Telangana | హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): ‘జిల్లాల సంఖ్య పెంచడం కాదు. అభివృద్ధి కేంద్రాల సంఖ్యను పెంచాలి. పాలన ప్రజలకు సౌకర్యంగా ఉండాలి. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికీ చేరాలి. కొత్త రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరుగాలి. ప్రతి ఒక్క ఇంటికీ స్వరాష్ట్ర ఫలాలు చేరాలంటే పరిపాలన వికేంద్రీకరణ మంచి మార్గం’ – పదేండ్ల క్రితం కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా నాటి సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పిన మాటలివి. పదేండ్లు గడిచాయి.
కొత్త జిల్లాల ఏర్పాటుతో నాడు కేసీఆర్ వేసిన వికేంద్రీకరణ బీజం.. అద్భుత ఫలితాలు సాధిస్తున్నది. గడిచిన మూడేండ్లుగా కాంగ్రెస్ పార్టీ పాలనను గాలికి వదిలివేసినా రాష్ట్రం ఇంకా ఈ స్థాయిలో నిలబడిందంటే ఆనాడు కేసీఆర్ వేసిన పునాదులే కారణమన్నది విశ్లేషకుల మాట. తెలంగాణ తలరాతను మార్చేసిన జిల్లాల పునర్వ్యవస్థీకణకు ఈ నెల 11తో పదేండ్లు పూర్తవుతాయి. ‘10 జిల్లాలను వికేంద్రీకరించాలన్న కేసీఆర్ ఆలోచన సక్సెస్’ అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి.
స్వరాష్ట్రం ఏర్పడితే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తానని, పాలన ప్రజల చెంతకు తీసుకెళ్తామని 2014కు ముందే ఉద్యమసేనానిగా కేసీఆర్ ప్రకటించారు. 2014 జూన్‌లో అధికారం చేపట్టిన వెంటనే మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించారు. 2016 అక్టోబర్ 11న రాష్ర్టాన్ని ‘31 జిల్లాల తెలంగాణ’గా మారుస్తూ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ప్రజల నుంచి వచ్చిన విజ్ఙప్తుల ఆధారంగా మరో రెండు జిల్లాలు చేర్చారు. కొత్త, పాతవి కలిపి 33 జిల్లాలు ఏర్పాటయ్యాయి. 459 మండలాలను 565కు పెంచారు. జీపీల సంఖ్య 8,368 నుంచి 12,760కు పెరిగింది. కొత్త రెవెన్యూ డివిజన్లు, మున్సిపాలిటీలు ఏర్పాటయ్యాయి. జిల్లా పరిషత్తుల సంఖ్య 9 నుంచి 31కి పెరిగాయి. కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంతో తెలంగాణ పాలన, అభివృద్ధి, సంక్షేమ స్వరూపం మారిపోతుందని ఆర్థిక రంగ నిపుణులు అంచనా వేశారు. అందరి అంచనాలకు మించి తెలంగాణలో పాలనా వికేంద్రీకరణ సత్ఫలితాలు ఇచ్చింది. కేసీఆర్ పాలనలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందడంలో జిల్లాల పునర్విభజన కీలక పాత్ర పోషించింది. పడటంతో అన్ని రంగాలూ దూసుకుపోయాయి. ఈ ఫలితాలను చూసి ఏపీ కూడా జిల్లాల పునర్విభజనకు పూనుకున్నది.
తెలంగాణలో 2016-2017 నాటికి తెలంగాణ తలసరి ఆదాయం రూ. లక్షా 55 వేలు కాగా, 2025-2026 నాటికి రూ.4.18 లక్షలకు పెరిగింది. వెనుకబడిన జిల్లాలుగా పేరున్న మహబూబ్‌నగర్‌లో తలసరి ఆదాయం 2016 నాటికి రూ.77,300 ఉండేది. ఏకంగా రూ.3.37 లక్షలకు పెరిగింది. 336% పెరుగుదల నమోదు చేసింది. వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ జిల్లాల్లో రెండు వందల శాతానికిపైగా అభివృద్ధి నమోదైంది. రంగారెడ్డి జిల్లాలో 2016 నాటికి సుమారు రూ.నాలుగు లక్షలుగా ఉన్న తలసరి ఆదాయం 2026 నాటికి ఏకంగా రూ.పదకొండున్నర లక్షలకుపైగా పెరిగింది. ఇది ఒక రికార్డుగా చెప్పవచ్చు. దేశంలో ఇంత వేగంగా తలసరి ఆదాయం పెరిగి, దేశంలోనే తెలంగాణ నంబర్ వన్‌గా నిలువడంలో చిన్న జిల్లాల ఏర్పాటు ముఖ్యమైన పాత్ర పోషించింది.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో ఒక్క హైదరాబాద్ తప్ప మిగిలిన ప్రాంతాలను కనీసం పట్టించుకునేవారు కాదు. కానీ, తెలంగాణ ఏర్పాటు తర్వాత కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకొని ప్రతిజిల్లానూ అభివృద్ధి చేసేందుకు కేసీఆర్ సర్కార్ ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లింది. ఒకప్పుడు ఐటీ అంటే హైదరాబాద్‌లో మాత్రమే ఉండేది. కానీ, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత జిల్లాల్లో ఐటీ టవర్లను నిర్మించారు. ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసేవారికి ప్రోత్సాహకాలు ఇచ్చారు.
