సౌతాంప్టన్: టీ20 వరల్డ్ చాంపియన్ భారత్‌కు మరో భంగపాటు. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో వరుసగా రెండో సిరీస్‌లోనూ జట్టుకు వైట్‌వాష్ తప్పలేదు. ఇంగ్లిష్ గడ్డపై చెత్తాటను కొనసాగించిన టీమిండియా శనివారం రాత్రి జరిగిన ఐదో, ఆఖరి టీ20లో 56 రన్స్ తేడాతో చిత్తుగా ఓడింది. జోస్ బట్లర్ (64 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్సర్లతో 131) అద్భుత శతకానికి తోడు కెప్టెన్ హ్యారీ బ్రూక్ (45 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్లతో 95 నాటౌట్) విజృంభించడంతో ఆతిథ్య జట్టు సిరీస్‌ను 4-0తో సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ ఇచ్చిన 258 పరుగుల ఛేదనలో భారత్ 201/8 స్కోరుకే పరిమితమై ఓడింది.
ఇషాన్ కిషన్ (35 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 56), హైదరాబాదీ తిలక్ వర్మ (25 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 53) ఫిఫ్టీలు కొట్టినా జట్టుకు ఓటమి తప్పలేదు. వైభవ్ సూర్యవంశీ స్థానంలో తిరిగి జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్ (27), కెప్టెన్ అయ్యర్ (28) పోరాడినా.. అభిషేక్ (3), శివమ్ దూబే (14), సూర్యాంశ్ షెడ్గే (7), అక్షర్ (3) చేతులెత్తేయడంతో జట్టుకు పరాభవం తప్పలేదు. సామ్ కరన్ మూడు వికెట్లతో దెబ్బకొట్టాడు. తొలుత బట్లర్, బ్రూక్ రెండో వికెట్‌కు 102 బంతుల్లోనే 233 రన్స్ జోడించడంతో ఇంగ్లండ్ 20 ఓవర్లలో 257/3 స్కోరు చేసింది. భారత బౌలర్లలో శివమ్ దూబే మాత్రమే రెండు వికెట్లతో రాణించాడు. బట్లర్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, బ్రూక్‌కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కాయి.