హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను మళ్లిస్తున్నదని బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ మరోసారి వాదించింది. ఆ మేరకు కృష్ణా జలాల వినియోగం తగ్గుతుందని, ఆ నీటిని తెలంగాణకు కేటాయించవచ్చని నివేదించింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సెక్షన్-3 మార్గదర్శకాల మేరకు ఇరు రాష్ర్టాల మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీకి సంబంధించి జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ చేపట్టిన విచారణ ఢిల్లీలో బుధవారం సైతం కొనసాగింది.
ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ బ్రిజేశ్‌కుమార్, సభ్యులు జస్టిస్ రామ్మోహన్‌రెడ్డి, జస్టిస్ ఎస్ తలపాత్ర ఎదుట తెలంగాణ సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ వాదనలను కొనసాగించారు. ఏపీ ప్రభుత్వం ఏయే ప్రాజెక్టుల ద్వారా గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లిస్తున్నదో వివరించారు.
పోలవరం పూర్తయ్యే వరకే గోదావరి జలాలను తరలిస్తామని పేర్కొంటూ పట్టిసీమ ప్రాజెక్టును తాత్కాలికంగా చేపట్టినప్పటికీ, దానిని తొలగించే ఉద్దేశం ఏపీకి లేదని, శాశ్వతంగా కొనసాగిస్తుందని తెలిపారు. తద్వారా గోదావరి జలాలను అదనంగా కృష్ణా డెల్టాకు తరలించే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. దీంతో ఎగువన కృష్ణా జలాల వినియోగం ఏపీకి తగ్గుతుందని, తద్వారా ఆదా చేసే జలాలను తెలంగాణకు కేటాయింవచ్చని సూచించారు. గురువారం కూడా ట్రిబ్యునల్ విచారణ కొనసాగనున్నది.