుత్వం అధిక ధరకు కొనుగోలు చేసిన సన్న వడ్లను బడా మిల్లర్లు బహిరంగ మారెట్లో విక్రయించుకుని, పొరుగు రాష్ర్టాల నుంచి దొడ్డు బియ్యాన్ని తక్కువ ధరకు తెచ్చి ప్రభుత్వానికి అంటగడుతున్నారన్న ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి క్వింటా సన్నరకం వడ్లను రూ.2,390 మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ కలిపి రూ.2,890 చొప్పున చెల్లించి కొనుగోలు చేసింది. హమాలీ, రవాణా ఖర్చులు కలిపి సరాసరి రూ.3వేల పైనే పడింది. కానీ మిల్లర్లు ఆ సన్న వడ్లను ప్రభుత్వానికి బియ్యంగా ఇవ్వకుండా, క్వింటాకు రూ.3,500 చొప్పున ఇతర రాష్ర్టాలకు అమ్ముకున్నారు. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యం కోసం, పొరుగు రాష్ర్టాల నుంచి క్వింటా రూ.2,500కే దొరికే దొడ్డు రకం(కామన్) బియ్యాన్ని తెస్తున్నారు. సన్న బియ్యానికి బదులు దొడ్డు బియ్యం పెడుతామని ఇప్పటికే ప్రభుత్వాన్ని ఒప్పించడం గమనార్హం. నిబంధనల ప్రకారం క్వింటా వడ్లు మర ఆడిస్తే 64 కిలోల బియ్యమే వస్తుంది.
కానీ మిల్లర్లు 100 కిలోల దొడ్డు బియ్యాన్ని తకువ ధరకు తెచ్చి లెక సరిచేస్తున్నారు. దీని మీద ఒక్కో మిల్లరు క్వింటాకు కనీసం రూ.1,000 చొప్పున లాభం పొందే అవకాశం ఏర్పడింది. మొత్తం 10 నుంచి 14 లక్షల మెట్రిక్ టన్నుల లెకన చూస్తే ఈ దోపిడీ రూ.600 కోట్లకు పైనే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసి మిల్లర్లకు ఇచ్చిన ధాన్యానికి సంబంధించి రావాల్సిన 16 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఏమైందనే దానిపై కొద్దిరోజుల క్రితం విజిలెన్స్ దాడుల్లో కీలక ఆధారాలు లభించినట్టు తెలుస్తున్నది. ప్రభుత్వం నుంచి తీసుకున్న సన్న వడ్లను బియ్యంగా మార్చి విక్రయించుకున్నారని గుర్తించినట్టు సమాచారం.
సన్న వడ్లను బియ్యంగా మార్చి బయట విక్రయించుకున్న మిల్లర్లు కోట్లు కూడబెట్టుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్కో ఏషిక (290 క్వింటాళ్లు)కు రూ.2.50 లక్షల వరకు లాభాలను ఆర్జించనున్నట్టు తెలుస్తున్నది. మరోవైపు తాము నష్టపోతున్నామని, మిల్లింగ్ చార్జీలు రావడం లేదని మిల్లర్లు మొసలి కన్నీరు కారుస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. తవుడు, నూకలతో వచ్చే లాభాలు అదనం కాగా విజిలెన్స్ దాడులు ఆపకపోతే మిల్లులను మూసేస్తామని ప్రభుత్వానికే అల్టిమేటం ఇచ్చేదాకా పరిస్థితి చేరింది.
సన్న బియ్యానికి బదులుగా దొడ్డు బియ్యం ఇస్తామని, ప్రభుత్వం ఈ విషయంలో సహకరించాలని మిల్లర్లు సివిల్ సప్లయీస్‌లో కీలక ప్రభుత్వ ప్రతినిధి మధ్యవర్తిత్వంతో ప్రభుత్వ పెద్దలను ఒప్పించారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఆయన తీరు అత్యంత అనుమానాస్పదంగా మారిం ది. వడ్లపై పూర్తి అవగాహన ఉన్న ఆయన అక్రమాలను అరికట్టాల్సింది పోయి, మిల్లర్లకు సహకరిస్తున్నారా? మిల్లర్లకే లాభం వచ్చేలా సలహాలు ఇస్తున్నారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సివిల్ సప్లయ్ కమిషనర్‌ను మిల్లర్లు తప్పుదోవ పట్టించారా? లేక కావాలనే అనుమతి ఇచ్చారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ మెతక వైఖరిని అలుసుగా తీసుకుని, బడా మిల్లర్లు ఏకంగా ప్రభుత్వాన్నే నిలువు దోపిడీ చేస్తున్నారని, ఈ సామ్‌పై పూర్తిస్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
పెద్దపల్లి జిల్లాలో 2025-26 వానకాలంలో సన్నరకాల ధాన్యం తీసుకున్న మిల్లర్లు ప్రభుత్వానికి 63 వేల టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉన్నది. వారంతా ప్రభుత్వానికి అప్పీల్ చేసుకున్నారు. కామన్ రకం వడ్ల ధరకు, ఏ గ్రేడ్ వడ్ల ధరకు ఉన్న వ్యత్యాసాన్ని తాము డీడీల రూపంలో చెల్లిస్తామని, సన్న బియ్యం బదులుగా దొడ్డు(కామన్) బియ్యాన్ని ఇచ్చే అవకాశాన్ని ఇవ్వాలని కోరారు. వారి కోరిక మేరకే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ ప్రకారం జిల్లాలో మిల్లర్ల నుంచి డీడీలను స్వీకరిస్తున్నాం.
– ముప్పిడి శ్రీకాంత్, జిల్లా మేనేజర్, పౌరసరఫరాల సంస్థ, పెద్దపల్లి జిల్లా