గట్టు, జూలై 14 : గట్టులోని రెండు చోట్ల బంగారం దొరికిందనే ప్రచారం గుట్టు వీడడం లేదు. ఈ వ్యవహారం ఎటూ తేలకపోవడంతో పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గట్టులోని బిచ్చాలపేటలోని మసీదు సమీపంలో ఓ పురాతన ప్రాంతంలో పెద్ద ఎత్తున బంగారం దొరికిందనే ప్రచారం ఊపందుకుంది. అయితే ఈ ప్రాంతంలో 20 కేజీలకుపైగా బంగారం దొరికిందనే ప్రచారం జోరుగా సాగుతున్నది. అయితే దీన్ని ఎవరికివారు పంచుకున్నారనే ఆరోపణలు వినబడుతున్నాయి. ఈ వ్యవహారం చాలా కాలం కిందట చోటుచేసుకుంది. తాజాగా గట్టు నడిబొడ్డులోని సుభాష్చంద్రబోస్చౌక్ సమీపంలో ఓ ఇంటికి సంబంధించి పాత గోడను తొలగించి కొత్తగా నిర్మించే క్రమంలో బంగారు కడ్డీలు, వెండి నాణేలు దొరికాయని ప్రచారం ఇప్పుడు జరుగుతోంది. ఇదిలావుండగా ఈ నాణేల ఫొటో లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటిని వందేళ్ల కిందటి నాటి బ్రిటిష్ పాలనలో చెలామణి అయిన నాణేలుగా చెబుతున్నారు.
కాగా వీటిని దొరికించుకున్న వారు కొన్నింటికి ఇంటి యజమానికి అప్పగించారు. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరిస్తున్నారు. బంగారుతోపాటు నాణేలు దొరికిన వారిపై పలువురు నేతలు ఒత్తిడి తీసుకువచ్చి వాటిని తమకు అప్పగిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని చెబుతూ వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. మొత్తం మీద ఈ వ్యవహారం గట్టులో హాట్ టాపిక్‌గా మారింది. ఎటుచూసినా ఈ వ్యవహారం గురించే మాట్లాడడం కనిపిస్తోంది. దీనిపై ఎస్సై శేఖర్‌గౌడ్‌ను వివరణ కోరగా నాణేలు దొరికాయనే విషయం మా వద్దకు కూడా వచ్చింది. ఓ నాణేన్ని సోమవారం పరిశీలించాను. దీన్ని ఏళ్ల కిందటి నాటిదిగా గుర్తిం చాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ వ్యవహారం గురించి తాసీల్దార్‌కు లేఖ రాస్తున్నాం. వారి సూచనల మేరకు చర్యలు చేపడుతాం.
నాణేలు స్వాధీనం
బంగారు చిన్నపాటి తునకతోపాటు 33 వెండి నాణెలను తాసీల్దార్ విజయ్‌కుమార్ మంగళవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు తాసీల్దార్, ఎస్ఐ శేఖర్‌గౌడ్ ఆధ్వర్యం లో పంచనామా నిర్వహించారు. అంతకుముం దు పూర్తి వివరాలను ఇంటి యజమాని నుంచి సేకరించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తాసీల్దార్ విజయ్‌కుమార్ స్పష్టంచేశారు.