సమయం.. సాయంత్రం నాలుగు గంటలు! చేతిలో పెద్ద సూట్‌కేసు, భుజానికి బుట్ట సంచి, మరో భుజానికి వేలాడే చిన్న చేతిసంచితో, జనాల్ని తోసుకుంటూ, తొక్కుకుంటూ.. ఎలాగైతేనేం ‘ముళ్లవరం’ వెళ్లే ‘పల్లె వెలుగు’ బస్సు ఎక్కేసింది శైలజ.
అప్పటికే బస్సు కిక్కిరిసిపోయి ఉంది!సూట్ కేస్‌ని ఒక యువకుని సాయంతో పైన స్టాండ్‌లోకి నెట్టి.. అతని పక్కసీట్లోనే చతికిల పడిపోయింది. “ఈ సీట్లో ఇంతకు ముందే ఎవరో కూర్చున్నారు ఆంటీ! కిందకు దిగారేమో!” మొహమాటంగా అన్నాడు ఆ అబ్బాయి.“రానివ్వు.. చూసుకుందాంలే!” సీట్లో సర్దుకుంటూ స్థిరంగా అంది శైలజ. ముగ్గురు మనుషులు కూర్చునే సీటు అది. కిటికీ వైపు కుర్రాడు, అటుగా తల పండిపోయి నల్లటి శరీరంతో కాయకష్టం చేసుకునే ఒక ముసలమ్మ! బస్సు గోలగోలగా ఉంది. కండక్టర్ బస్సు చివరి నుంచి టికెట్లు కొడుతూ శైలజ వద్దకు వచ్చాడు.
శైలజ ముళ్లవరానికి ఒక టికెట్టు తీసుకుంది. “ఈ బస్సు ముళ్లవరం వెళ్లేటప్పటికీ టైమ్ ఎంత అవుతుందండీ?” అడిగింది కండక్టర్ని.
“రోడ్డు బాగుంటే రెండు గంటల్లోపే వెళ్లిపోతామమ్మా!” కండక్టర్ వినయంగా జవాబిచ్చి..“రైట్ రైట్!” అంటూ రాడ్మీద పంచింగ్ మిషన్‌తో రెండుసార్లు కొట్టాడు.పదేళ్ల తర్వాత మళ్లీ ‘ముళ్లవరం’ ప్రయాణం.తల్లిని చూడాలన్న ఆశతో.. ఆత్రంతో.. ఆరాటంతో.. తండ్రి కాలం చేసి కూడా పదేళ్లకుపైనే అయింది. తండ్రి పోయినప్పుడు విషయం తెలిసి కంగారుగా ముళ్లవరం బయలుదేరి వెళ్లింది శైలజ. అప్పుడు కూడా తల్లి శైలజను ఇంట్లోకి అడుగు పెట్టనివ్వలేదు. దూరం నుంచే తండ్రిని కడసారి చూపులు చూసింది. శ్మశానం వరకు వెళ్లి తండ్రికి రెండు చేతులు జోడించింది. తండ్రి అంత్యక్రియలకు శైలజ అన్నయ్య అభిరామ్ అమెరికా నుంచి రాలేకపోయాడు. ఎవరో వరుసకు కొడుకైన దూరపు బంధువుతో కొరివి పెట్టించారు.బస్సు బజారు వీధిలోంచి ముందుకు పరిగెత్తి ఊరిచివర ‘ముళ్లవరం’ రోడ్డులోకి మళ్లింది. అటూ ఇటూ దారి పొడవునా బ్రహ్మజెముడు ముళ్ల డొంకలు, మామిడి, జీడి మామిడి తోటలు.
బస్సు గుంతల్లో పడుతూ లేస్తూ ముందుకు పరిగెడుతున్నది. శైలజకు గతం.. ఒక వేదనామయ స్వప్నం.. బాధామయ వాస్తవం!
