న్యూఢిల్లీ: భర్త, పిల్లలు లేని ఓ హిందూ మహిళ వీలునామా రాయకుండా మరణిస్తే ఆమె ఆస్తి అత్తింటివారికే చెందుతుందని, పుట్టింటి వారికి కాదని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎందుకంటే వివాహం అనంతరం మహిళ గోత్రం మారుతుందని కోర్టు పేర్కొన్నది. హిందూ వారసత్వ చట్టం, 1956లోని సెక్షన్ 15(1)(బీ)ని సవాలు చేస్తూ దాఖలైన ఓ పిటిషన్పై విచారణ సందర్శంగా బుధవారం సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ సెక్షన్ ప్రకారం వీలునామా రాయకుండా హిందూ మహిళ మరణిస్తే, ఆమెకు భర్త, పిల్లలు లేకపోతే ఆమె ఆస్తి ఆమె భర్తకు చెందిన వారసులకు చెందుతుంది.
చట్టంలో ఇమిడి ఉన్న సాంస్కృతిక ఛట్రాన్ని అర్థం చేసుకోవాలని జస్టిస్ బీవీ నాగరత్న నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషనర్లకు గుర్తు చేసింది. వాదించడానికి ముందు మీరు కొన్ని గుర్తుంచుకోవాలి. ఇది హిందూ వారసత్వ చట్టం. హిందూ అంటే అర్థం ఏమిటి. హిందూ సమాజం ఎలా నియంత్రించబడుతుంది.. లాంటి పదాలన్నీ మీకు నచ్చకపోవచ్చు. కాని కన్యాదానం జరిగినప్పుడు ఆమె గోత్రం మారుతుంది. ఆమె ఇంటిపేరు మారుతుంది. ఆమె భర్త నుంచి మనోవర్తి కోరవచ్చు అని ధర్మాసనం పేర్కొంది.
దక్షిణ భారతదేశంలోని సంప్రదాయాలను జస్టిస్ నాగరత్న ప్రస్తావిస్తూ దక్షిణాది వివాహాలలో వధువు గోత్రం మారిపోయినట్లు అక్కడే ప్రకటించడం జరుగుతుందని, ఈ సంప్రదాయాలన్నిటినీ విస్మరించలేమని అన్నారు. మహిళకు వివాహం జరిగిన తర్వాత హిందూ చట్టం ప్రకారం ఆమె బాధ్యత భర్త, అతని కుటుంబం మీదనే ఉంటుందని ధర్మాసనం తెలిపింది. ఆమె తన తల్లిదండ్రులు లేదా సోదరుల నుంచి మనోవర్తిని కోరదని జస్టిస్ నాగరత్న తెలిపారు. వివాహమైన మహిళ బాధ్యత ఆమె భర్త, అత్తమామలు, పిల్లలు, భర్త కుటుంబానికే చెందుతుందని చెప్పారు. మహిళకు పిల్లలు లేని పక్షంలో ఆమె వీలునామా రాయవచ్చని జస్టిస్ నాగరత్న తెలిపారు.
పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ చట్టంలోని ఈ సెక్షన్ ఏకపక్షం, వివక్షాపూరితంగా అభివర్ణించారు. వీలునామా రాయకుండా ఓ పురుషుడు మరణిస్తే అతని ఆస్తి అతని కుటుంబానికే చెందుతుంది. మహిళ పేరున ఉన్న ఆస్తి మాత్రం ఎందుకు ఆమె పిల్లలు, ఆమె భర్త కుటుంబానికే చెందుతుంది అని సిబల్ ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం న్యాయపరమైన నిర్ణయంతో సంప్రదాయాలు మార్చడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. .