హైదరాబాద్ : అన్ని వర్గాల ప్రజలకు అన్ని రంగాలలో హక్కును కల్పించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగానికి దక్కుతుందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం సికింద్రాబాద్లోని కీస్ స్కూల్లో నిర్వహించిన భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ జయంతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ చిత్రపటం వద్ద పూలు సమర్పించి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన హక్కులే అమలు అవుతున్న రిజర్వేషన్ లు అన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా అనేక కార్యక్రమాలు అమలు చేసిందని వివరించారు. అద్భుతమైన సచివాలయం నిర్మిస్తే దానికి అంబేడ్కర్ పేరు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. చారిత్రాత్మక నగరం హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద అతిపెద్ద 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది అని చెప్పారు. రాజ్యాంగం లో కల్పించిన వెసులుబాటు తోనే తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్నామని అన్నారు.
అంటరానితనం, కులవివక్షను రూపుమాపడం కోసమే రాజ్యాంగం రూపొందించబడిందని, ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో ఆలయ ప్రవేశాలను అడ్డుకుంటున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని విచారం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మోండా డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆకుల హరికృష్ణ, నాయకులు జయరాజ్, మహేందర్, టి ఎన్ శ్రీనివాస్, గిరి, భవాని, అరుణ, శారద తదితరులు పాల్గొన్నారు.