కరీంనగర్ విద్యానగర్, మే 4: “మావోయిస్టులతో మాటల్లేవు… మాట్లాడుకోవడాల్లేవ్. నిషేధిత సంస్థతో చర్చల ప్రసక్తే లేదు… వాళ్లు ఆయుధం వీడాల్సిందే. పోలీసులకు లొంగిపోవాల్సిందే. వాళ్ల ప్రవర్తన మార్చుకోవాల్సిందే.”అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజ య్ కుమార్ స్పష్టంచేశారు. మావోయిస్టు సమస్యను సామాజిక కోణంతో చూడాలంటూ సీఎం రేవంత్, ఆపరేషన్ కగార్‌ను ఆపాలంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. “ఆయుధాలు చేతపట్టి అమాయక ప్రజలను, గిరిజనులను కాల్చి చంపడా న్ని సామాజిక కోణంతో చూడాలనడం ఏం పద్ధతి. కె్లైమోర్ మైన్స్ అమర్చి పోలీసులను తునాతునలు చేసి చంపుతుంటే సామాజిక కోణంతో చూడాలా? అసలు మావోయిస్టులపై నిషేధం విధించిందే కాంగ్రెస్ పాలకులు కదా?ఇప్పుడు సామాజిక కోణం, చర్చలంటూ సన్నాయి నొకులు నొకడమేంది? ఎంతో మంది ప్రజలను, గిరిజనులను, పోలీసులను కాల్చి చంపినప్పుడు మీకు ఈ విషయం గుర్తుకు రాలేదా?”అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మావోయిస్టులపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా? అని సవాల్ విసిరారు. కరీంనగర్ లోని కొత్తపల్లిలో ఆదివారం హనుమాన్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరైన అనంతరం మీడియాతో మాట్లాడారు.. ‘మేం మాత్రం చర్చలు జరిపే ప్రసక్తే లేదు. తుపాకి వీడాల్సిందే. పోలీసులకు లొంగిపోవాల్సిందే. వారి వైఖరి మారాల్సిందే. వాళ్లతో చర్చలు జరిపే సందర్భమే రాదు..’అని స్పష్టంచేశారు.