Venezuela | వెనెజులా అధ్యక్షుడి (Venezuelas President)గా నికోలాస్ మదురో ( Nicolas Maduro) మరోసారి ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన ఆ దేశ అధ్యక్ష ఎన్నికల్లో మదురోకు 51 శాతం ఓట్లు పోలయ్యాయి. దీంతో మూడోసారి వెనెజులా అధ్యక్షుడిగా నికోలాస్ మదురో భారీ మెజారిటీతో ఎన్నికయ్యారు.
వేతనాల్లో కోత, ఆకలికేకలు, వలసలు, చమురు పరిశ్రమలో సంక్షోభం వంటి సమస్యలతో కునారిల్లుతున్న వెనెజులాలో ఆదివారం అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పది మంది దాకా అధ్యక్ష పదవికి పోటీ పడినప్పటికీ.. ప్రధాన పోటీ మాత్రం మదురో, యూనిటరీ డెమొక్రటిక్ ప్లాట్‌ఫామ్‌కు చెందిన ఎడ్మండో గోంజాలెజ్ (Edmundo Gonzalez) మధ్యే సాగింది. ఇక మొత్తం 80శాతం ఓట్లను లెక్కించగా మదురోకు 51.20శాతం పోలైనట్లు తేలింది. ఆయన ప్రధాన ప్రత్యర్థికి కేవలం 44.02శాతమే లభించాయి. ఈ మేరకు ఆ దేశ నేషనల్ ఎలక్టోరల్ కౌన్సిల్ అధికారి ప్రకటించారు.
వెనెజులా ప్రెసిడెంట్ ఎన్నికలు ఈ సారి వివాదాస్పదంగా మారాయి. ఈ ఎన్నికలు చాలా ఆలస్యంగా నిర్వహించడంతో పాటు.. ఎన్నికల యంత్రాంగంపై అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి. ఇక ప్రపంచదేశాలతో వెనెజులా సంబంధాలు స్నేహపూర్వకంగా లేకపోవడం మరో పెద్ద సమస్య. దీనికి తోడు తాజా ఎన్నికల్లో పారదర్శకత లేదని అమెరికా అభిప్రాయపడింది. ఇక దేశ ప్రజలంతా సోషలిస్ట్ విధాలున్న ప్రతిపక్ష పార్టీ పట్ల సానుకూలంగా ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. అత్యధిక ఒపీనియన్ పోల్స్‌లో మదురోపై గోంజాలెజ్‌కు స్పష్టమైన ఆధిక్యం లభించింది. అయినప్పటికీ ఎగ్జిట్ పోల్స్ అంచాలను తలకిందలు చేస్తూ.. తాజా ఎన్నికల్లో మరోసారి మదురో విజయం సాధించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
అంతర్జాతీయ పరిశీలకుల పర్యవేక్షణలో వెనిజులా అధ్యక్ష ఎన్నికలు ఆదివారం జరిగాయి. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఉదయం 6 గంటలకు మొదలైన పోలింగ్ 12 గంటలపాటు సాగింది. ఓటింగ్ మెషిన్లు మొరాయించడం కానీ, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరిగినట్లు కానీ సమాచారం లేదని ఆ దేశ ఎన్నికల సంఘం అధ్యక్షుడు ఎల్విస్ అమోరసో తెలిపారు. 2.1 కోట్ల మంది అర్హులైన ఓటర్ల కోసం దేశవ్యాప్తంగా 15,767 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
Also Read..
Coaching Centres | ఆ యువత కలలు కల్లలయ్యాయి.. ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఘటనపై శశి థరూర్