న్యూఢిల్లీ: టీమిండియా సూపర్‌స్టార్ విరాట్ కోహ్లీ గాయం కారణంగా అఫ్గానిస్తాన్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా కోహ్లీ హ్యామ్‌స్ట్రింగ్ (కాలు కండరం) గాయానికి గురయ్యాడు. దీంతో ఈ నెల13 నుంచి ధర్మశాల వేదికగా ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్ నుంచి అతడు వైదొలిగాడని బీసీసీఐ వర్గాలు గురువారం వెల్లడించాయి.
‘గాయం వల్ల కోహ్లీ వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండటం లేదు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లోనే అతడు గాయపడ్డాడు. స్కానింగ్ రిపోర్టుల్లో మోకాలి కింది భాగంలో ఉండే కండరాల కనెక్టింగ్ టిష్యూ దెబ్బతిన్నట్టు తేలింది’ అని బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. 37 ఏండ్ల వయసులోనూ తిరుగులేని ఫిట్నెస్తో ఉండే కోహ్లీకి ఇలాంటి అరుదైన గాయం కావడం గమనార్హం. శ్రీలంక్ టూర్‌కు వెళ్లే భారత్-ఏ జట్టుకు ఎంపికైన రుతురాజ్ గైక్వాడ్‌ను విరాట్ స్థానంలో టీమిండియాలోకి తీసుకునే అవకాశం ఉంది.