‘రైతుబంధు’ సొమ్ము చేతికందుతుండడంతో రైతన్నల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. వరుసగా నాలుగో రోజుల నుంచి బ్యాంకు ఖాతాల్లో నగదు జమవుతుండగా శుక్రవారం 3 నుంచి 4 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్న వారికి పెట్టుబడి సాయం అందింది. మొదట ఎకరం, ఆ తర్వాత నాలుగెకరాలున్న వారికి ఇస్తుండడంతో అన్నదాతల్లో ఉత్సాహం కనిపిస్తోంది. వరి నాట్లు వేయడంతో పాటు మక్కజొన్న, పల్లికాయ, ఇతర పంటలు వేస్తూ ఎవుసం పనుల్లో బిజీ అయ్యారు. ఒకప్పుడు ఎరువులు, పురుగు మందుల కొనుగోలుతో పాటు ఇతరత్రా పనులకు చాలా ఇబ్బంది పడేదని.. రైతుబంధు వచ్చి రంది తీర్చిందని సంబురపడుతున్నారు. పెట్టుబడి సాయం ఇస్తున్నప్పటి నుంచి ఆసాములు కూడా తమకు త్వరగా డబ్బులు ఇస్తున్నారని కూలీలు సంతోషపడుతూ కేసీఆర్‌ను నిండు మనస్సుతో దీవిస్తున్నారు.
‘రైతుబంధు’ ఇచ్చుట్ల ఊరికచ్చిన..
ముందు పెట్టుబడికి ఢోకా లేకుంట పోయింది
పెద్దవంగర, డిసెంబర్ 31 : సీఎం కేసీఆర్ రైతుబంధు పథకం తెచ్చినంక ధైర్యం వచ్చింది. సాలుకు పెట్టుబడి సాయం ఇచ్చుడు తోటి ఎవుసం రంది లేకుంట సాగిపోతాంది. నాకు వానకాలం, యాసంగి రెండు పంటలకు ప్రతి యేడు రూ.25వేలు బ్యాంకు ఖాతాల పడ్తానయ్. తెలంగాణ రాకమునుపు ఎవుసం అంటే ఎన్నో కష్టమైతుండె. నేను హైదరాబాద్‌ల కారు డ్రైవింగ్ చేస్తుండె. కేసీఆర్ సార్ అచ్చినంక రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుంట కరంట్, నీళ్లు ఇచ్చుడు షురూ జేశినంక అక్కడ పని ఇడిశిపెట్టిన. నా సొంతూరికి వచ్చి పొలం పనులు చేస్తున్న. ఇప్పుడు ఉన్న ఊళ్లె మంచిగ పనులు చేసుకుంటాన.
గుంట సుత ఖాళీ పెడ్తలేం..
నాకు మా ఊళ్లె 12 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. రైతుబంధు పథకం పెట్టినకాన్నుంచి ఇప్పటిదాంక ప్రతి పసలుకు రూ.60వేల చొప్పున రూ.4లక్షల 20వేలు అచ్చినయ్. ఇదివరకు పంట పెట్టుబడి కోసం మస్తు కష్టమయ్యేది. మిత్తీలు కట్టలేక సావయ్యేది. అదునుకు ఎరువులెయ్యక పంట దిగుబడి తక్కువచ్చేది. దుకాణ్ల బతిలాడి ఎరువులు తెచ్చుకునేది. నేను 35 ఏండ్ల సంది ఎవుసం జేత్తాన. ఇప్పటిలెక్క ఎవరు కూడ ఎవుసాన్ని పట్టించుకోలే. ఏదో చేసినమా లేదా అన్నట్టుండె. ఒకసారి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబైతె ఎవుసం ఎందుకు చేస్తున్నరు దండుగని అవమానించిండు. నీళ్లు ఉండకపోవు, కరంటు ఉండకపోవు కష్టకాలంలో ఎవుసం నడిచింది. మాకున్న భూమిలో సగం మాత్రమే సాగయ్యేది. ప్రతి యేడు గిదే కథ. అసోంటిది పెట్టుబడి సాయం ఇచ్చుడు మొదలైనంక రైతుల్ల హుషార్ అచ్చింది. అప్పటిసంది ఠంచన్‌గా పొలం కాడికి పోయి, మంచిగ పంటలు పండిత్తాన. దిగుబడి కూడ మస్తు పెరిగింది. ఇప్పుడు గుంట కూడా ఖాళీ లేకుంట వానకాలం, యాసంగి పండుతాంది. మా రైతులకు ఇంతకన్న ఏం గావాలె.
విత్తనాలు కొంట..
నర్సింహులపేట, డిసెంబర్ 31 : పంటలు పండించేందుకు దుక్కి దున్ని సిద్ధం చేసిన. ఇంతల రైతుబంధు పైసల్ కూడా పడ్డయ్. ఇగ దుకాణ్లకు వోయి విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొన్కరావాలె. కూలీలకు ఇచ్చేటందుకు కూడ ఆసరైతయ్. నా భూమిలో ఏడాదికి పంట మార్చుతున్న. వానకాలంల వరి సాగుచేసిన. ఇప్పుడు పెసళ్లు ఏద్దామని అన్ని తయారు చేసిన. ఇదివరకు అప్పుల కోసం ఆడాఈడ అడుక్కొచ్చేది. మూడేండ్ల సంది ఆ బాధ తప్పింది. ఇప్పుడు వానకాలం వర్షం పడకముందే పంట పెట్టుబడి సొమ్ము బ్యాంకులో జమైతాంది. ప్రతి యేడు డబ్బులు పడంగనే విత్తనాలు, ఎరువులు మందుగానే తీసుకుంటున్నా. వానకాలం, యాసంగి కలిపి రూ.40వేలు వస్తానయ్. విత్తనాలు, మందులతో పాటు కూలీల ఇచ్చేటియి కూడా వీటిల నుంచే కడ్తాన్న.