అద్దం అబద్ధం చెప్పదు. నీలోని లోపాలను ఉన్నవి ఉన్నట్టుగా చూపుతుంది. అలా చూపినందుకు అద్దాన్ని బద్దలు చేస్తానంటున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అడ్డగోలు హామీలు, తిట్లు, ఒట్లతో అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ మాట తప్పడం, మడమ తిప్పడం గమనిస్తున్న ప్రజలు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తున్నారు. ఎగవేతలను ఎండగడుతున్నారు. చేతకాని, చేవలేని పాలనను కడిగిపారేస్తున్నారు. ఇది గిట్టని సర్కారు కేసులు, అరెస్టులతో వేధింపులకు తెగబడింది.
అన్నం తింటున్నవారిని అరెస్టు చేసి తీసుకువెళ్లడం, పోలీసు స్టేషన్లలో గంటలకొద్దీ కూర్చోబెట్టడం వంటి చర్యలతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది. అయితే హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుతో ఈ అరాచకాలకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. రాజకీయ పోస్టులపై క్రిమినల్ కేసులు పెట్టరాదని హైకోర్టు ప్రభుత్వానికి గడ్డిపెట్టింది. గట్టిగా మందలించింది. ఈ తీర్పుతో నిజానికి ప్రభుత్వానికి జ్ఞానోదయం కావాలి. కానీ, ఇక్కడున్నది కాంగ్రెస్ సర్కారు. ఏకపార్టీ నియంతృత్వం అమల్లో ఉన్న దేశాల్లోనూ సాధ్యం కాని నిరంకుశాధికారం కోరుకోవడం వారి తీరు.
కోర్టులు మొట్టికాయలు వేసినా, ప్రజలు ఛీ కొట్టినా జాన్తానై అంటున్నది సర్కారు. దొడ్డిదారిన వేధింపు మార్గాలు వెతుకుతున్నది. సర్కారు నుంచి వెలువడుతున్న సంకేతాలను బట్టి సైబర్ నేరాల నియంత్రణ పేరిట సోషల్ మీడియా వారియర్లపై రౌడీషీట్లు తెరవనున్నట్టు తెలుస్తున్నది. ఎమర్జెన్సీతో చేతులు కాల్చుకుని చెంపలు వేసుకున్న పార్టీకి నిజమైన జ్ఞానోదయం సాధ్యం కాదని గతంలో ఎన్నోసార్లు తేలిపోయింది. ఇప్పుడు మరోసారి అదే జరుగుతున్నది. సోషల్ మీడియా ద్వారా జరిగే నేరాలు, ఆర్థిక మోసాలు, అలవాటుగా చేసే నేరాలపై హిస్టరీ షీట్, సస్పెక్ట్ షీట్ తెరవాలని డీజీపీ నుంచి అన్ని పోలీసు స్టేషన్లకు ఉత్తర్వులు వెళ్లాయి. కానీ, దీని లక్ష్యం పైకి చెప్తున్నది కానే కాదు. సర్కారును నిలదీసే సామాజిక మాధ్యమాల పోస్టులకు సంకెళ్లు వేయాలనే మోసకారి ఎత్తుగడ తప్ప మరోటి కాదనేది స్పష్టం. ఎన్నికలకు ముందు రొష్టు పోస్టులతో యథేచ్ఛగా బురదజల్లిన పార్టీకి ఇప్పుడు ప్రశ్నించేవారు శత్రువులు కావడం విడ్డూరం.
సోషల్ మీడియా శక్తియుక్తులు అపారంగా విస్తరించిన రోజుల్లో మనం బతుకుతున్నాం. నిన్నకు నిన్న నేపాల్లో జరిగిన ప్రజా తిరుగుబాటు మూలంగా అక్కడి ప్రభుత్వమే కుప్పకూలింది. నాయకుల అవినీతి అందుకు మూలకారణమైనా బాంబుకు వత్తిని సమకూర్చింది మాత్రం సోషల్ మీడియా నిషేధమే. అంతకుముందు బంగ్లాదేశ్లో ప్రజా తిరుగుబాటును నడిపించింది సోషల్ మీడియానే. ఇంకొంచెం వెనక్కి వెళ్తే శ్రీలంకలో సర్కారును గద్దెదించింది సోషల్ మీడియా చైతన్యమే. చివరకు చైనాను ఉక్కుచట్రంలో బంధించి పరిపాలించే కమ్యూనిస్టు పార్టీ సైతం జడుసుకునేది సోషల్ మీడియాను చూసే. డిజిటల్ జనరేషన్ పవర్ ఏమిటో ప్రపంచానికి తెలిసిపోయింది. కానీ కల్లలతో, కపటనీతితో గద్దెనెక్కిన కాంగ్రెస్ మాత్రం పదేపదే కత్తిగడుతున్నది. ప్రశ్నించే గొంతుకలను నొక్కాలని చూస్తే అసలే కుతకుత ఉడుకుతున్న ప్రజాగ్రహానికి ఆజ్యం పోసినట్టు అవుతుందని సర్కారు తెలుసుకోవడం మంచిది.