తల్లిదండ్రులకు శైలజ బద్ధ శత్రువు! వాళ్లకు తనంటే కోపం, ద్వేషం.. అంతకుమించి అసహ్యం. శైలజ చేసిన నేరం?వాళ్లకు తెలియకుండా, వాళ్ల అనుమతి లేకుండా, వాళ్ల ప్రమేయం లేకుండా.. నిమ్న కులానికి చెందిన ప్రభాకర్‌ని పెళ్లి చేసుకోవడమే! పెళ్లి చేసుకుని ప్రభాకర్‌తో గుమ్మం ముందు నిలబడితే.. “ఈరోజు నుంచి నువ్వు నా కూతురువి కాదు. జీవితంలో మళ్లీ ఎప్పుడూ నీ ముఖం నాకు చూపించకు..” నాన్న ఆవేశంతో ఊగిపోయాడు.“ఛీ ఛీ! నా కడుపున చెడ పుట్టావు కదే! అల్లారు ముద్దుగా పెంచుకున్నందుకు ఎంత పనిచేసావే నికృష్టపుదానా? నీ అమ్మానాన్నల తరఫున అటు ఇటు పదితరాల వంశవృక్షం వాళ్లు నిన్ను శపిస్తారే! నీకు శాపనార్థాలు పెడతారే! దౌర్భాగ్యురాల! పో.. బయటికి పో!” తల్లి తిట్లు.. కోపాలు.. శాపాలు.. దారుణంగా!శైలజ ఇప్పుడు ఢిల్లీ యూనివర్సిటీలో జువాలజీ ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది.ప్రభాకర్ అదే యూనివర్సిటీలో కెమిస్ట్రీ లెక్చరర్‌గా జాబ్ చేస్తున్నాడు. ఇద్దరు పిల్లలు. అమ్మాయి ప్రత్యూష.. రంగరాయ మెడికల్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతోంది. అబ్బాయి కిరణ్.. ఇంటర్ సెకండియర్ స్టేట్ థర్డ్ ర్యాంక్ తెచ్చుకుని ఐఐటీకి ప్రిపేర్ అవుతున్నాడు.
పిల్లలు మనసులోకి రాగానే శైలజకు ఒకింత గర్వం-ఆనందం-తృప్తి కలిగాయి.వాళ్లకు అయిదారేళ్ల వయసులో.. చిన్నపిల్లల్ని చూసైనా పెద్దల మనసు కరుగుతుందని ఆశపడి ఒకసారి ఊరికి వెళ్తే.. తల్లిదండ్రుల నుంచి అదే అవమానం. అదే తిరస్కారం!“కులాన్ని భ్రష్టుపట్టించిన నీకు ఎప్పుడో ఇన్ని నీళ్లు వదిలేసాం. మాకు కూతురే పుట్టలేదు అనుకున్నాం. పోవే!”. తర్వాత కూడా ఊళ్లో చలమయ్య దుకాణానికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా అమ్మానాన్నల నుంచి బదులు లేదు. వాళ్లు క్షమించలేదు!శైలజ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. గుండెల్లో బండరాయిలాంటి బరువు భారం. కానీ, ఇన్నాళ్లకు ఇన్నేళ్లకు అమ్మ మారింది. అమ్మ మనసు మారింది. ఊళ్లో ఎస్టీడీ బూత్‌లోంచి కిరాణా కొట్టు చలమయ్యతో ఫోన్ చేయించింది.
“అమ్మగారు మిమ్మల్ని చూడాలని అనుకుంటున్నారమ్మా! వీలు చూసుకుని పిల్లలతో ఒకసారి రమ్మని చెప్పారమ్మా!”అమ్మ ధైర్యవంతురాలు. ఒంటరిగా బతికేస్తోంది. కౌలు రైతు సీతారావుడిని, అతని కుటుంబాన్ని తన ఇంటి వెనక భాగంలో కాపలాగా ఉంచుకుని.. ఉన్న మూడెకరాల భూమిని సంరక్షించుకుంటూ కాలక్షేపం చేస్తోంది. కాకపోతే, అమ్మకు ఇప్పుడు వయసు అయిపోయింది.జవసత్వాలు ఉడిగిపోయి ఆఖరి పిలుపు కోసం ఎదురుచూస్తూ ఉండొచ్చు. కూతుర్ని చూడాలన్న కోరిక మిగిలిపోయి ఉండొచ్చు.
