నీలగిరి, జూన్ 06: మసీదు సర్వే రిపోర్టు కోసం పదివేల లంచం అడిగి ఏసీబీ అధికారులకు వక్ఫ్‌బోర్డు ఇన్స్పెక్టర్ పట్టుబడిన సంఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో శనివారం చోటుచేసుకున్నది. ఏసీబీ డీఎస్పీ జగదీశ్ చందర్ వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం పరిధిలోని పెద్దవూరలో ఉన్న ఓ మసీదుకు 900 గజాల స్థలం ఉన్నది. ఈ స్థలంపై కొంతకాలంగా వివాదం నెలకొనడంతో మసీదు నిర్వాహకుడు ఈ స్థలాన్ని వక్ఫ్‌బోర్డు స్వాధీనం చేసుకోవాలని లేఖ రాశాడు. దీంతో ఉన్నతాధికారులు స్థలాన్ని సర్వే చేసి, నివేదిక అందించాలని ఆదేశాలు జారీ చేయడంతో గతనెలలో వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ మహమూద్ సర్వే చేశాడు.
సర్వే చేసినా రిపోర్టును అందించకుండా తనకు లంచం ఇస్తేనే సర్వే రిపోర్టును ఇస్తానని మసీదు నిర్వాహకుడిని మహమూద్ ఇబ్బందులకు గురిచేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో మిర్యాలగూడ బస్టాండ్‌లో మహమూద్‌కు బాధితుడు రూ.10,000 ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాడెండ్‌గా పట్టుకున్నారు. అనంతరం మిర్యాలగూడలోని వక్ఫ్‌బోర్డు ఇన్స్పెక్టర్ మెహమూద్ ఇంటితోపాటు వక్ఫ్‌బోర్డు కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు.