Dates | ఖర్జూరాలను చాలా మంది స్వీట్ల తయారీలో ఉపయోగిస్తుంటారు. వీటితో పలు పానీయాలను తయారు చేసి కూడా తాగుతుంటారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. ఖర్జూరాలను నేరుగా కూడా తినవచ్చు. అయితే వీటిని ఎప్పుడో ఒకసారి తింటారు కానీ రోజూ తినరు. కానీ వాస్తవానికి ఖర్జూరాలను రోజూ తినాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. రోజూ 3 ఖర్జూరాలను తింటున్నా చాలు అనేక లాభాలు కలుగుతాయని అంటున్నారు. ఖర్జూరాలు మనకు అనేక పోషకాలను అందిస్తాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఖర్జూరాలను తినడం వల్ల ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. దీని వల్ల మలబద్దకం తగ్గుతుంది. అలాగే ఇవి ప్రీ బయోటిక్ ఆహారంగా కూడా పనిచేస్తాయి. అందువల్ల జీర్ణ వ్యవస్థలో ఉండే మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఖర్జూరాలలో సహజసిద్ధమైన చక్కెరలు ఉంటాయి. గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సూక్రోజ్ ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. అందువల్ల ఖర్జూరాలను తింటే వెంటనే యాక్టివ్ గా మారుతారు. ఉత్సాహంగా పనిచేస్తారు. నీరసం, అలసట తగ్గిపోతాయి. శారీరక శ్రమ లేదా వ్యాయామం చేసేవారికి ఎంతో మేలు జరుగుతుంది. మళ్లీ ఉత్తేజంగా పనిచేసేందుకు కావల్సిన శక్తి లభిస్తుంది. ఖర్జూరాల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీని వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. హైబీపీ ఉన్నవారికి ఖర్జూరాలు ఎంతో మేలు చేస్తాయి. వీటి వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఖర్జూరాల్లో ఉండే మెగ్నిషియం కండరాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీని వల్ల కండరాల నొప్పులు తగ్గుతాయి. ముఖ్యంగా రాత్రి పూట నిద్రలో కాలి పిక్కలు పట్టుకుపోకుండా ఉంటాయి.
ఖర్జూరాల్లో ఉండే మెగ్నిషియం నాడీ మండల వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీని వల్ల మెదడు యాక్టివ్‌గా పనిచేస్తుంది. మెడ, భుజాల నొప్పులు తగ్గిపోతాయి. వీటిల్లో అధికంగా ఉండే కాపర్, మాంగనీస్ ఎముకలను దృఢంగా మార్చి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఖర్జూరాల్లో అనేక రకాల బి విటమిన్లు సైతం ఉంటాయి. అలాగే ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్ వంటి యాంటీ ఆక్సిడెంట్లను కూడా అధిక మొత్తంలో పొందవచ్చు. ఇవి కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తాయి. దీని వల్ల ప్రాణాంతక వ్యాధులు రాకుండా నివారించవచ్చు. ఖర్జూరాలను తినడం వల్ల పొటాషియం అధిక మొత్తంలో లభించి బీపీ నియంత్రణలో ఉండడమే కాకుండా వీటిల్లో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. దీని వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
ఖర్జూరాలను తింటే క్యాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నిషియం, కాపర్, మాంగనీస్ పెద్ద మొత్తంలో లభించి ఎముకల సాంద్రత పెరుగుతుంది. దీంతో ఎముకలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. వయస్సు మీద పడడం వల్ల వచ్చే ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల సంబంధిత సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు. గర్భిణీలు డెలివరీకి ముందు కొన్ని రోజుల పాటు ఖర్జూరాలను తింటుంటే సుఖంగా ప్రసవం అవుతుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో తేలింది. అయితే దీనికి గాను మహిళలు తమ వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. వైద్యుల సలహా ప్రకారం వారు ఖర్జూరాలను తినాల్సి ఉంటుంది. ఇక ఖర్జూరాలను రోజుకు 3 వరకు తింటే ఉత్తమ ఫలితాలను సాధించవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అదే వ్యాయామం లేదా శారీరక శ్రమ చేసేవారు అయితే మరో 2 ఖర్జూరాలను అధికంగా తినవచ్చని అంటున్నారు. ఇలా ఖర్జూరాలను తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.