హైదరాబాద్, మార్చి19 (నమస్తే తెలంగాణ ) : బడ్జెట్ ప్రసంగం ఆద్యంతం అంబేద్కర్ కొటేషన్లను వల్లేవేసిన ప్రభుత్వం కేటాయింపుల్లో మాత్రం ఆ స్ఫూర్తిని చూపలేదు. చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ను తుంగలో తొక్కింది. అంబేద్కర్ అభయహస్తం ద్వారా రూ.12 లక్షలు అందిస్తామని చెప్పి, ఇప్పుడు అందుకు విరుద్ధంగా దళితబంధు పథకం నిధుల్లో కోత విధించింది. దళితబంధు పథకాన్ని మాజీ సీఎం కేసీఆర్ రూపకల్పన చేసి, అమలు చేసిన విషయం తెలిసిందే. ఎలాంటి షరతులు లేకుండా, బ్యాంకు లింకేజీ లేకుండా నిరుపేద దళిత కుటుంబాలకు ఏకమొత్తంగా రూ.10 లక్షల నగదును గత బీఆర్ఎస్ సర్కారు అందించింది. తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 44 వేల కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని అందజేయగా, అందుకు రూ.4,400 కోట్లను వెచ్చించింది. ఆ పథకానికి 2023-24 బడ్జెట్లోనూ భారీగా నిధులను కేటాయించారు. నియోజకవర్గానికి 1500 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా హుజురాబాద్ మినహాయించి 118 నియోజకవర్గాల్లో మొత్తంగా 17,700 కుటుంబాలకు దళితబంధు పథకం ద్వారా ఆర్థిక సాయాన్ని అందజేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే దళితబంధును కొనసాగిస్తామని, అంబేద్కర్ అభయహస్తం పేరిట ఒక్కో దళిత కుటుంబానికి రూ.12 లక్షలు అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. చేవెళ్లలో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సభలో ఈ మేరకు కాంగ్రెస్ ప్రకటించింది. అయితే బడ్జెట్లో ఆ పథకం ఊసెత్తలేదు. అంబేద్కర్ అభయహస్తం పథకం ఏమో కానీ, ఉన్న దళితబంధు నిధుల్లోనే కోత విధించింది. దళితబంధు పథకానికి గత బడ్జెట్లో అరకొరగా రూ.2 వేల కోట్లను కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్లో రూ.1000 కోట్లను మాత్రమే పొందుపరిచింది. ఇదిలా ఉంటే ఆ వెయ్యి కోట్లలోనూ దాదాపు రూ.500 కోట్లు బకాయిలకే పోనున్నాయి. దీంతో ఉన్న దళితబంధుతో పాటు, అంబేద్కర్ అభయహస్తం పథకం కూడా ఉత్త ముచ్చటగానే మారింది.