అందుకే ఈ పిలుపు.. ఏమో?!శైలజ కిటికీలోంచి బయటికి చూసింది.దూరంగా పచ్చటి పంట పొలాలు ఎక్కడా కనిపించడం లేదు. ఎర్రటిగడ్డి దుబ్బులు దుబ్బులుగా పెరిగిపోయి ఉంది. పచ్చటి పొలాల మడుల్లో నేలకు రాతి మొక్కలు మొలిచాయి. అల్లంత దూరంలో.. రాబందుల రెక్కల చప్పుడులా.. ఇనుపడెక్కల యంత్రాలు పొలాల్లో భీకర ధ్వనులు చేస్తూ జోరుగా తిరుగుతున్నాయి.అంటే.. పచ్చటి భూములన్నీ ఇళ్ల స్థలాలుగా మారిపోతున్నాయి అన్నమాట.ఈ భూములన్నీ ఇళ్ల స్థలాలుగా మారిపోతే రేపటి భవిష్యత్తు తరాలకు బుక్కెడు బువ్వ పెట్టేది ఎవరు? రైతన్నల పరిస్థితి ఏమిటి?శైలజ మనసు కలత బారిపోయింది.రోడ్డు మీద గుంతలు ఎక్కువగా ఉన్నాయి కాబోలు.. బస్సు కుదువులతో నెమ్మదిగా నడుస్తోంది. అసలే ఒళ్లు హూనమైపోయి ఉంది. తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్రభాకర్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చి ఫ్లయిట్ ఎక్కిస్తే నాలుగు గంటల్లో హైదరాబాద్ చేరింది. మరో ఫ్లయిట్ ఎక్కి మూడు గంటల్లో రాజమండ్రి చేరింది. మళ్లీ వోల్వో బస్సులో గంటన్నర ప్రయాణం.. పెద్దగా శ్రమ అనిపించలేదు. కానీ, ఈ ‘పల్లె వెలుగు’ బస్సు మాత్రం ఎత్తి కుదేస్తోంది.
“ఎవురి ఇంటికి ఎళ్తున్నావు బొట్టి?”పక్కనున్న ముసలమ్మ బోసి నోరు తెరుచుకుని అడిగింది.“రాజమ్మ గారి ఇంటికి పెద్దమ్మా!” శైలజ నవ్వుతూ అంది.“పెద్దింటి రాజమ్మ గారింటికా? ఆ అమ్మ నీకు ఏటవుద్ది?” “మా అమ్మ!” శైలజ జవాబు.“అప్పుడెప్పుడో పేటలో కుర్రాడిని పేవిన్చి పారిపోయిన పిల్లవు నువ్వేనా? ఓసినీ.. ఆ ఇంట్లో అంత బతుకు బతికి అట్టాంటి పని ఎట్టా చేసావ్ అమ్మీ?”ముసలమ్మకు సమాధానం చెప్పలేదు శైలజ. మౌనంగా ఉండిపోయింది.“నా పేరు మంగమ్మ! మీ అమ్మకు ఎరికలే! అడిగినానని సెప్పు!”ఆ తర్వాత ముసలమ్మ ఎందుకో గమ్మునుండి పోయింది. బస్సు ముళ్లవరం బస్టాండ్‌లో ఆగింది. శైలజ బస్సు దిగింది.నలుగురైదుగురు సైకిల్ రిక్షా వాళ్లు ముందుకు వచ్చి సూట్‌కేసు అందుకోబోయారు. వెనుకగా నిలబడ్డ ఒక ముసలి రిక్షావాన్ని ముందుకు రమ్మని పిలిచి.. సూట్‌కేసు రిక్షాలో పెట్టమని చేతికిచ్చింది శైలజ. “వనమాలమ్మ గుడి వీధి, రాజమ్మ గారింటికి..” “మీరు ఎక్కండమ్మా! ఆ తల్లి ఇల్లు నాకు ఎరుకనే” శైలజ రిక్షా ఎక్కింది..రిక్షా ముందుకు కదిలింది.ఊరు.. ఊరిలా లేదు. ఏదో కొత్త ఊరికి వచ్చినట్లుగా ఉంది. రూపురేఖలు మొత్తం మారిపోయాయి. మట్టి రోడ్లు, కంకర రోడ్లు.. నల్లటి తారు పూసుకొని నిగనిగా మెరుస్తున్నాయి.
ఒకప్పటి పల్లెటూరు.. పట్టణపు పోకడలతో వెలిగిపోతోంది. వీధుల్లో కొత్తకొత్తగా దుకాణాలు వెలిశాయి. రిక్షా రామాలయం వీధిలోకి మళ్లింది. ఆ వీధి మొదట్లో రచ్చబండ వద్ద జనం లేరు. ఇళ్ల అరుగుల మీద కూడాఎక్కడా జనం కనిపించడం లేదు. ఇంతకుముందు.. ఇళ్ల అరుగుల మీద, రచ్చబండ వద్ద జనం గుంపులు గుంపులుగా కబుర్లు చెప్పుకొంటూ ఉండేవారు.
