పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో అత్యంత ఆసక్తి రేపినన్ రష్యా-ఉక్రెయి అమ్మాయిల పోరులో రష్యన్ మిరా ఆండ్రీవాదే పైచేయి అయింది. ఉక్రెయిన్ క్రీడాకారిణి మార్టా కోస్త్యుక్‌ను చిత్తుగా ఓడిస్తూ తన కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్ పోరులో ఆండ్రీవా 6-1, 6-3 తో మార్టాను వరుస సెట్లలో ఓడించింది. తమ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో మ్యాచ్ ముగిసిన తర్వాత ఆండ్రీవా, కోస్త్యుక్ కరచాలనం చేసుకోలేదు.
ఓటమి అనంతరం మార్టా కోర్టు నుంచి వేగంగా వెనుదిరిగింది. మ్యాచ్‌కు ముందు ఇద్దరు ప్రత్యర్థులు నెట్ వద్ద పక్కపక్కనే నిలబడి ఫొటోలు దిగడం టెన్నిస్‌లో ఆనవాయితీ. కానీ, ఆండ్రీవా, కోస్త్యుక్ నెట్‌కు ఇరువైపులా విడివిడిగా నిలబడి చిన్న పిల్లలతో ఫొటోలు దిగారు. మరో సెమీస్‌లో పోలాండ్ క్వాలిఫయర్ మయా క్వాలిన్స్కా 7-6 (7/4), 6-4తో రష్యా క్రీడాకారిణి డయానా ష్నైడర్‌ను ఓడించి ఫైనల్ చేరింది. శనివారం జరిగే తుదిపోరులో ఆండ్రీవా, మయా అమీతుమీ తేల్చుకోనున్నారు.