న్యూఢిల్లీ, అక్టోబర్ 4: నీట్-యూజీ 2026 ప్రశ్న పత్రం లీక్ కేసులో సీబీఐ వారం రోజుల్లో తన రెండవ, తుది చార్జ్‌షీట్‌ను దాఖలు చేయనున్నది. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వాన్ని కాని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) అధికారులను కాని నిందితులుగా సీబీఐ పేర్కొనబోదని మీడియా కథనాలు పేర్కొన్నాయి. నిందితులలో ఎన్టీఏ నియమించిన సబ్జెక్ట్ నిపుణులు, కోచింగ్ సెంటర్ నిర్వాహకులు, మధ్యవర్తులు, అభ్యర్థులు మాత్ర మే ఉంటారు.
ఈ కేసులో రాజస్థాన్, హర్యానా, మహారాష్ట్రలకు చెందిన 13 మందిని సీబీఐ ఇప్పటివరకు అరెస్టు చేసింది. వీరిని ప్రధాన నిందితులుగా కూడా పేర్కొంది. సీబీఐ తన మొదటి చార్జ్షీట్ని జూలై 28న దాఖలు చేసింది. ఇతర కుట్రదారుల పాత్రపై దర్యాప్తును కొనసాగిస్తున్నట్టు సీబీఐ అప్పట్లో పేర్కొన్నది. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీ(సీఎఫ్ఎస్ఎల్), గవర్నమెంట్ ఎగ్జామినర్ ఆఫ్ క్వశ్చన్ డాక్యుమెంట్స్(జీఈక్యూడీ), ఢిల్లీ విశ్వవిద్యాలయ నిపుణుల నుంచి అభిప్రాయ నివేదికల కోసం సీబీఐ ఎదురుచూస్తున్నది.
సీబీఐ దాఖలు చేసిన మొదటి చార్జ్‌షీట్ ప్రకారం నీట్-యూజీ 2026 ప్రశ్నపత్రం తయారీలోని వివిధ దశల్లో ఎన్టీఏ అదే ముగ్గురు సబ్జెక్ట్ నిపుణులను మళ్లీ నియమించుకుంది.నమ్మకద్రోహం, సాక్ష్యాలను ధ్వంసం చేయడం వంటి అంశాలకు సంబంధించి వివిధ సెక్షన్ల కింద నిందితులపై కేసు నమోదు చేసిన సీబీఐ వారి బ్యాంక్ ఖాతాలు, బ్యాంక్ లాకర్లు, డీమ్యాట్ ఖాతాను కూడా స్తంభింపచేసింది. నీట్-యూజీ 2026 పరీక్ష మే 3న జరిగింది. ప్రశ్నపత్రం లీక్ అయిందన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం, ఎన్టీఏ ఆ పరీక్షను రద్దు చేశాయి. ఆ తర్వాత జూన్ 21న పరీక్షను మళ్లీ నిర్వహించారు. ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 20 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.