న్యూఢిల్లీ : ప్రాణం, స్వేచ్ఛ, అక్రమ నిర్బంధాలకు సంబంధించిన కేసుల్లో సాధారణ పని వేళల తర్వాత కూడా పౌరులు కోర్టులను ఆశ్రయించేందుకు వీలుగా కార్యాచరణ విధానాన్ని రూపొందించాలని దాఖలైన పిటిషన్ను పరిశీలించడానికి సుప్రీం కోర్ట్ మంగళవారం అంగీకరించింది. న్యాయవాది మహేరవిష్ రెయిన్ దాఖలు చేసిన ఈ పిటిషన్పై సీజేఐతో కూడిన ధర్మాసనం హైకోర్టులకు నోటీసులు జారీ చేసింది.
అర్ధరాత్రి అరెస్ట్లు, తెల్లవారుజామున కూల్చివేతలు, దేశ బహిష్కరణలపై విశ్వసనీయమైన నివేదికల నేపథ్యంలో కోర్టులను మూసి ఉంచాలనుకోవడం సమంజసం కాదని పిటిషనర్ వాదించారు. ‘ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం రాత్రి వేళ మౌనంగా ఉండకూడదు. అలాగే స్వేచ్ఛకు రక్షణ అనేది ఉదయం కోర్టుల పని వేళ కోసం వేచి ఉండకూడదు’ అని పిటిషనర్ పేర్కొన్నారు.