న్యూఢిల్లీ, జూలై 14 : భారత సంతతికి చెందిన వ్యోమగామి అనిల్ మీనన్ తొలి అంతరిక్ష యాత్ర..విజయవంతంగా మొదలైంది. కజకిస్థాన్‌లోని చారిత్రక బైకనూర్ కాస్మోడ్రోమ్ నుండి ప్రయోగించిన ‘సూయజ్ ఎంఎస్-29’ వ్యోమనౌకలో రష్యా వ్యోమగాములతో కలిసి ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్)కు చేరుకున్నారు. మంగళవారం రాత్రి 8 గంటలకు గగనతలంలోకి దూసుకెళ్లిన వ్యోమనౌక..మూడు గంటల్లో ఐఎస్ఎస్కు సమీపంలోకి చేరుకుంది.
డాకింగ్ ప్రక్రియ అనంతరం ముగ్గురు వ్యోమగాములు ఐఎస్ఎస్లోకి అడుగుపెడతారు. అక్కడ వీరంతా దాదాపు 8 నెలలపాటు వివిధ రకాల శాస్త్రీయ పరిశోధనలు, టెక్నాలజీ పనితీరుపై ప్రయోగాలు చేపట్టనున్నారు. అనిల్ మీనన్ ప్రధానంగా..రక్త ప్రసరణ, రక్తనాళాల్లో మార్పులు..మొదలైన అంశాలపై అధ్యయనం చేయనున్నారు. చంద్రుడు, అంగారకుడిపై భవిష్యత్ అంతరిక్ష యాత్రలకు వీరి పరిశోధన ఫలితాలు కీలకం కాబోతున్నాయి.