చిక్కడపల్లి, సెప్టెంబర్ 25:ప్రముఖ కవి, రచయిత కొంపెల్లి వెంకట్‌గౌడ్ గుండెపోటుతో మృతిచెందారు. సూర్యాపేట్ జిల్లా మునగాలకు చెందిన ఆయన కొన్నేళ్లుగా నగరంలోని విద్యానగర్‌లో ఒంటరిగా నివసిస్తున్నాడు. గురువారం వెంట్ గౌడ్ విద్యానగర్‌లోని గదిలో ఉన్న సమయంలో గుండెపోటు రావడంతో స్పాట్లోనే తుదిశ్వాస విడిచాడని అతడి స్నేహితులు తెలిపారు. అవివాహితుడైన వెంకట్ ఉద్యమ కాలం నుండి అనేక పుస్తకాలు రాశారు.
బహుజన విప్లవవీరుడు సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్రను రచించిన గొప్ప రచయిత కొంపెల్లి వెకంట్ గౌడ్ అని.. ఆయన మృతి సాహితీలోకానికి తీరని లోటని మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం చిక్కడపల్లిలోని బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కార్యాలయంలో కొంపెల్లి వెంకట్ గౌడ్ సంతాప సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాస్ గౌడ్..కొంపెల్లి వెంకట్‌గౌడ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
అతి చిన్న వయస్సులోనే వెంకట్‌గౌడ్ మృతి చెందడం బాధాకరమన్నారు. బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగౌని బాలరాజ్ గౌడ్ మాట్లాడుతూ.. బహుజన జాతిని చైతన్యం చెసిన గొప్ప కవి కొంపెల్లి వెంకట్ గౌడ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గౌడ కల్లుగీత వృత్తిదారుల సమన్వయ కమిటీ కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర నాయకులు సుగూరి దుర్గయ్య గౌడ్, అంబాల నారాయణ గౌడ్, దొమ్మాట వెంకట గౌడ్, బడేసాబ్, సింగం నాగేశ్వర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొనానరు.
గాంధీ వైద్య కళాశాలకు వెంకట్ గౌడ్ పార్థీవదేహం
బన్సీలాల్‌పేట్, సెప్టెంబర్ 25: సికింద్రాబాద్‌లోని గాంధీ వైద్య కళాశాలకు ప్రముఖ కవి, రచయిత కొంపల్లి వెంకట్ గౌడ్ (52) పార్థీవదేహాన్ని అప్పగించారు. వెంకట్ గౌడ్ గతంలో ఇచ్చిన అంగీకార పత్రం మేరకు ఆయన కండ్లను ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యులు సేకరించారు. ఆయన పార్థీవదేహానికి ఎంబామింగ్ చేశాక, వైద్య విద్యార్థులు తమ వైద్య పరిశోధనలకు వినియోగిస్తారని గాంధీ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే.ఇందిర, అనాటమీ విభాగం హెచ్ఓడీ డాక్టర్ సుధారాణి, ప్రొఫెసర్ డి.సుధాకర్ బాబు తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు లేఖ అందజేసి, పార్థీవదేహాన్ని అనాటమీ విభాగానికి తరలించారు.
ఉన్నతమైన లక్ష్యంతో వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం పార్థీవదేహాన్ని అప్పగించి, అందరికి ఆదర్శంగా నిలిచిన కవి, రచయిత కొంపల్లి వెంకట్ గౌడ్ కుటుంబ సభ్యులకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే.ఇందిర ధన్యవాదాలు తెలిపారు. తాను మరణిస్తూ కూడా ఇతరులకు జీవితాన్ని ప్రసాదించిన వెంకట్‌గౌడ్‌ను స్ఫూర్తిగా తీసుకొని యువత అవయవదానానికి ముందుకు రావాలని ప్రిన్సిపాల్ సూచించారు.