యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): రైస్ మిల్లుల్లో ధాన్యం గోల్మాల్ కు అడ్డుకట్ట పడటం లేదు. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యానికి, మిల్లుల్లో ఉన్న స్టాక్‌కు పొంతన కుదరడం లేదు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఓ మిల్లులో సివిల్ సపె్లై విజిలెన్స్ అధికారుల తనిఖీలో వెల్లడైన విస్తుపోయే నిజాలే ఇందుకు ఉదాహరణ. యాదాద్రి భువనగిరి జిల్లాలో 40 వరకు రైస్‌మిల్లులు ఉన్నాయి. ప్రతి సీజన్లో ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి సీఎంఆర్ కోసం మిల్లులకు పంపుతుంది. మిల్లర్లు ఆ ధాన్యాన్ని ఆడించి బియ్యంగా మార్చి పౌరసరఫరాల శాఖ లేదా ఎఫ్‌సీఐకి అప్పగించాలి. ఇదేవిధంగా 2025-26 వానకాలానికి సంబంధించి రాయగిరిలోని శివ రైస్ మిల్లుకు 12,379 టన్నుల ధాన్యం కేటాయించింది.
ఇటీవల అధికారులు ర్యాండమైజేషన్గా మిల్లుల్లో తనిఖీలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా బుధవారం రైస్‌మిల్లుపై విజిలెన్స్ అధికారులు మెరుపు తనిఖీలు నిర్వహించారు. మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి ఒంటి గంటవరకు లెకలు తీయగా విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. పెద్దమొత్తంలో ధాన్యం గాయబ్ అయినట్టు అధికారులు గుర్తించారు. కాగితాలపై ఉన్న లెకలకు, వాస్తవ నిల్వలో భారీ తేడాలు ఉన్నట్టు తేల్చారు. లెకల ప్రకారం మిల్లులో 6,302.8 టన్నుల వడ్ల నిల్వలు లేవు. మిల్లులో ఉండాల్సిన 1.57 లక్షల బస్తాలు మాయమయ్యాయి. ఇప్పటి వరకు 2,882 సీఎంఆర్ డెలివరీ చేయగా.. ఇంకా 5,668 టన్నుల బియ్యం బకాయి ఉన్నది. వీటి విలువ రూ. 18.49 కోట్లు ఉంటుందని అధికారులు చెప్తున్నారు.
మిల్లర్ల అసోసియేషన్‌లో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ నేతది శివ రైస్ మిల్లు కావడంతో విజిలెన్స్ తనిఖీల్లో నిజాలు బహిర్గతమైనా చర్యలకు అధికారులు వెనుకాడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గురువారం సాయంత్రం వరకు మిల్లుకు నోటీసులు కూడా జారీ చేయలేదు. శుక్రవారం జారీ చేస్తామని జిల్లా సివిల్‌సైప్లె అధికారి శోభారాణి తెలిపారు. నోటీసులు ఇచ్చినా.. ఫలానా తేదీలోగా లెకలు చూపిస్తామని మిల్లు యాజమాన్యం సమాధానమిస్తే అంతా సర్దుకుంటుందనే ప్రచారం జరుగుతున్నది. బడా మిల్లులను చూసీచూడనట్టు వదిలేస్తూ సాధారణ మిల్లులను మాత్రం కేసులతో బలి చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.