JD Cchakravarthy | బుల్లితెరపై నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ హీరోగా సినీ రంగంలోకి అడుగుపెట్టినప్పటి నుంచే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతున్నాడు. తొలి చిత్రం ‘రామ్ నగర్ బన్నీ’ ప్రమోషన్ కార్యక్రమాల్లో అతని హావభావాలు, మాట్లాడే తీరు చూసి నెటిజన్లు ‘యాటిట్యూడ్ స్టార్’ అనే ట్యాగ్ కూడా ఇచ్చారు. అయితే ఆ సినిమా ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, చంద్రహాస్‌కు మరో అవకాశం దక్కింది. అతను నటించిన తాజా చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’ ఈ నెల 6న విడుదలకు సిద్ధమవుతోంది.ఇదిలా ఉండగా, ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సినిమా ప్రమోషన్ ఈవెంట్లో చంద్రహాస్ చేసిన ఒక చర్య పెద్ద వివాదానికి దారి తీసింది. స్టేజిపై అతను అత్యుత్సాహంతో బూతు పదాలు ఉన్న పాట పాడటం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు గురైంది.
కుటుంబ సభ్యులు, మహిళలు, చిన్నపిల్లలు కూడా హాజరైన కార్యక్రమంలో ఇలాంటి పాట పాడటం సరైంది కాదని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో మరోసారి ‘యాటిట్యూడ్ స్టార్ వారసుడు ఇదేం యాటిట్యూడ్?’ అంటూ ట్రోల్స్ మోతెక్కాయి.ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన నటుడు జేడీ చక్రవర్తి తాజాగా ఈ వివాదంపై స్పందించారు. చంద్రహాస్ పాట పాడుతున్న సమయంలో తాను కూడా షాక్‌కు గురయ్యానని ఆయన వెల్లడించారు. మొదట అతను ఏం పాడుతున్నాడో తనకు అర్థం కాలేదని, కానీ కొందరు వీడియోను ఎడిట్ చేసి తాను చప్పట్లు కొడుతూ ఆస్వాదించినట్లు చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వీడియో చూస్తే నిజం తెలుస్తుందని ఆయన అన్నారు.
ఇలాంటి ఈవెంట్లలో గెస్టులు స్టేజీపై ఏమి మాట్లాడుతున్నారో అందరూ కచ్చితంగా వినరని, పక్కనున్న వారితో మాట్లాడటం లేదా పరిచయస్తులను పలకరించడం వల్ల కొన్నిసార్లు విషయాలు గమనించలేమని చెప్పారు. తన పక్కన ఉన్న ఒక యువతికి తెలుగు అర్థం కాకపోవడంతో ఆమె చప్పట్లు కొట్టిందని, దాన్ని చూసి తాను కూడా స్పందించినట్లు అపోహలు సృష్టించారని వివరించారు. తాను బూతు పదాలు మాట్లాడనని, తన ముందు ఎవరైనా అలా మాట్లాడినా సహించనని స్పష్టం చేశారు. అదేవిధంగా, సెట్లో ఒకసారి బూతులు మాట్లాడిన దర్శకుడిని తాను కొట్టిన సందర్భం కూడా ఉందని జేడీ తెలిపారు. ఆ ఈవెంట్లో చంద్రహాస్ పాట పాడుతుండగా తాను, మరో దర్శకుడు జయంత్ ఒకరినొకరు చూసుకుని ఆశ్చర్యపోయామని చెప్పారు. అప్పటికప్పుడు స్టేజ్ వదిలి వెళ్లిపోదామనుకున్నప్పటికీ, అలా చేస్తే సినిమా మీద నెగెటివ్ ప్రభావం పడుతుందని భావించి ఆగిపోయానన్నారు. పూజా బేడీ తనను ఆపిందని కూడా వెల్లడించారు.
“ఇలాంటి చెత్త ప్రమోషన్లతో సినిమాలు ఆడతాయనుకోవడం భ్రమ మాత్రమే” అంటూ జేడీ చక్రవర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వివాదం ‘బరాబర్ ప్రేమిస్తా’ సినిమా విడుదలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో కొనసాగుతున్న చర్చలు సినిమాకు నష్టమా, లేక పబ్లిసిటీగా మారతాయా అన్నది విడుదల తర్వాతే తేలనుంది.