ఇంటి పైకప్పుల మీద కొత్తగా డిష్ యాంటీన్నాలు మొలుచుకొచ్చాయి. ఇళ్లలో టీవీల శబ్దాలు పెద్దగా వినిపిస్తున్నాయి.రిక్షా వనమాలమ్మ గుడి వీధిలోకి తిరిగింది.వీధి మధ్యలో.. అదే.. అదే.. అమ్మగారిల్లు! అవధాని గారి ఇల్లు. చిన్నప్పుడు ఆడిపాడిన ఇల్లు! ఎగిరి గెంతులేసిన ఎత్తరుగుల ఇల్లు! శైలజ గుండె చప్పుడు ఆమె చెవిలో స్పష్టంగా వినిపిస్తోంది.ఇంటి ముందు రిక్షా ఆగింది. సూట్ కేసు, బుట్ట సంచి, ఇంటి గుమ్మం ముందు ఉంచాడు రిక్షా తాత. తనకు పది రూపాయలు ఎక్కువే ఇచ్చి పంపించింది శైలజ.ఎదురుగా గుమ్మాన్ని ఆనుకుని నిలబడ్డ అమ్మ! నిలువెత్తు అభిమానానికి.. ధైర్యానికి నిలువుటద్దంలాంటి అమ్మ! ఒకప్పుడు గుడిలో అమ్మవారిలా ఉండే అమ్మ.. బక్క చిక్కిపోయి రివటలా రెపరెపలాడుతున్న రూపం!
“రా అమ్ములు.. శైలూ.. రా! లోపలికి రా!”ఎన్నాళ్లకి అమ్మ పిలుపు! ఎన్నాళ్లకి ఆ గొంతులో కాఠిన్యానికి బదులు కరుణ? ఆ స్వరంలో మార్దవం మాధుర్యం?“అమ్మా!” శైలజ తల్లిని ఆర్తిగా అల్లుకుపోయింది. ఏళ్ల తరబడి ఎడబాటు. తెగిపోయిన బంధం. ఇన్నాళ్లకు మళ్లీ! వారిద్దరి మధ్య కొన్ని క్షణాలు మాటల్లేవు. ఘనీభవించిన మౌనం కరిగి కన్నీరు అవుతోంది. అదిగో.. అప్పుడే, దూరంగా వీధి చివర నుంచి డప్పుల మోత!
ఢం.. ఢం.. ఢం.. ఢమకు.. ఢం..పెద్దగా ధ్వనులు వినిపిస్తున్నాయి. తుళ్లిపడి అమ్మ కౌగిలి నుండి విడిపోయింది శైలజ.“అమ్ములూ.. భయపడకు! రేపు అమావాస్య కదా! అమ్మవారికి పండగ. పగలంతా ఊరంతా ప్రభల తీర్థం! గరగల ఊరేగింపు. ఉయ్యాల పవళింపు సేవ. చుట్టుపక్కల ఊళ్ల నుంచి ఎంతోమంది జనం తరలివస్తారు. ఈ రాత్రికి తెల్లవారుజామున అమ్మవారికి వేటలు వేస్తారు. అయిదు పొట్టేళ్లు, అయిదు మేకలు, అయిదు గొర్రెలు, ముప్పై కోడి పుంజులు అమ్మవారికి బలి ఇస్తారు. ఊరు ఊరంతా ప్రసాదం పంచి పెడతారు! అమ్ములూ! నువ్వు స్నానం చేసి సిద్ధం అయితే.. వెళ్లి అమ్మవారిని దర్శనం చేసుకుని వద్దాం! మహిమగల తల్లి!”శైలజను అనునయిస్తూ అంది రాజమ్మ. శైలజ ఎందుకో ఒక్కసారి భోరుమని ఏడుస్తూ మండువాలో నేల మీద కూర్చుండి పోయింది.
