నేడు తెలంగాణ దీక్షా దివస్అది.. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అని నినాదమిచ్చిన కేసీఆర్.. రాష్ట్ర సాధన కోసం మృత్యువును ముద్దుపెట్టుకొనేందుకు తెగించిన రోజు! అది.. దశాబ్దాలుగా గోసపడుతున్న తెలంగాణ ప్రాంతం సాగిస్తున్న ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఒక అపూర్వ ఘట్టం! నవంబర్ 29! తెలంగాణ మర్చిపోలేని రోజు! సరిగ్గా పన్నెండేండ్లక్రితం ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ తెలంగాణ కోసం ఆమరణ దీక్షకు దిగిన ఉద్విగ్న సందర్భం! మహాత్ముడి అహింసా మార్గంలో ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్.. తన దీక్షతో నాటి యూపీఏ ప్రభుత్వంతో ‘డిసెంబర్ 9 ప్రకటన’ చేయించగలిగారు! తన ప్రాణాన్ని పణంగా పెట్టి.. పోరుత్తేజాలకు కొత్త ఊపిరులూదారు. అందుకే.. ‘కేసీఆర్ దీక్షకు ముందు.. దీక్ష తర్వాత’అన్నట్టు ఉద్యమాధ్యాయంలో పూర్వోత్తరాలను వేరుచేసి చర్చించేలా మెరిసిన ఆ సందర్భాన్ని ఉద్యమశక్తులు ప్రతిఏటా తెలంగాణ దీక్షాదివస్‌గా పాటిస్తున్నాయి.
హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): దశాబ్దాల వలస పాలనకు చరమగీతం పాడి, స్వరాష్ట్ర సాధన కోసం ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అంటూ నాటి ఉద్యమ నేత నేటి సీఎం కే చంద్రశేఖర్‌రావు ప్రాణత్యాగానికి తెగించిన రోజు నవంబర్ 29. పుష్కర కాలం క్రితం 2009లో ఉద్యమాన్ని నీరుగార్చేందుకు, ఉద్యమ నాయకుడిని నిర్బంధించేందుకు నాటి పాలకులు ఎన్నో కుయుక్తులు పన్నారు. అడుగడుగునా వందల సంఖ్యలో పోలీసులను మోహరించి కేసీఆర్ దీక్షను భగ్నం చేసేందుకు ప్రయత్నించారు. ముందురోజే కేసీఆర్‌ను అరెస్టుచేసి రాత్రికి రాత్రే ఉద్యమ గొంతను మూయిస్తారనే ప్రచారం తెలంగాణ అంతటా పాకిపోయేలా చేశారు.
అయితే పోలీసుల ఎత్తులను ఉద్యమకారులు చిత్తుచేశారు. కరీంనగర్‌లోని కేసీఆర్ ఇంటినుంచి ఆయనను అరెస్టు చేసేందుకు పారామిలిటరీ దళాలు రంగంలోకి దిగాయి. ఈ వార్త తెలిసి కరీంనగర్నుంచే కాకుండా తెలంగాణ అంతటి నుంచి ఉద్యమకారులు కేసీఆర్ ఇంటికి చేరుకున్నారు. ఆ రోజు రాత్రి 10గంటల నుంచి తెల్లవారుజామున మూడు గంటల వరకు పోలీసులకు, ఉద్యమకారులకు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్ శ్రేణులు, ఉద్యమకారులు ‘ఇంట్లోకి వస్తే తమను తాము ఆత్మాహుతి చేసుకుంటాం’ అని తెగేసిచెప్పటంతో అప్పటికప్పుడు పోలీసులు వెనక్కి తగ్గారు. మరుసటి రోజు నవంబర్ 29న సిద్దిపేటలో ఆమరణ నిరాహారదీక్ష చేపట్టేందుకు కేసీఆర్ బయల్దేరారు.
ఆయన వెంట వందల సంఖ్యలో టీఆర్ఎస్ శ్రేణుల వాహనాలు కూడా బయల్దేరాయి. అయితే పోలీసులు ఎక్కడి వాహనాలను అక్కడ అడ్డుకొని, తమ వాహనాలతో కేసీఆర్ కారును చుట్టుముట్టి ఆయనను అరెస్టు చేశారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో వరంగల్ మీదుగా ఖమ్మం జైలుకు తరలించారు. సిద్దిపేట దీక్షాస్థలికి వెళ్లనీయకుండా అడ్డుకోగలరు కానీ తన వజ్రసంకల్పాన్ని అడ్డుకోలేరని తేల్చిచెప్పిన కేసీఆర్ ఖమ్మం సబ్జైల్లోనే ఆమరణదీక్షకు దిగారు. అప్పటి నుంచి 11 రోజుల పాటు తెలంగాణ అంతటా అగ్నిగుండమైంది. ఆందోళనలతో అట్టుడికింది. అదే సమయంలో శ్రీకాంతచారి తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఉద్యమం మరింత ఉగ్రరూపం దాల్చింది.
అన్నివర్గాల ప్రజలు ఉద్యమంలోకి దిగారు. దీక్ష వల్ల ఆరోగ్యం క్షీణించడంతో కేసీఆర్‌ను సబ్‌జైల్ నుంచి ఖమ్మం దవాఖానకు.. అక్కడి నుంచి హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. నిమ్స్‌లో ఆరోగ్యం విషమిస్తున్నా.. ప్రాణంపోయినా సరే తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి తీరుతానని శపథం చేశారు. ప్రాణత్యాగానికి కేసీఆర్ వెనుకాడని తీరుకు దేశం యావత్తు నివ్వెరపోయింది. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇవ్వక తప్పని అనివార్యతను సీఎం కేసీఆర్ సృష్టించారు. డిసెంబర్ 9న యూపీఏ ప్రభుత్వంతో తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేయించారు. తదుపరి అనేక అడ్డంకులను అధిగమించి.. రాష్ర్టాన్ని సాధించారు. కేసీఆర్ దీక్షకు దిగిన ఆ రోజు.. తెలంగాణ చరిత్రలో అజరామరంగా నిలిచిపోయింది. ఆ సందర్భాన్ని ప్రతిఏటా ‘దీక్షాదివస్’గా రాష్ట్ర ప్రజలు జరుపుకొంటున్నారు.
హైదరాబాద్, నవంబర్28 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ సచ్చుడో- తెలంగాణ వచ్చుడో అన్న నినాదంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అమరణ నిరాహారదీక్షకు దిగిన నవంబర్ 29వ తేదీ చరిత్రను మలుపు తిప్పిన రోజు అని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ చరిత్రాత్మకమైన రోజును ఏటా దీక్షాదివస్ పేరిట జరుపుకొంటున్నామని గుర్తుచేశారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చేందుకు టీఆర్ఎస్ను స్థాపించి, సబ్బండ వర్గాల ప్రజలను ఏకం చేసి మహోద్యమాన్ని నడిపిన ఉద్యమనేత కేసీఆర్ అని కొనియాడారు. ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ర్టాన్ని అనతి కాలంలోనే అన్ని రంగాల్లో ప్రగతిపథాన పరుగులు పెట్టిస్తున్నారని ప్రకటనలో పేర్కొన్నారు.