తెలుగు యూనివర్సిటీ, నవంబర్ 6: పేద విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు చెల్లించకుండా, కాంగ్రెస్ సర్కార్ వారితో చెలగాటం ఆడుతున్నదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ధ్వజమెత్తారు. హైదరాబాద్ గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఫీజు పోరు’లో భాగంగా గురువారం నల్ల కండువాలతో ఫీజు బకాయిలు చెల్లించాలని కోరుతూ విద్యార్థులు చేతిలో పుస్తకాలు పట్టుకొని చదువుతూ నిరసన వ్యక్తంచేశారు. ‘కాలయాపన చేసే కమిటీలొద్దు.. ఫీజుల బకాయిలు వెంటనే చెల్లించండి’ అంటూ విద్యార్థులు ప్లకార్డులు పట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. విద్యార్థుల నిరసన దీక్షకు మద్దతు పలికిన వీ శ్రీనివాస్‌గౌడ్ సర్కార్ నిర్లక్ష్య వైఖరిపై మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు ఉన్నత విద్య అందని ద్రాక్షలాగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. రూ.10 వేల కోట్లకు పైగా బకాయిలు చెల్లించకుండా సుమారు 14.75 లక్షల మంది విద్యార్థుల జీవితాలను ఇబ్బందుకు గురి చేస్తున్నదని తెలిపారు. కళాశాల యాజమాన్యాలు ఫీజు బకాయిలు అడిగితే విజిలెన్స్ దాడులు, బ్లాక్మెయిల్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఫీజు బకాయిలు అందక ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు దివాలా తీస్తూ అధ్యాపకులకు వేతనాలు చెల్లించలేకపోతున్నాయని తెలిపారు.
ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్రలో భాగంగానే కాంగ్రెస్ సర్కార్ కోతలు, ఆంక్షలు, కమిటీల పేర్లతో కాలయాపన చేస్తున్నదని విమర్శించా రు. భావి ఓటర్లయిన విద్యార్థి, యువత.. కాంగ్రెస్ సర్కార్‌కు బుద్ధిచెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. పెండింగ్‌లో ఉన్న ఫీజుల బకాయిలను చెల్లించకుంటే రాష్ర్టాన్ని అగ్నిగుండంగా మారుస్తామని, దానికి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ హెచ్చరించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.