సిటీబ్యూరో/ మల్కాజిగిరి, జూలై 12 : ప్రజాధనం వృథా అవుతుందని తెలుసు… నిబంధనలు తుంగలో తొకుతున్నారని గమనిస్తూనే ఉన్నారు..కిందిస్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారి వరకు అంతా స్పష్టంగా కనిపిస్తోంది. అయినా సరే, అందరిదీ ఒకే మౌనం! కళ్లెదుట మాన్సూన్ అత్యవసర పనుల్లో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం, నిబంధనల ఉల్లంఘనలు స్పష్టంగా కనిపిస్తున్నా చర్యలు శూన్యం. పనుల పర్యవేక్షణ లేదు, కార్మికుల హాజరుపై స్పష్టత లేదు.
కేవలం జియో మ్యాపింగ్ ఫొటోలతోనే అంతా సజావుగా సాగుతోందంటూ మభ్యపెడుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఒక్కో సర్కిల్లో దాదాపు రూ. 50 లక్షల ప్రజాధనం గోల్మాల్ అవుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా టెండర్ నిబంధనల ప్రకారం వర్షాకాలం ఐదు నెలల పాటు మూడు షిప్టుల్లో ఎంఈటీ బృందాలు క్షేత్రస్థాయిలో ఉండి అన్ని పనుల్లో నిమగ్నం కావాలి. కానీ చాలా చోట్ల వర్షం పడిన సందర్భాల్లో మాత్రమే క్షేత్రస్థాయిలో కనబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కార్మికుల హాజరు, పనుల పర్యవేక్షణ, సమస్యల పరిష్కారంపై సంబంధిత సిబ్బందిని సంప్రదిస్తే మాకు తెలియదని చెప్పడం కొసమెరుపు.
ఎంఎంసీ పరిధిలోని ఓ సర్కిల్లో 6 డివిజన్లు ఉన్నాయి. డివిజన్‌కు 4 గురు చొప్పున 72 మంది మాన్సూన్ కార్మికులు పనిచేయాల్సి ఉంది. మూడు షిప్టులు అంటే 8 గంటలకు ఒకషిష్టు చొప్పున కార్మికులు ఉంటారు. ఇక్కడ మాత్రం ఓ కాంట్రాక్టర్(గతంలో కూడా ఇతడే) 23 మంది కార్మికులతో పనిచేయిస్తున్నారు. పనుల కోసం ఈ కాంట్రాక్టర్ వద్దకు పాలమూరు, వరంగల్ జిల్లాల నుంచి కార్మికులు వచ్చారు. పనుల్లో చేరిన తర్వాత 24 గంటలు పనిచేయాలని చెప్పడంతో కార్మికులు అవాక్కయ్యారు. నెలకు రూ.22 వేలు వేతనం అందజేస్తామని తెలిపారు. దిక్కుతోచని కార్మికులు 24 గంటలు పనిచేయాల్సి
వస్తున్నది. అదేవిధంగా ఈ పనులు 5 నెలల పాటు కొనసాగాల్సి ఉంటుంది. 3 నెలలు దాటితేనే ఈఎస్ఐ అమలు చేయాల్సిన సదరు కాంట్రాక్టరు వీరికి ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు.
వీరికి ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారో తెలియని పరిస్థితి. వీటిని పూర్తిస్థాయిలో అమలు చేయించాల్సిన అధికారులు, పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సర్కిల్లో 23కి ఒక్కరికి 23 వేలు అందజేస్తే రూ.5,06000 అవుతుంది. వీటిని 5 నెలలు అందజేస్తే రూ.25.30 లక్షలు అవుతుంది. ప్రతి డివిజన్‌కు ఒక వాహనం చొప్పున 6 వాహనాలకు 5 నెలల కాలానికి రూ.14.40 లక్షలు చెల్లిస్తున్నారు. ఈ రెండు కలిపితే రూ.39.70 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంది. నెలకు లక్ష చొప్పున ఇతర ఖర్చులు చేసిన, మొత్తంగా రూ.45 లక్షల మేర పనుల కోసం వెచ్చిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కానీ ఈ సర్కిల్‌కు ప్రభుత్వం కేటాయించిన నిధులు అక్షరాల రూ.96,35,475 లక్షలు. అంటే ఒక సర్కిల్లో కాంట్రాక్టర్లు చేస్తున్న ఖర్చు 50 శాతమే. ఉదాహరణకు రూ.50 లక్షలు ఎవరికి వెళ్తున్నట్లు, ఇంత స్థాయిలో ప్రజాధనం వృథా చేస్తున్న అధికారులు స్పందించకపోవడం గమనార్హం. ఇంత భారీ కుంభకోణం జరుగుతున్నా ఉన్నతాధికారులు స్పందించకపోవడం వెనుక మర్మమేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
కార్మికులతో 24 గంటలు పనిచేయిస్తున్న కార్మిక చట్టాలు అమలు చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇన్ని తెలిసిన హైడ్రా అధికారులు పట్టించుకోకపోవడంపై కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఉదయం పనిచేసి వచ్చి రెస్ట్ తీసుకుంటున్నామని, రాత్రి మళ్లీ రావాలని సూపర్వైజర్లు చెప్పడంతో నిద్రలేక అవస్థలు పడుతున్నామని ఉప్పల్ సర్కిల్‌కు చెందిన కొంతమంది కార్మికులు ‘ నమస్తే తెలంగాణ ’ ప్రతినిధితో తమ ఆవేదన వ్యక్తం చేశారు. 24 గంటలు పనిచేయాలంటే కష్టంగా ఉందని, అడిగితే ఇప్పుడు ఎం పనిలేదని, పని ఉన్నప్పుడు మధ్యలో కొంతమంది వస్తారని చెపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పనుల్లో స్కిల్ వర్కర్లు ఉండాలి, వారికి పలు సేప్టి చర్యలు, ఈఎస్ఐ లాంటివి పాటించాలి. ఇలాంటి పనుల్లో కార్మికుల శ్రమను దోచుకుంటున్నవారిపై కార్మిక సంఘాలు దృష్టిసారించాలని కార్మికులు కోరుతున్నారు.