Tamil Nadu : తమిళనాడులో శాంతిభద్రతల పరిస్ధితి పూర్తిగా దిగజారిందని బీజేపీ నేత తమిళిసై సౌందర్‌రాజన్ ఆరోపించారు. ప్రతిరోజూ మనం రాజకీయ హత్యల వార్తలు చూస్తున్నామని, ఈరోజు ఉదయం శివగంగలో ఏఐఏడీఎంకే నేత, బీజేపీ కార్యకర్త హత్య వార్తలు వెలుగుచూశాయని ఆమె పేర్కొన్నారు. డీఎంకే సర్కార్ శాంతిభద్రతల పరిరక్షణపై దృష్టి సారించాలని అన్నారు.
అధికారులు, కలెక్టర్లను మార్చినంత మాత్రాన పరిష్కారం లభించదని అన్నారు. తమిళనాడు సీఎం నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కావాల్సిందని చెప్పారు. అలాంటి కీలక సమావేశాన్ని వారు బహిష్కరించడం తమిళనాడు అభివృద్ధిని అడ్డుకోవడమేనని ఆమె మండిపడ్డారు. మరోవైపు తమిళనాడులో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నారాయణన్ తిరుపతి ఆరోపించారు.
రాష్ట్రంలో జరుగుతున్న మూక దాడులు, కిరాయి హత్యలను ప్రభుత్వం నిరోధించలేకపోతోందని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, అధికార యంత్రాంగం నిరాసక్తత కారణంగా ఈ పరిస్ధితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. శాంతి భద్రతలను కాపాడటం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతని, శాంతి భద్రతలను పర్యవేక్షించలేకుంటే ప్రభుత్వం తక్షణమే వైదొలగాలని ఆయన డిమాండ్ చేశారు.
Read More :