హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): నేరాల నియంత్రణలో వెనుకబడిన పోలీసు యూనిట్లు తమ పనితీరును మెరుగుపర్చుకోవాలని డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశించారు. నూతన చట్టాల అమలుతోపాటు నేరాల నియంత్రణ, దర్యాప్తు నాణ్యత, నేర నిరూపణ శాతం పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా క్రైమ్ ర్యాంకింగ్‌లో వెనుకబడిన యూనిట్ల కమిషనర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో గురువారం సీఐడీ కార్యాలయంలో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.
పనితీరులో మెరుగుదల సాధిస్తేనే జాతీయస్థాయిలో మెరుగైన ర్యాంకు సాధ్యమవుతుందని సూచించారు. జాతీయస్థాయిలో నూతన క్రిమినల్ చట్టాల అమలు ర్యాంకింగ్‌లో తెలంగాణ 60.15 సోర్తో నిలిచింది. రాబోయే రోజుల్లో జీరో ఎఫ్ఐఆర్, ఆన్లైన్ చార్జిషీట్, ఈ-సాక్ష్య, ఈ-సమన్లు వంటి అంశాలను మరింత సమర్థవంతంగా అమలు చేస్తే రాష్ట్ర ర్యాంకింగ్‌ను గణనీయంగా మెరుగుపర్చే అవకాశం ఉన్నదని పేరొన్నారు.