దీంతో వరంగల్, కరీంనగర్, సిద్దిపేట, ఖమ్మం వంటి నగరాలకు ఐటీ కంపెనీలు విస్తరించాయి. టైర్-2 సిటీలు అభివృద్ధి చెందాయి. అంతేకాదు, ఆయా జిల్లాల నైసర్గిక పరిస్థితులను బట్టి అనువైన పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం అందించారు. ములుగులో ఎకో టూరిజం, వికారాబాద్‌లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, పర్యాటక రంగం, మహబూబ్‌నగర్‌ను ఫుడ్‌ప్రాసెసింగ్, లాజిస్టిక్స్, యాదాద్రిభువనగిరి జిల్లాలో వస్తు తయారీ రంగం, నిజామాబాద్‌లో ఆహార ప్రాసెసింగ్, రాజన్న సిరిసిల్ల, వరంగల్‌లో వస్త్ర పరిశ్రమను ప్రోత్సహించారు. దీంతో 33 జిల్లాల్లో వేలాది ఎంఎస్ఎంఈ పరిశ్రమలు వచ్చాయి.
కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజల సమస్యల పరిష్కారంలో వేగం పెరిగింది. ఉదాహరణకు గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్ ప్రాంతంలోని ఒక గ్రామానికి చెందిన వ్యక్తి తన సమస్యల పరిష్కారానికి కలెక్టర్‌ను కలువాలంటే ఒక రోజంతా ప్రయాణం చేసి ఆదిలాబాద్‌కు వెళ్లాల్సి వచ్చేది. కానీ, జిల్లాల పునర్విభజన తర్వాత ఆసిఫాబాద్‌లోనే కలెక్టర్ కార్యాలయం వచ్చింది. ఎస్పీ, కలెక్టర్, జిల్లా కోర్టు, జిల్లా స్థాయి అధికారులంతా రావడంతో దాని స్వరూపమే మారింది.
సమస్యల పరిష్కారంలో వేగం పెరిగింది. జిల్లాలోని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లి వచ్చేందుకు 2-3 గంటలు సరిపోయేలా ఉండటంతో పర్యవేక్షణ పెరిగింది. శాంతిభద్రతలు మెరుగయ్యాయి. పోలీసింగ్ పెరిగింది. దీంతోపాటు రెవెన్యూ సంబంధ వ్యవహారాల్లో జాప్యం లేకుండా పరిష్కారమయ్యాయి. కోర్టులు కూడా రావడంతో కేసుల పరిష్కారం కూడా త్వరితగతిన పూర్తవుతున్నాయి. అధికారులు అందుబాటులో ఉండటం పెరిగింది. అధికారులకు కూడా పాలన సులువైంది. కొత్త కలెక్టరేట్లు, పోలీసు కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ భవనాలు నిర్మితమయ్యాయి. దీనివల్ల భూముల ధరలు పెరిగి ప్రజల ఆర్థిక శక్తి కూడా పెరిగింది. భూముల విలువ పెరుగడం స్థానికులకు ఆర్థిక భరోసా ఇచ్చింది.
కొత్త జిల్లాల నేపథ్యంలో రాష్ట్రంలో యువ నాయకత్వం కూడా పెరిగింది. కొత్త మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్‌లు, మండలాలు ఏర్పడటంతో కొత్త నాయకత్వానికి అవకాశాలు వచ్చాయి. జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్లుగా అనేకమంది తమ రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. రాష్ర్టానికి, దేశానికి నూతన నాయకత్వాన్ని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అందించారని చెప్పవచ్చు.
కొత్త జిల్లాల ఏర్పాటుతో మౌలిక వసతుల కల్పన కూడా పెరిగింది. రాష్ట్ర రాజధాని నుంచి ప్రతిజిల్లా కేంద్రానికీ నాలుగు లైన్ల రహదారిని అభివృద్ధి చేశారు. గ్రామం నుంచి మండలానికి, అక్కడినుంచి జిల్లా కేంద్రాలకు కూడా రోడ్ కనెక్టివిటీని పెంచారు. దీంతో రహదారుల విషయంలో తెలంగాణ దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. ఉత్తమ కనెక్టివిటీ ఉన్న రాష్ర్టాల్లో ఒకటిగా నిలిచింది. మరోవైపు, ప్రతి కొత్త జిల్లాలో కూడా ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పడింది. దీంతో వైద్య సేవలు, వైద్య విద్య అందుబాటులోకి వచ్చింది.
నిపుణులైన వైద్యుల కొరత తీరింది. ప్రజలకు ఉచితంగా మంచి వైద్యం అందుబాటులోకి వచ్చింది. కొత్త మండలాలు ఏర్పడటంతో అక్కడ కొత్తగా మండల కార్యాలయాలు వచ్చాయి. గురుకుల పాఠశాలలు, మార్కెటింగ్ కార్యాలయాలు, ఎండీవో కార్యాలయాలు, వ్యవసాయ అధికారులు వచ్చారు. వీరంతా రావడంతో వసతులు మెరుగయ్యాయి. విద్యుత్తు సరఫరా మెరుగుపడింది. నాణ్యమైన విద్యుత్తు సరఫరాకు అవకాశాలు పెరిగాయి. జిల్లా స్థాయిలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉండటంతోనే ఇది సాధ్యమైంది. కొత్త సబ్స్టేషన్లు, ఫీడర్ల ఏర్పాటు వంటివి విస్తృతంగా జరిగాయి.