న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, అతడి డీ-కంపెనీ సిండికేట్ ఐపీఎల్లో ఓ ఫ్రాంచైజీని చేజిక్కించుకోవాలని చూసిందని లీగ్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ సంచలన విషయం వెల్లడించాడు. దావూద్ గ్యాంగ్ నుంచి వచ్చిన బెదిరింపుల వల్లే తాను క్రికెట్ అడ్మినిస్ట్రేషన్‌కు శాశ్వతంగా దూరమయ్యానని తెలిపాడు. ఐపీఎల్లో అక్రమ బెట్టింగ్ నెట్‌వర్క్‌లను తాను అడ్డుకోవడంతో మాఫియా తనపై కక్షగట్టిందని ఓ న్యూస్ ఏజెన్సీ కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
లండన్‌లో 2012లో జరిగిన భయంకరమైన సంఘటనను లలిత్ మోదీ గుర్తు చేసుకున్నాడు. బాబా అనే మధ్యవర్తి అతడి పెంట్‌హౌస్‌కు తీసుకెళ్లి శాటిలైట్ ఫోన్ ద్వారా నేరుగా దావూద్ ఇబ్రహీంతో మాట్లాడించాడని మోదీ చెప్పాడు. ‘ఆ సమయంలో కింద బ్రిటీష్ గూఢచార సంస్థ ఎమ్I5 సెక్యూరిటీ ఉన్నప్పటికీ, దావూద్ ఫోన్ మాట్లాడగానే నా ప్యాంట్ తడిసిపోయింది. ఇకపై నీ పనులన్నీ ఖతమని చెప్పి దావూద్ ఫోన్ పెట్టేశాడు’ అని లలిత్ పేర్కొన్నాడు. 2009లో భారత్‌లో సాధారణ ఎన్నికల కారణంగా ఐపీఎల్ రెండో సీజన్‌ను దక్షిణాఫ్రికాకు తరలించాలన్న నిర్ణయంతో మాఫియా బెట్టింగ్ సామ్రాజ్యం కుప్పకూలిందని లలిత్ తెలిపాడు.
తాను స్పాట్-ఫిక్సింగ్‌ను కఠినంగా అడ్డుకోవడం, అనుమానితులను స్టేడియంల నుంచి బ్యాన్ చేయడం వల్ల మాఫియా తనపై కక్ష పెంచుకుందని వివరించాడు. ఇకపై క్రికెట్ జోలికి రానని మాటిచ్చిన తర్వాతే మాఫియా తనను విడిచిపెట్టిందని స్పష్టం చేశాడు. కాగా, ఆర్థిక అవకతవకల ఆరోపణలపై 2010లోనే బీసీసీఐ లలిత్‌ను సస్పెండ్ చేసి తర్వాత పూర్తిగా బ్యాన్ చేసింది.