కరీంనగర్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): వాణిజ్య పరమైన జీఎస్టీ, సీఎస్టీ, వ్యాట్ పన్నులు ఎగవేస్తే ఉపేక్షించేది లేదని, అలాంటి వ్యాపారుల ఆస్తులను సీజ్ చేయాలని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతూ కుమారి ప్రసాద్ ఆదేశించారు. శుక్రవారం కరీంనగర్‌లోని వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ ఆఫీస్‌లో ఉమ్మడి జిల్లా పరిధిలోని అధికారులతో సమీక్షించారు. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో వాణిజ్య పన్నులు రూ.కోట్లలో రావాల్సి ఉందని, ఈ నెలాఖరు వరకు వసూలు చేయాలని ఆదేశించారు. బకాయిపడిన వ్యాపారులకు నోటీసులు జారీ చేశామని అధికారులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. కరీంనగర్-1,2తోపాటు జగిత్యాల, పెద్దపల్లి సీటీవోల పరిధిలో ఉన్న బకాయిలను ప్రాంతాల వారీగా అడిగి తెలుసుకున్న కమిషనర్.. వ్యాపారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ నెల 30 వరకు బకాయిలు చెల్లించని వ్యాపారుల బ్యాంక్ ఖాతాలు సీజ్ చేయాలన్నారు. అప్పటికీ వినకుంటే వారి ఆస్తులను సీజ్ చేయాలని స్పష్టం చేశారు. మున్సిపల్ కార్యాలయాల్లో వ్యాపారుల ఆస్తులకు సంబంధించిన వివరాలను సేకరించి అవి ట్రాన్స్ఫర్ కాకుండా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనూ ఫిర్యాదు చేయాలని సూచించారు. సీటీవో కార్యాలయాల నుంచి లైసెన్స్‌లు తీసుకుని పన్నులు కట్టకుండా ఎగవేసేందుకు పేర్లు మార్చి కొత్త లైసెన్స్‌లు తీసుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఆస్తులు జప్తు చేసే పరిస్థితి వచ్చినపుడు రెవెన్యూ రికవరీ యాక్ట్‌ను వినియోగించుకోవాలని సూచించారు. సుమారు మూడున్నర గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో ఎట్టి పరిస్థితిలో ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలను, పాత బకాయిలను వసూలు చేయాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కమిషనర్ వేణుగోపాల్ రావు, కరీంనగర్-1,2 సీటీవోలు పట్వారి, మాదయ్య, జగిత్యాల సీటీవో గౌతం సిద్దార్థతో పాటు డీసీటీవోలు, ఏసీటీవోలు పాల్గొన్నారు. కరీంనగర్ కలెక్టర్‌గా పనిచేసి వెళ్లిన తర్వాత మొదటిసారి జిల్లాకు వచ్చిన నీతూ కుమారి ప్రసాద్‌ను వాణిజ్య పన్ను ల శాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముజాయిద్ హుస్సేన్, జిల్లా అధ్యక్షుడు జీ భిక్షపతి ఘనంగా సన్మానించారు. ఉద్యోగుల సమస్యలను కూడా ఆమె దృష్టికి తీసుకెళ్లారు.