హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ఆదాయం పెరిగినప్పటికీ దానికి మించిన వేగంతో రెవెన్యూ వ్యయం, అప్పులపై ఆధారపడటం పెరిగిపోతున్నది. పన్ను ఆదాయం పెరుగుతున్నంత వేగంగా ప్రభుత్వ ఖర్చులు అదుపులోకి రాకపోవడం ఆర్థిక నిర్వహణలోని లోపాలను ఎత్తిచూపుతున్నది. కాంగ్రెస్ సర్కార్ నాలుగు నెలల్లో రూ.33,729.98 కోట్ల నికర అప్పులు చేసింది. వార్షిక నిర్దేశిత రుణసమీకరణలో ఇది 57.70 శాతం కావడం ఆందోళన కలిగిస్తున్నది. అదే సమయంలో ఆదాయం మాత్రం కేవలం రూ.59,642.62 కోట్ల (24.72 శాతం) మేరకు సమకూరింది. బుధవారం రాత్రి విడుదలైన జూలై నెల కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.58,458.71 కోట్ల మేర అప్పులు సేకరించాలని వార్షిక బడ్జెట్లో అంచనా వేసింది. ప్రభుత్వం జూలై నాటికి రూ.33,729.98 కోట్ల రుణాలను సేకరించింది. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలలు ఏప్రిల్ నుంచి జూలై వరకు వచ్చిన గణాంకాలను గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే.. ప్రభుత్వ ఖజానాపై పెరుగుతున్న ఒత్తిడిని సూచిస్తున్నది. 2026-27 ఏప్రిల్-జూలై మధ్య రాష్ట్రానికి రూ.59,642.62 కోట్ల రెవెన్యూ రాబడి వచ్చింది. నిరుడు ఇదే నాలుగు నెలల్లో వివిధ రాబడి విభాగాల నెలవారీ గణాంకాల మొత్తం సుమారు రూ.50,270.25 కోట్లు. అంటే ఈ ఏడాది రెవెన్యూ రాబడిలో దాదాపు రూ.9,372.37 కోట్ల (18.64 శాతం) పెరుగుదల నమోదైంది. అదే సమయంలో రెవెన్యూ వ్యయం రూ.78,909.45 కోట్లకు చేరింది. గత ఏడాది ఏప్రిల్ -జూలైలో ఇదే వ్యయం సుమారు రూ.62,835.02 కోట్లు. అంటే ఖర్చు రూ.16,074.43 కోట్లు, 25.58 శాతం పెరిగింది. ఆదాయం 18.64 శాతం ఉంటే, ఖర్చు మాత్రం 25.58 శాతం ఉండటం ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ లోపాన్ని ఎత్తిచూపుతున్నది.
ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు పన్నులే. జూలై వరకు పన్ను ఆదాయం రూ.53,004.40 కోట్లు. నిరుడు ఏప్రిల్-జూలైలో ఈ మొత్తం సుమారు రూ.48,145.57 కోట్లు. అంటే రూ.4,858.83 కోట్ల మేర, 10.09 శాతం పెరిగింది. అంటే పన్నుల వసూళ్లలో పెద్దగా క్షీణత లేకపోయినా.. ఆ డబ్బు ఎకడికి వెళ్తున్నది అన్నదే ఇప్పడు కీలక ప్రశ్నగా మారింది. పన్నేతర ఆదాయం ఈ ఏడాది జూలై వరకు రూ.4,274.55 కోట్లు. నిరుడు ఏప్రిల్ -జూలై నెలవారీ మొత్తాలు కలిపితే కేవలం రూ.1,334.21 కోట్లు. అంటే ఒక ఏడాదిలో రూ.2,940.34 కోట్ల మేర, ఏకంగా 220.38 శాతం పెరుగుదల నమోదైంది. గ్రాంట్లు, కాంట్రిబ్యూషన్లూ రూ.2,363.67 కోట్లకు చేరాయి. నిరుడు ఇదే కాలంలో సుమారు రూ.790.47 కోట్లతో పోలిస్తే దాదాపు 199 శాతం పెరుగుదల. అయినా ఖర్చుల వేగం పెరుగుదల కారణంగా ఖజానా ఒత్తిడి తగ్గలేదు.
జూలై నాటికి అప్పులు, ఇతర లయబిలిటీస్ (నికర) రూ.33,729.98 కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఏప్రిల్ -జూలైలో ఇదే నాలుగు నెలల నెలవారీ మొత్తాలు సుమారు రూ.24,669.86 కోట్లు. అంటే నికర అప్పుల భారం రూ.9,060.12 కోట్లు, 36.73 శాతం పెరిగింది. బడ్జెట్లో 2026-27 ఏడాదికి నికర అప్పులు, ఇతర బాధ్యతల అంచనా రూ.58,458.71 కోట్లు కాగా.. కేవలం నాలుగు నెలల్లోనే 57.70 శాతానికి చేరాయి. ఏడాదిలో నాలుగు నెలలే పూర్తయ్యాయి. ఇంకా ఎనిమిది నెలలు మిగిలి ఉండగానే అప్పులు 60 శాతానికి చేరాయి. ఇది ప్రభుత్వ ఆర్థిక ప్రణాళికపై అవగాహన లేదని స్పష్టంగా తెలియజేస్తున్నది.