రాజమ్మ నివ్వెరపడి చూస్తూ ఉండిపోయింది.“అమ్మా! నన్ను ఇంతకాలం మీ నుంచి ఎందుకు దూరం చేసారు? నన్నెందుకు ఇంట్లోకి అడుగు పెట్టనివ్వలేదు? నాన్న, నువ్వు నా మీద ఎందుకు కక్ష కట్టారు? నేను చేసిన నేరం ఏమిటమ్మా? అపరాధం ఏమిటి? ప్రభాకర్‌ని పెళ్లి చేసుకోవడమేనా? ఒకే ఊరి వాళ్లం.. ఒకే కాలేజీలో చదువుకున్నాం. కలిసిమెలిసి తిరిగాం! మనసులు కలిసాయి.. కులాలు వేరైనా ధైర్యంగా పెళ్లి చేసుకున్నాం! ప్రభాకర్‌కి మనకీ తేడా ఏమిటమ్మా? అతనూ మనిషే కదా! అతనిలో ప్రవహించే రక్తం మన రక్తం ఒకటి కాదా? మనిషి మనిషికీ మధ్య.. ఈ వైరుధ్యం ఏమిటి? ఈ కులాలు, మతాలు మనుషులను వేరు చేయడానికేనా? రేపు అమ్మవారికి బలిచ్చే ఆ మూగజీవాలకు, నాకూ తేడా ఏమిటి? వాటికి మల్లే.. నన్ను కూడా మీ అహంకారానికి, ఆధిపత్యానికి, సాంప్రదాయానికి, కుటుంబ పరువు ప్రతిష్ఠలకి బలి చేశారా? కేవలం నేను కులాంతర వివాహం చేసుకోవడం వల్లనే.. నన్ను చెడిపోయిన దానిగా ముద్ర వేశారా? నన్ను వెలివేసారా? ఇది న్యాయమేనా అమ్మా? చెప్పమ్మా చెప్పు? నాకు సమాధానం చెప్పు?” శైలజ దుఃఖోద్వేగంతో, ఆవేశంతో, ఆక్రోశంతో తల్లిని పట్టుకుని ఊపేస్తూ ఏడవ సాగింది.
“ఊరుకో శైలూ! ఊరుకో తల్లి! వజ్రంలాంటి నిన్ను వదులుకోవడం మేము చేసిన తప్పేనమ్మా! నువ్వు పెళ్లి చేసుకొని వెళ్లిపోయిన తర్వాత బంధువులందరి నుంచి, అన్ని వైపుల నుంచీ.. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం. సిగ్గుతో తలలు వంచుకున్నాం. కొన్ని రోజులు మేము ఇంట్లో నుంచి బయటికి రాలేదు. పట్టుదలకు పోయి మీ నాన్నగారు.. నిన్ను క్షమించకూడదు అనుకున్నారు! ఆయన పోయిన తర్వాత కూడా నిన్ను వదులుకోవడం తప్పని.. నాకు అనిపించలేదు! నిజానికి నేనేం కోల్పోయానో నాకే తెలియలేదు. అన్నయ్య అమెరికాలో స్థిర నివాసం ఏర్పరచుకుని ఈ అమ్మనే మర్చిపోయాడు. ఎప్పుడైనా ఒక ఫోన్ కాల్ చేయడం గగనమే! ఏవో పాతకాలపు ఛాందసాలతో నిన్ను వదులుకొని రాతి మనిషిలా ఉండిపోయాను. నిన్ను వదులుకోవడం నాది ముమ్మాటికీ తప్పేనమ్మా! ఇప్పుడు.. నా జీవితం చరమాంకంలో పడింది. నిన్ను చూస్తానో లేదో అనుకున్నాను. నువ్వు వస్తావో రావో అనుకున్నాను. ఎలాగైతేనేం నువ్వు వచ్చావు! ఇంత కాలానికి నిన్ను మళ్లీ రప్పించుకోగలిగాను. ఏడవకు తల్లీ! శైలూ.. అమ్ములూ! మహిమగల తల్లీ ఆ అమ్మవారి సమక్షంలో ఆ ‘వనమాలమ్మ’ దర్శనంతో నీకు సాంత్వన కలుగుతుందమ్మా! నీకు మనఃశ్శాంతి దొరుకుతుందమ్మా! లే తల్లీ! స్నానం చేసి తయారవు! ఒకసారి గుడికి వెళ్లొద్దాం.. లే తల్లీ! నా తల్లివి కాదూ!” తల్లి మరీమరీ బతిమాలడంతో.. శైలజ దుఃఖాన్ని అదుపు చేసుకుంటూ మౌనంగా ఇంట్లోకి నడిచింది.
