మహబూబ్నగర్ కలెక్టరేట్, జూన్ 6 : సంప్రదాయ డిగ్రీ విద్యపై విద్యార్థులకు ఆసక్తి తగ్గుతుందా.? దోస్త్లో ఫేజ్-1, ఫేజ్-2లో డిగ్రీ ప్రవేశాల గణాంకాలను చూస్తే పరిస్థితి అవుననే అనిపిస్తోంది. రెండేళ్ల ఇంటర్మీడియట్ కోర్సు అనంతరం మూడేళ్ల డిగ్రీ విద్యకు ప్రత్యామ్నాయంగా బీడీఎస్, పాలిటెక్నిక్ లాంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో తక్కువ సమయంలోనే స్వయం ఉపాధి అవకాశాలు, గ్రామీణ ప్రాంతాల్లో నూ వైద్య విద్య అందుబాటులోకి రావడం, చాలా మంది ఇంజినీరింగ్, ఫార్మసీల్లో చేరడానికే సుముఖత చూపడం దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ కళాశాలలకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో డిగ్రీ కోర్సులు ఆదరణకు నోచుకోవడం లేదు.
ఓ వైపు కృత్రిమ మేధ(ఏఐ), అనాలిటికల్, బ యో మెడికల్ లాంటి కోర్సులకు మార్కెట్లో డిమాం డ్ ఉండగా.. చాలా కళాశాలలు బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ లాంటి సంప్రదాయ కోర్సులకే పరిమితమవుతున్నాయి. మూడేళ్లుగా పీయూ పరిధిలోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ-గద్వాల, నారాయణపేట జిల్లాల్లోని డిగ్రీ కళాశాలల్లో సగం మేర కూడా సీట్లు భర్తీ కావడం లేదు. ఈ ఏడా ది దోస్త్ నోటిఫికేషన్లో ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలో 65 కళాశాలల్లో 28,680సీట్లు అందుబాటులో ఉండగా రెండు విడుతల్లో కేవలం 4,857 మా త్రమే విద్యార్థులు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు.
సీట్ల కేటాయింపు, రిపోర్టింగ్ ఇలా : ఉమ్మడి పాలమూరు జిల్లాలో యూనివర్సిటీ కాలేజీ-1,ప్రభు త్వ డిగ్రీ కళాశాలలు 22, గవర్నమెంట్ అటానమస్ కళాశాలలు-4, ప్రైవేట్ అన్ఎయిడెడ్ కళాశాలలు-38, మొత్తం 65 కళాశాలలు ఉన్నాయి. వీటిలో 28,680 సీట్లు ఉన్నాయి.
యూనివర్సిటీ కాలేజీలో మొత్తం 40సీట్లకు గానూ ఫేజ్-1లో 40 సీట్లకు 20మంది, ఫేజ్-2లో 20 సీట్లకు 15మంది రిపోర్టు చేశారు. ఈ లెక్కన మొత్తం సీట్లు 87.5శాతం భర్తీ అ య్యాయి. ప్రభుత్వ కళాశాలల్లో మొత్తం సీట్లు 10, 200లు ఉండగా ఫేజ్-1లో 1098 సీట్లకు 739 మంది, ఫేజ్-2లో 1,110సీట్లకు 885 మంది రిపో ర్టు చేశారు. మొత్తం సీట్లు 15.9శాతం భర్తీ అ య్యా యి. ప్రభుత్వ అటానమస్ కళాశాలల్లో మొత్తం సీట్లు 5,040 ఉండగా ఫేజ్-1లో 1638 సీట్లకు 1,012 మంది, ఫేజ్-2లో 1,392 సీట్లకు 1,133 మంది రిపోర్టు చేశారు. మొత్తం సీట్లు 42.6శాతం భర్తీ అ య్యాయి. ప్రైవేట్ ఆన్ఎయిడెడ్ కళాశాలల్లో మొత్తం సీట్లు 13,400లు ఉండగా ఫేజ్-1లో 516సీట్లకు 373మంది, ఫేజ్-2లో 793 సీట్లకు 680 మంది రిపోర్టు చేశారు.
మొత్తం 7.9శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. మొత్తం 65కళాశాలల్లో మొదటి, రెండో విడుతలో 4,857 సీట్లు మాత్రమే అంటే 16.9శాతం భర్తీ అయ్యాయి.
ఫేజ్-3 రిజిస్ట్రేషన్లకు అవకాశం : మూడేళ్ల డిగ్రీ ప్రవేశాలకు దోస్త్ ద్వారా ఇప్పటికే తొలి, రెండో విడుత రిజిస్ట్రేషన్లు పూర్తి కాగా.. మూడో విడుతలో రూ.400చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో ఈనెల 20 నుంచి 27వ తేదీ వరకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.ఈ నెల 29, 30 తేదీల్లో ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. జూలై 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
జిల్లావ్యాప్తంగా మొదటి, రెండు విడుతల్లో రిజిస్ట్రేషన్ చేసుకోని విద్యార్థులు ఫేజ్-3 ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తాము ఎంచుకున్న కళాశాలల్లో నిర్దేశిత గడువులోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సహాయ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి.