ఖమ్మం అర్బన్, జూలై 12 : సర్కారు పాఠశాలల్లో మౌలిక వసతుల లేమితోపాటు ఉపాధ్యాయుల కొరత సమస్య వెక్కిరిస్తున్నది. నాణ్యమైన విద్యను అందిస్తున్నామని కాంగ్రెస్ సర్కార్ గొప్పలు చెబుతునప్పటికీ ఆచరణలో మాత్రం అది కనిపించడం లేదు. బడులు ప్రారంభమై నెలరోజులవుతున్నా చాలా పాఠశాలల్లో కొన్ని సబ్జెక్ట్‌లకు పాఠాలే ప్రారంభంకాని దుస్థితి నెలకొంది. ఈ విద్యాసంవత్సరంలో పలువురు ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ పొందగా, పలువురు వేసవి సెలవుల కంటే ముందే ఉద్యోగ విరమణ పొందడంతో చాలా ఖాళీలు ఏర్పడ్డాయి.
వాటిని పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి సర్దుబాటు (వర్క్ అడ్జెస్ట్మెంట్) ద్వారా ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉండగా నేటికీ సర్దుబాటు చేయలేదు. ఖమ్మంజిల్లా విద్యాశాఖ పరిస్థితి మరి దారుణంగా ఉంది. గత విద్యాసంవత్సరంలో నలుగురు డీఈవోలు మారగా ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలోనే డీఈవో సెలవుపెట్టడంతో రెవెన్యూ విభాగానికి చెందిన అధికారికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇటువంటి పరిస్థితుల్లో వర్క్ అడ్జెస్ట్మెంట్ ప్రక్రియ ఒక అడుగు ముందుకి.. నాలుగు అడుగులు వెనక్కిలా తయారైంది.
ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, పీడీ కేటగిరిలో సర్దుబాటు ప్రక్రియ నిర్వహిస్తారు. విద్యార్థులు నిష్పత్తిని పరిగణనలోకి తీసుకుని ఉపాధ్యాయులు అధికంగా ఉన్న పాఠశాల నుంచి విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండి ఉపాధ్యాయులు అవసరమైన పాఠశాలకు కేటాయిస్తారు. ఈ ప్రక్రియలో తొలుత అదే మండలం పరిధిలోని పాఠశాలలకు కేటాయిస్తారు. సాధ్యంకానప్పుడు పక్కపక్కన ఉన్న మండలానికి సర్దుబాటు చేస్తారు. కాని కొన్నిచోట్ల నియోజకవర్గాలు దాటి కూడా వర్క్ అడ్జెస్ట్మెంట్లో ఇస్తున్నారు. సత్తుపల్లి నుంచి ఖమ్మానికి, సత్తుపల్లి నుంచి మధిర నియోజకవర్గంలోని పాఠశాలలకు కూడా సర్దుబాటులో స్థానాలు కేటాయిస్తున్న సంఘటనలు ఉన్నాయి. వేంసూరు నుంచి మధిర నియోజకవర్గంలోని ఓ పాఠశాలకు, మధిర నుంచి వేంసూరుకి ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. దీంతో ఈ విద్యాసంవత్సరం జరిగే సర్దుబాటులో మాకు కూడా మ్యూచివల్ ఇవ్వాలని పలువురు ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు.
సర్దుబాటు ప్రక్రియ పూర్తి అయ్యేదెప్పుడో, పాఠాలు ప్రారంభమయ్యేదెప్పుడో అన్నట్లుగా ఉంది పరిస్థితి. జిల్లాలో సుమారు 300మంది ఉపాధ్యాయుల వరకు విద్యార్థుల నిష్పత్తికంటే అధికంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వేసవి సెలవుల సమయంలో డీఈవో సెలవులో ఉండటంతో విద్యాశాఖను పర్యవేక్షిస్తున్న అదనపు కలెక్టర్ డాక్టర్ పీ శ్రీజ సర్దుబాటు ప్రక్రియపై పలు ధపాలుగా సమీక్షలు నిర్వహించి జూన్, జూలై, ఆగస్టు నెలలో ఉద్యోగ విరమణ పొందే ఉపాధ్యాయుల స్థానంలో కూడా సర్దుబాటు ఉపాధ్యాయులను నియమించాలని ఆదేశించారు. తర్వాత ప్రక్రియను పర్యవేక్షించాల్సిన డీఈవో లేకపోవడం, ఇతర కారణాలతో ముందుకు సాగలేదు.
జిల్లాలోని చాలా ప్రాథమిక పాఠశాలల్లో జీవో నెంబర్ 25ప్రకారం 10మంది విద్యార్థులు దాటితే ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలనే నిబంధన ఉంది. కొన్ని పాఠశాలల్లో 11, 12 మంది విద్యార్థులున్నట్లు రికార్డుల్లో చూపిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం విద్యార్థులు సగం మందికి కూడా రారని ఆరోపణలున్నాయి. ఖమ్మం నగరంలోని అనేక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉండి, ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా ఉండటం వల్లన బోధనకు ఆటంకం కలుగుతున్నది. కూసుమంచి మండలంలో ఓ ప్రాథమిక పాఠశాలలో 47మంది విద్యార్థులుండగా ఒక ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం ముగ్గురు ఎస్జీటీలు పనిచేస్తున్నారు.
కూసుమంచి మండలంలోని మరో పాఠశాలలో 47మంది విద్యార్థులుంటే ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే పనిచేస్తున్నారు. ఇదే మండలంలో అనేక పాఠశాలల్లో పది నుంచి 15మంది విద్యార్థులున్నచోట ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేస్తున్న పాఠశాలలు అనేకం ఉన్నాయి. ఖమ్మంరూరల్ మండలంలోని ఓ పాఠశాలలో 15మంది విద్యార్థులుంటే ముగ్గురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. అదే మండలంలో మరో ప్రాథమిక పాఠశాలలో 50మంది విద్యార్థులున్న ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే పనిచేస్తున్నారు. ఇలాంటిచోట ఎంఈవోలు విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా టీచర్ల సర్దుబాటులో ప్రాధాన్యత ఇవ్వాలని పలువురు ఉపాధ్యాయులు కోరుతున్నారు.