రాత్రి తొమ్మిదిగంటలు. తల్లితో కలిసి శైలజ ఆ వీధి చివరగా ఉన్న ‘వనమాలమ్మ’ గుడికి వెళ్లింది. ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన పురాతన గుడి. నిలువెత్తు అమ్మవారి రాతి విగ్రహం. గుడి ప్రాంగణమంతా మారిపోయింది. గుడి లోపలికి వెళ్లడానికి కొత్తగా మెట్లు నిర్మించారు. చిన్నప్పుడు స్నేహితురాళ్లతో ఈ గుడి చుట్టూ తిరిగి ఆటలాడుకునేది. అది ఒక మధురమైన జ్ఞాపకం! శైలజ గుర్తు చేసుకుంది. రకరకాల విద్యుత్ దీపాలు వెలుగులతో వేపమండలతో గుడి ఆవరణ అంతా పచ్చగా తళుకులీనుతోంది. ఊరి జనంతో, భక్తులతో.. గుడి కోలాహలంగా ఉంది. ఒకవైపు డప్పులు మోగుతున్నాయి. మరోవైపు.. గరగ నృత్యం చేసేవాళ్లు తలపాగాలు చుట్టుకుని, పంచెలు కట్టుకుని భుజం చుట్టూ కండువాలు చుట్టుకుని నృత్యం చేయటానికి సిద్ధమవుతున్నారు.
అమ్మవారి గుడి ద్వారం ఎదురుగా రెండు పొడవాటి తాటిబద్దలు భూమిలో పాతి ఉయ్యాల ఏర్పాటు చేశారు. అప్పుడే గ్రామ పెద్ద, ప్రెసిడెంటు సూరిబాబు.. అమ్మవారి దర్శనార్థం తన పరివారంతో వచ్చాడు. పూజారి భద్రయ్య తోడు రాగా, గుడి లోపలికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నాడు. బయటికి వచ్చి తొలి ప్రయత్నంగా అమ్మవారి గరగను తన ఒళ్లో ఉంచుకుని నాలుగైదుసార్లు ఉయ్యాలపై ఊగాడు.“జై వనమాలమ్మ తల్లీ!”.. భక్తులు అందరూ నినాదాలు చేశారు. డప్పులు ఢమఢమ అంటూ పెద్దగా మోగాయి. డప్పులకు అనుగుణంగా అడుగులు వేస్తూ గరగ ఆటగాళ్లు నృత్యాలు మొదలుపెట్టి విరగబడి చేశారు.
పిదప అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు ఘనంగా జరిగాయి. రంగురంగుల తారాజువ్వలు నింగిలోకి దూసుకువెళ్లాయి. అంగరంగ వైభోగంగా వనమాలమ్మ సంబరం మొదలైంది.గ్రామ పెద్ద ఉయ్యాల ఊగిన తర్వాత చిన్నప్పుడు ఎన్నోసార్లు శైలజ తన ఈడు పిల్లలతో కలిసి ఉయ్యాలలూగేది.ఆ చిన్నప్పటి జ్ఞాపకాలు.. శైలజ మనసులో మెదిలాయి. అనిర్వచనీయమైన ఆనందం కలిగింది. గుడి చుట్టూ దృశ్యాల్ని, గరగ నృత్యాల్ని, అమ్మవారి సంబరాన్ని అబ్బురంగా చూస్తూ ఉండిపోయింది.అదిగో.. అప్పుడే.. ఒక మూలగా చిరుచీకట్లో గుడి పక్కగా కనిపించింది ఆ దృశ్యం!
అయిదు పొట్టేళ్లు, అయిదు మేకలు, అయిదు గొర్రెలు, ముప్పై కోడిపుంజులు గుంజలకు విడివిడిగా కట్టేసి ఉన్నాయి. అవి అన్నీ మూగజీవాలు! దీనంగా అందరివైపు అమాయకంగా చూస్తున్నాయి. ‘మేం బలి కాబోయే జీవులం.. బడుగు జీవులం! మాకు ఎవరు దిక్కు?’ అన్నట్టుగా ఉన్నాయి.
ఆ జీవాల తలలకు పసుపు కుంకుమలు నిండుగా పూసి ఉన్నాయి. మెడల చుట్టూ వేప మండలు వేలాడుతూ ఉన్నాయి.
శైలజ చలించిపోయింది. ఆమె గుండె ద్రవించిపోయింది. దయా, జాలీ, కరుణ లాంటి భావాలన్నీ ఒక్కసారే ముప్పిరిగొన్నాయి.
ఆ మూగ జీవుల్లో తనను తాను చూసుకుంది శైలజ. తన జీవితంతో పోల్చుకుంటే వాటికీ, తనకూ ఏదో సామ్యం ఉన్నట్టు కనిపించింది.
తనను వెలివేసిన సమాజ దౌష్ట్యం, తనను బలి చేసిన నిరంకుశత్వం ప్రతిఫలించాయి.
