హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): కారు గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, డాక్టర్ సంజయ్ ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీలో చేరారని, దీనికి సంబంధించిన అన్ని ఆధారాలున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, కేపీ వివేకానంద తెలిపారు. గురువారం శాసనసభ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ నేతృత్వంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరిగింది. పార్టీ ఫిరాయించిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్‌పై ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, జగదీశ్‌రెడ్డిల క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. ఈ సందర్భంగా తెల్లం వెంకట్రావు, డాక్టర్ సంజయ్ పార్టీ మారినట్టు ఉన్న అన్ని ఆధారాలను స్పీకర్ ఎదుట ఉంచారు.
బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలుగానే కాకుండా కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా వారు చేసిన ప్రసంగాలు, ఆయా నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలను వీడియోలతో సహా ఉన్న ఆధారాలను సమర్పించారు. స్పీకర్ చర్యలు తీసుకోవడం ఒక్కటే ఉన్నదని, వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు. ఉదయం మొదలైన క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ మధ్యాహ్నం వరకు కొనసాగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతోపాటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, డాక్టర్ సంజయ్ కుమార్ కూడా వారి న్యాయవాదులతో కలిసి విచారణకు హాజరయ్యారు. శుక్రవారం కూడా విచారణ కొనసాగనున్నది.