ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 6: నిధుల సమీకరణలో ఓయూ అధికారుల నిర్లక్ష్యం వర్సిటీకి శాపంగా మారింది. ఖాళీగా మిగిలిపోతున్న ఎంఈ, ఎంటెక్ సీట్లను స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేసుకునే అవకాశం ఉన్నా కూడా ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. ఏడాదికి రూ.50 లక్షలు నిధులు అదనంగా సమకూరే అవకాశం ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదు. సీట్ల భర్తీపై ఆశావహులు సైతం ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, ఖాళీ సీట్లను నిబంధనలకు అనుగుణంగా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఓయూ ఇంజినీరింగ్ కళాశాలలోని వివిధ బ్రాంచీల్లో 30 సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి.
టెక్నాలజీ కళాశాలలోని వివిధ బ్రాంచీల్లో సైతం 30కి పైగానే సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ సీట్లలో కొన్ని రెగ్యులర్, మరికొన్ని సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఉన్నాయి. రెగ్యులర్ సీట్లకు సెమిస్టర్‌కు రూ.30 వేలు ఫీజు కాగా, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లకు రూ.50 వేల ఫీజు. సగటున రూ.40వేలు అనుకుంటే.. ఏడాదికి రూ.80 వేలు ఫీజు.. దాదాపు అరవై సీట్లకు కలిపి రూ.48 లక్షలు. అంటే ఏడాదికి సుమారు రూ. అరకోటి అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా వర్సిటీ ఖజానాకు చేరడం లేదు.
తెలంగాణలో పీజీఈ సెట్, ఈసెట్, ఐసెట్ ద్వారా భర్తీ చేసే ప్రభుత్వ యూనివర్సిటీలు, ఖాళీగా ఉన్న సీట్లను రెండేండ్ల నుంచి స్పాట్ కౌన్సెలింగ్ ద్వారానే భర్తీ చేస్తున్నారు. ప్రతిభ ప్రాతిపదికనే భర్తీ చేస్తున్నప్పటికీ, ఫీజు రీయింబర్స్మెంట్ అందించడంలేదు. దీంతో ప్రభుత్వంపై ఎలాంటి అదనపు భారం లేకుండానే సీట్లు భర్తీ చేస్తున్నారు. ఆయా సెట్ల కన్వీనర్లు విడుదల చేసిన స్పాట్ అడ్మిషన్ల గైడ్‌లైన్స్ పాటించి, ఆయా యూనివర్సిటీలు, కళాశాలలు ప్రవేశాలు నిర్వహిస్తున్నాయి.
ఇంజినీరింగ్, టెక్నాలజీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయాలని ఇప్పటికే పలువురు విద్యార్థులు అధికారులకు వినతిపత్రాలు అందించారు. అయినా అధికారులు మాత్రం స్పందించడం లేదని ఆశావాహులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. జేఎన్టీయూలో స్పాట్ ప్రవేశాలు నిర్వహిస్తున్నప్పుడు.. ఓయూలో ఎందుకు నిర్వహించరని ప్రశ్నిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వలన ఓయూలో సీట్లు ఖాళీగా ఉండే పరిస్థితి తలెత్తిందని వాపోతున్నారు. దీంతో వర్సిటీ ఏడాదికి రూ.50 లక్షలు కోల్పోవలసి వస్తున్నదని పేర్కొంటున్నారు.
సాధారణంగా కళాశాలలో సీట్లను సెట్ కన్వీనర్ ద్వారానే భర్తీ చేస్తారు. కళాశాలల్లో ఉన్న ఖాళీల వివరాలను వెబ్సైట్లో అప్లోడ్ చేసేందుకు మాకు ఎలాంటి ఆప్షన్ లేదు. జేఎన్టీయూ అధికారులు ఎలా స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నారో మాకు తెలియదు. మేము నిబంధనల మేరకే వ్యవహరిస్తున్నాం.
– ప్రొఫెసర్ చంద్రశేఖర్, ప్రిన్సిపాల్, ఓయూ ఇంజినీరింగ్ కళాశాల
యూనివర్సిటీల స్పాట్ అడ్మిషన్ల అంశంలో వర్సిటీ అధికారులదే తుది నిర్ణయం. దానికి ఉన్నత విద్యామండలి అనుమతి అవసరం లేదు. కన్వీనర్ విడుదల చేసిన గైడ్‌లైన్స్ ప్రకారం స్పాట్ అడ్మిషన్లు నిర్వహించుకోవచ్చు. కానీ ప్రవేశాలు కచ్చితంగా మెరిట్ ఆధారంగా, రిజర్వేషన్లు పాటిస్తూ నిర్వహించాలి. స్పాట్ అడ్మిషన్లలో ప్రవేశాలు పొందిన వారికి ప్రభుత్వ రీయింబర్స్మెంట్ వర్తించదు.
– ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఉన్నతవిద్యామండలి