ఈ మూగ జీవాల్ని తెల్లవారుజామునే అమ్మవారికి బలిస్తారు. తమను చంపొద్దని చెప్పడానికి వాటికి నోరులేదు. ఎంత దయనీయం? ఎంత దాక్షిణ్యరహితం? ఎంత కర్కశత్వం? ఎంత రక్తపాతం? పైగా వాటి మాంసాన్ని అమ్మవారి ప్రసాదంగా ఊరంతా పంచి పెడతారట!
కడుపులో ఎవరో చేయి పెట్టి దేవుతున్నట్టు, కెలుకుతున్నట్టు అనిపించింది. గబగబా తల్లితో గుడి లోపలికి వెళ్లి పోయింది శైలజ.
అమ్మవారికి కొబ్బరికాయ కొట్టింది. అరటిపళ్లు నైవేద్యంగా సమర్పించింది. హారతి వెలిగించి గంట గణగణమంటూ కొట్టింది. మనసులో ఏదో అలజడి. అమ్మవారిని మనసా ప్రార్థన చేసింది. ఆమె ప్రార్థన విన్నట్టే.. వనమాలమ్మ కరుణించినట్టు ఆమె ఒళ్లు పులకరించింది.
గుడి పూజారికి తన కూతుర్ని పరిచయం చేసింది రాజమ్మ. తల్లి కూతుళ్లు ఇద్దరూ తృప్తిగా గుడి బయటికి వచ్చారు.
శైలజ ఏదో భావోద్వేగంతో ఊగిసలాడుతోంది. ఒకరు ఊగిన తర్వాత.. తను కూడా ఉల్లాసంగా ఉయ్యాల ఎక్కింది శైలజ. ఉద్వేగంగా.. ఉద్విగ్నంగా..
ఉయ్యాల ఊగుతూ.. మూడుసార్లు ఊగీఊగీ దబుక్కున ఉయ్యాలలోంచి కిందికి దూకేసింది.
ఆమె ఆయాస పడుతూ నేల మీద స్థిరంగా కూర్చుండిపోయింది. శైలజ ఎందుకో ఇప్పుడు మునుపటి శైలజలా లేదు. ఆమె కళ్లు అటు ఇటు తిరుగుతున్నాయి. జుట్టు విరబోసుకున్నట్టుగా విడిపోయింది. తల గుండ్రంగా తిప్పుతోంది.ఆమె నోట్లోంచి ఏవో ధ్వని సంకేతాలు వెలువడుతున్నాయి.ఆ ధ్వని సంకేతాలు పెద్దవై స్వరం పెరిగింది. గొంతు బిగ్గర అయింది. ఆమె మాటలు ప్రతిధ్వనిస్తున్నాయి.“భక్తులారా! భక్తజనులారా!”అక్కడే ఉన్న ప్రెసిడెంట్ సూరిబాబు, తన పరివారంతో ఆమె వద్దకు వచ్చాడు. వంగిపోయి, శిరసు వంచి నమస్కరిస్తూ..
“అమ్మా! తల్లీ! వనమాలమ్మ తల్లీ!” అంటూ ఆమె ముందు మోకరిల్లిపోయాడు. చుట్టూ ఉన్న భక్తజన సందోహం..“అమ్మోరు తల్లీ! నీకు దణ్నాలు తల్లీ!” అంటూ ఆమె చుట్టూ మూగిపోయారు. “అమ్మవారి పూనకం ఇది! ఈ తల్లి మీద పూనింది.. ఎవరూ మాట్లాడొద్దు.. వినండి!”
పూజారి భద్రయ్య గట్టిగా అరిచాడు.