జూలై వరకు రాష్ట్ర రెవెన్యూ రాబడి రూ.59,642.62 కోట్లు కాగా, రెవెన్యూ వ్యయం రూ.78,909.45 కోట్లుగా నమోదైంది. దీంతో తొలి నాలుగు నెలల్లోనే రూ.19,266.83 కోట్ల రెవెన్యూ లోటు నమోదైంది. 2026-27 మొత్తం బడ్జెట్లో రెవెన్యూ మిగులు రూ.6,857.76 కోట్లు ఉంటుందని అంచనా వేయగా.. నాలుగు నెలల్లోనే దానికి పూర్తి భిన్నంగా రూ.19,266.83 కోట్ల లోటు నమోదవడం ఆందోళనకరం. వ్యయ విభాగంలో అత్యంత గమనార్హమైన అంశం పెన్షన్ల ఖర్చు. జూలై వరకు పెన్షన్లపై రూ.10,492.35 కోట్లు ఖర్చయ్యాయి. నిరుడు ఏప్రిల్ -జూలైలో ఇదే ఖర్చు సుమారు రూ.6,149.96 కోట్లు. అంటే కేవలం ఏడాదిలో రూ.4,342.39 కోట్ల పెరుగుదల.. 70.61 శాతం ఎగబాకింది. మొత్తం ఏడాది పెన్షన్ బడ్జెట్ రూ.14,736.56 కోట్లు కాగా.. 4నెలల్లోనే 71.20 శాతం ఖర్చయింది. జీతాల ఖర్చూ పెరుగుతున్నది. సిబ్బంది జీతాలు, వేతనాలపై జూలై వరకు రూ.17,874.35 కోట్లు ఖర్చయ్యాయి. నిరుడు ఇదే కాలంలో రూ.15,961.63 కోట్లు. అంటే రూ.1,912.72 కోట్లు, 11.98 శాతం పెరుగుదల నమోదైంది. 2026-27 బడ్జెట్లో జీతాల కోసం రూ.48,358.21 కోట్లు కేటాయించగా.. నాలుగు నెలల్లో 36.96 శాతం ఇప్పటికే ఖర్చయింది.
జూలై వరకు మొత్తం రాబడులు రూ.93,388.05 కోట్లు. ఇందులో రెవెన్యూ రాబడితోపాటు మూలధన రాబడులు, ముఖ్యంగా అప్పులు కీలక పాత్ర పోషించాయి. మొత్తం వ్యయం రూ.88,182.10 కోట్లుగా నమోదైంది. అదనంగా రుణాలు, అడ్వాన్సుల పంపిణీ రూ.5,205.95 కోట్లు. ఫలితంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో రెవెన్యూ లోటు రూ.19,266.83 కోట్లు, ఫిసల్ లోటు రూ.33,729.98 కోట్లు, ప్రాథమిక లోటు రూ.23,197.62 కోట్లుగా నమోదయ్యాయి. ప్రభుత్వ ఆదాయం పెరిగిందని చెప్పుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ.. ఆదాయం కంటే వేగంగా వ్యయం పెరుగుతున్నది. పనుల ద్వారా వచ్చే ఆదాయం 10 శాతం పెరిగితే, రెవెన్యూ వ్యయం 25.58 శాతం పెరిగింది. నికర అప్పులు 36.73 శాతం పెరిగాయి. పెన్షన్ల భారం ఏకంగా 70.61 శాతం పెరిగింది. ఏడాది బడ్జెట్తో పోలిస్తే నాలుగు నెలల్లోనే అప్పులకు 57.70 శాతం, పెన్షన్లకు 71.20 శాతం, సబ్సిడీలకు 43.47 శాతం కేటాయింపులు వినియోగమయ్యాయి. ప్రభుత్వం ఇకపై ఎంత ఆదాయం వచ్చింది అన్నదానికే పరిమితం కాకుండా.. అందులో ఎంత శాతం అప్పుల ద్వారా వచ్చింది? ఎంత మొత్తం ఉత్పాదక ఆస్తుల సృష్టికి వెళ్తున్నది? ఎంత మొత్తం జీతాలు, పెన్షన్లు, వడ్డీలు, సబ్సిడీలకే కరిగిపోతున్నది? అనే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉన్నదని ఆర్థిక నిపుణులు కోరుతున్నారు.
రెవెన్యూ రాబడి: 59,642.62 24.72
పన్ను రాబడి: 53,004.40 29.22
పన్నేతర ఆదాయం: 4,274.55 11.96
కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు: 2,363.67 9.78
ఓపెన్ మార్కెట్ రుణాలు: 33,729.98 57.70
మొత్తం రాబడులు: 93,388.05 31.00
రెవెన్యూ వ్యయం: 78,909.45 33.66
మూలధన వ్యయం: 9,272.65 19.62
రెవెన్యూ లోటు:-19266.83 -280.95
ద్రవ్యలోటు: -33729.98 57.70