రంగారెడ్డి (నమస్తే తెలంగాణ)/ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 8: పంటలు సాగు చేసుకోవడానికి తమ భూములను బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం పొందుతున్న రైతుల అమాయకత్వాన్ని కొన్ని బ్యాంక్‌లు క్యాష్‌గా మలుచుకుంటున్నాయి. రైతులు తనఖాపెట్టిన భూ పత్రాలు, బంగారం, పాస్‌బుక్‌లను ప్రైవేట్ వ్యక్తుల వద్ద తనఖా పెట్టి కోట్ల రూపాయలు కాజేస్తున్న ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో వెలుగు చూసింది.
దండుమైలారం సహకార బ్యాంక్‌లో రైతులు తమ పాసుబుక్కులు, బంగారం తనఖా పెట్టి రుణం పొందారు. వడ్డి సహా అప్పు తీర్చిన కొందరు రైతులు తాము తనఖా పెట్టిన పాస్‌బుక్కులు వెనక్కి ఇవ్వాలని కోరగా బ్యాంక్ అధికారులు కాలయాపన చేశారు. అప్పు తీర్చాక కూడా తమ భూ పత్రాలు ఎందుకు ఇవ్వడంలేదని రైతులంతా కలిసి సహకార బ్యాంక్ ఎదుట ఆందోళన చేపట్టి, అధికారులను నిలదీయగా ప్రైవేట్ వ్యక్తుల వద్ద పాస్‌బుక్కులు తనఖా పెట్టి బ్యాంక్ అధికారులు డబ్బులు పొందిన భారీ స్కామ్ వెలుగుచూసింది.
బ్యాంకు పరిధిలోని ముకునూరు గ్రామానికి చెందిన రైతు అచ్చన శ్రీశైలం తన 4.20 ఎకరాలకు సంబంధించిన పాస్‌పుస్తకాన్ని దండుమైలారం సహకార బ్యాంకులో తాకట్టుపెట్టి రూ.10లక్షల అప్పు తీసుకున్నాడు. శ్రీశైలం పాస్‌బుక్‌ను బ్యాంకు సిబ్బంది యాదాద్రి భువనగిరిజిల్లా నారాయణపూర్‌కు చెందిన లచ్చునాయక్ వద్ద తాకట్టుపెట్టి అప్పు తీసుకున్నారు. బ్యాంకు సిబ్బందికి లచ్చునాయక్ పలుమార్లు ఫోన్లు చేసినా స్పందించకపోవడంతో శ్రీశైలం పాస్‌బుక్ తీసుకుని ముకునూరుకు వెళ్లాడు.
అనుమానం వచ్చిన శ్రీశైలం బ్యాంకుకు వెళ్లి తన పాస్‌బుక్ గురించి ఆరా తీయగా సిబ్బంది సమాధానం చెప్పకుండా దాటవేశారు. దీంతో పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో బ్యాంకు సిబ్బంది లీలలు బయటపడ్డాయి. పోలీసులు బ్యాంకు సిబ్బంది మధుపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మిగతా రైతులు తమ పాస్‌బుక్‌లు, బంగారం బ్యాంకులో ఉన్నాయా …లేవా అనే అనుమానంతో మూడు రోజులుగా బ్యాంకు ఎదుట ఆందోళన చేస్తున్నారు.