మనిషి చలించిపోతూ.. ఆమె ఉగ్రరూపానికి ఉపశాంతిగా వేప మండలతో ఆమెపై పసుపు నీళ్లు చల్లడానికి సిద్ధమవుతున్నాడు! పూనకంలో ఉన్న శైలజ ఉద్వేగంతో మాట్లాడుతోంది.“నేను అమ్మను రా! వనమాలమ్మను! ఈ ఊరి గ్రామదేవతను. మీరంతా నా బిడ్డలురా! నేను నా ఊరి జనాల్ని రక్షించేదాన్ని కానీ.. భక్షించే దాన్ని కాదురా! ఏ అమ్మకైనా రక్షించడమే తెలుసు.. తన బిడ్డల్ని భక్షించడం రాదు! నాకు నా ఊరంటే ప్రేమ! మీరంటే ప్రేమ.. నాకు మీ ఎవరి మీదా కోపం లేదు. కోపం రాదు! మీరంతా చల్లగా ఉండాలి. క్షేమంగా ఉండాలి. మనిషైనా, జంతువైనా సర్వజీవులూ నాకు సమానమే రా! నా బిడ్డల్ని నేను ఎందుకు బలి తీసుకుంటాను రా? ఎవరినీ నేను బలి కోరుకోను. మీరు పెట్టే అన్న ప్రసాదాలు.. శాకాహారాలు నాకు చాలురా! ఈ జంతువుల్ని.. ఈ మూగ జీవుల్ని.. బలి ఇమ్మని నేను ఎప్పుడైనా మిమ్మల్ని కోరానా? అలా అనుకుంటే మీది ముమ్మాటికీ తప్పే! మీది అజ్ఞానమే! ఇకపై ఈ జంతుబలి ఆగాలి. జంతుబలి పేరుతో మూగజీవుల్ని హింసించడం, చంపేయడం ఆగిపోవాలి! ఇది నా ఆన! నా ఆన దాటకండి బిడ్డలారా! ఈరోజు నా ముందు నిలబెట్టిన ఈ మూగ జీవులన్నిటినీ నా ఆస్తిగా వాటి మీద నా పేర్లు రాయండి. నా పేరుతో స్వేచ్ఛగా అవి బతికినంత కాలం బతకనివ్వండి! బతకనివ్వండి!
‘ముళ్లవరం’ గ్రామ జనులారా! మీరంతా.. సుఖ సంతోషాలతో జీవించండి! మీరు ప్రశాంతంగా ఉండండి.. ఓం శాంతి.. ఓం శాంతిః!” శైలజ రూపంలో పలికిన వనమాలమ్మ మాటలు నెమ్మదిగా ఆగిపోయాయి. శైలజ మాట్లాడుతూ మాట్లాడుతూ పక్కకు ఒరిగిపోయింది. పక్కనే ఉన్న తల్లి రాజమ్మ ఆందోళనగా ఆమెను అక్కున చేర్చుకుంది.“మహిమగల తల్లీ! నీ వాక్కులు అనుసరిస్తాం తల్లీ! తప్పనిసరిగా పాటిస్తాం అమ్మా!”
ప్రెసిడెంట్ సూరిబాబు రెండు చేతులూ జోడించి వాగ్దానం చేశాడు.అతని మాటలకు వంత పాడుతూ.. అక్కడ ఉన్న వేలాది ఊరి జనం..
“మేమంతా మారిపోతాం.. తల్లీమారిపోతాం!”అందరి గొంతులూ ఒక్కసారే నినదించాయి.అప్పుడే కళ్లు తెరిచిన శైలజ పెదాలపై చిరు
దరహాసం ఉదయించింది.ఆమె కళ్లు చల్లగా నవ్వుతున్నాయి.
కంఠస్ఫూర్తి విజయ కనకదుర్గ
ప్రతిఘటనతోనే స్త్రీ స్వేచ్ఛ రెక్కలు విప్పుకొంటుందని బలంగా నమ్మే రచయిత్రి కంఠస్ఫూర్తి విజయ కనకదుర్గ. భర్తతో కలిసి సాహితీ ప్రస్థానం సాగిస్తున్నారు. అడపాదడపా కథలు రాస్తున్నారు. ఇప్పటివరకు 19 కథలు రాశారు. ఈమె రాసిన మొదటి కథ ‘గొలుసు’. గీతాంజలి పక్ష పత్రికలో బహుమతి గెలుచుకున్నది. రెండో కథ ‘అగ్రిమెంట్’. ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో ప్రచురితమైంది. అలాగే.. అంతర్జాల పత్రికలలో ఐదారు కథలు ప్రచురితమయ్యాయి. అత్తారింటికి దారేది, అంతిమం, భగవాన్ నన్ను క్షమించు కథలకు ‘కథా మంజరి’లో బహుమతులు దక్కాయి. అరచేతిలో వైకుంఠం కథ.. హాస్యానందంలో బహుమతికి ఎంపికైంది. ఈ కథలు రచయిత్రికి మంచిపేరు తీసుకొచ్చాయి. భవతి శిక్షాందేహి పేరుతో రాసిన నాటకం.. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో పలుమార్లు ప్రసారమైంది. ఎక్కువగా ఆధ్యాత్మిక వ్యాసాలు రాస్తుంటారు. ఆకాశవాణి విశాఖ కేంద్రంలో ‘చింతన’ కార్యక్రమంలో 15 వ్యాసాల వరకు చదివారు.
‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2025’లో రూ.2వేల బహుమతి పొందిన కథ.
-కంఠస్ఫూర్తి విజయ కనకదుర్గ
99494 87828