హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ) : ‘సీఎం రేవంత్‌రెడ్డి మెప్పుకోసమే కేసీఆర్, కేటీఆర్‌పై నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అవాకులు, చెవాకులు పేలుతున్నారు. సూర్యునిపై ఉమ్మివేయాలని చూస్తే అది తన ముఖంపైనే పడుతుందనే విషయాన్ని ఆయన తెలుసుకోవాలి’ అని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధిని వీరేశం గాలికొదిలేశారని ఆరోపించారు. గత రెండున్నరేండ్లుగా కనీసం రోడ్ల మరమ్మతులు కూడా చేయని దద్దమ్మ పాలన ఇక్కడ నడుస్తున్నదని మండిపడ్డారు.
అభివృద్ధిని పకనబెట్టి, కేవలం వ్యక్తిగత దూషణలకే ప్రాధాన్యమిస్తున్నారని దుయ్యబట్టారు. రైతుల సమస్యలను పట్టించుకోవాల్సిన బాధ్యతను విస్మరించి, నియోజకవర్గంలో ఆటవిక పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. వీరేశం చరిత్ర అంతా బ్లాక్ మెయిలింగ్, అక్రమ దందాలతోనే నిండి ఉన్నదని, అడ్డగోలు సంపాదనతోనే విర్రవీగుతున్నారని ఆరోపించారు. ఆయనకు సరైన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.