అప్పుడేమో మునుగోడులో కాంగ్రెస్ గెలువదు? డిపాజిట్ కూడా రాదన్నారు. ఇప్పుడేమో తెలంగాణలో కాంగ్రెస్కు గెలిచే పరిస్థితే లేదని ఆ పార్టీ ఎన్నికల ప్రధాన స్టార్ కాంపేయినర్, ఎంపి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వ్యాఖానించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని, తొలి సంతకం ధరణి రద్దుపైనే అని ఒకవైపు రేవంత్రెడ్డి తన పాదయాత్రలో ధీమా వ్యక్తం చేస్తుండగా, మరోవైపు అసలు కాంగ్రెస్ గెలిచే పరిస్థితే లేనప్పుడు తొలి సంతకం…మలి సంతకం అన్న ప్రశ్నెక్కడిదని పరోక్షంగా కోమటిరెడ్డి విశ్లేషించారు.
ఈ వ్యాఖ్యలు పార్టీ నేతలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఇప్పటికే పార్టీ కేడర్ తీవ్ర నిరాశ, నిస్పృహలో ఉన్న నేపథ్యంలో కోమటిరెడ్డి అలా మాట్లాడటం ఏమిటని రాష్ట్ర ఇంచార్జీ మాణిక్ థాక్రేకు ఫిర్యాదు చేసారు. ఆగమేఘాలపై కోమటిరెడ్డిని థాక్రే పిలిపించి వివరణ కోరారు. ఆ తర్వాత ఇంచార్జీ స్పందించలేదు. అంటే దాని అర్థం ‘మౌనం అర్థాంగీకారం’ అన్నట్టే కదా?. అందుకేనేమో…మీ ఇంచార్జీ ఏమన్నారని కోమటిరెడ్డిని అడిగితే ‘లైట్ తీసుకో’మన్నారని చెప్పారు.
– వెల్జాల