హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ)/ గోదావరిఖని: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలపై సింగరేణి కార్మికలోకం భగ్గుమంటున్నది. బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా డిసెంబర్ 9న సమ్మె చేపట్టాలని సింగరేణి గుర్తింపు సంఘం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) నిర్ణయించింది. సింగరేణి పరిధిలోని నాలుగు బొగ్గు గనుల వేలంపాటను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ, టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావు గురువారం సింగరేణి సంస్థ యాజమాన్యానికి సమ్మె నోటీస్ అందజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో సింగరేణి దినదినాభివృద్ధి చెందుతున్నది. ఇతర రాష్ర్టాల్లో సైతం విస్తరణ కార్యక్రమాలు చేపడుతున్నది. రూ.వందల కోట్లు వెచ్చించి, సింగరేణి అభివృద్ధి చేసిన కళ్యాణ్ఖని బ్లాక్-6, కోయగూడెం బ్లాక్-3, సత్తుపల్లి బ్లాక్-3, శ్రావణ్‌పల్లి బ్లాకులను వేలం ద్వారా అమ్మేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తాను అభివృద్ధి చేసిన ఈ బ్లాక్‌లను కాపాడుకోవాలంటే సింగరేణి సంస్థ కూడా బహిరంగ వేలంలో పాల్గొనాల్సిన పరిస్థితిని కేంద్రం సృష్టించింది. ఈ నాలుగు బ్లాక్‌లను వేలం నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. స్వరాష్ట్రంలో లాభాల్లో పయనిస్తున్న సింగరేణి నడ్డివిరిచి, కోల్ ఇండియాతోపాటు దీనిని కూడా ప్రైవేటీకరించి, బొగ్గు బ్లాక్‌లను ప్రైవేట్ పెట్టుబడిదారులకు ధారాదత్తం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదని కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలు మార్చుకోకపోతే సమ్మె తప్పదని హెచ్చరిస్తున్నాయి.
సింగరేణిని దెబ్బ తీసేందుకు కుట్రలు
సింగరేణి నడ్డి విరిచేందుకు కేంద్ర ప్రభుత్వం కుయుక్తులు పన్నుతున్న ది. సింగరేణికి చెందిన నాలుగు బ్లాకులను వేలం ద్వారా అమ్మేయడానికి ప్రయత్నిస్తున్నది. వీటిపై సింగరేణి సంస్థ ఇప్పటికే వందల రూపాయల కోట్లు ఖర్చు పెట్టింది. దానిని కాదని ఓపెన్ మార్కెట్ ద్వారా వేలం వేయడాన్ని వ్యతిరేకిస్తున్నాం. డిసెంబర్ 9న సమ్మెకు వెళ్లాలని నిర్ణయించాం. కేంద్ర ప్రభుత్వం సింగరేణి బ్లాకుల వేలాన్ని రద్దుచేసే వరకు మా పోరాటం కొనసాగుతుంది.
-మిర్యాల రాజిరెడ్డి,
టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి