హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం అన్ని ఉపాధ్యాయ సంఘాలతో ఐక్య పోరాటం చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) నిర్ణయించింది. మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో పలు సంఘాల నేతలు సమావేశయ్యారు. ‘ప్రాథమిక పాఠశాలలు క్రమంగా మూతబడుతున్నాయి.
జీవో-25ను సవరించాలని కోరుతుంటే ప్రభుత్వం స్పందించడంలేదు. పర్యవేక్షణ పోస్టులు భర్తీచేయాలని కోరుతున్నా పట్టించుకోవడంలేదు’ అంటూ నేతలు అసంతృప్తి వ్యక్తంచేశారు. మాడల్ స్కూల్స్‌ను పాఠశాల విద్యలో విలీనం చేయాలని, టెట్‌లో సర్వీసు వెయిటేజీ ఇవ్వాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనీస వేతనాలు అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పలు సంఘాల నాయకులు సీహెచ్ రవి, ఏ వెంకట్, సీహెచ్ అనిల్‌కుమార్, తిరుపతి, సోమయ్య, లింగారెడ్డి, కే రమేశ్, విజయ్‌కుమార్, రవీందర్, కొండయ్య, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.