ఖైరతాబాద్, సెప్టెంబర్ 25: రాష్ట్రం ప్రాంతాలుగా విడిపోయిన మాదిరిగానే సినిమా రంగంలోనూ విభజన జరుగాల్సిన అవసరం ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు. తెలంగాణ సినిమా వేదిక ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో తెలంగాణ క్రాంతిదళ్ అధ్యక్షుడు పృథ్విరాజ్ యాదవ్, తెలంగాణ విఠల్ మాట్లాడుతూ.. సినిమా రంగంలో తెలంగాణ ఆర్టిస్టులను అవమానిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇక్కడి సినిమా రంగంపై పక్క రాష్ట్రం పెత్తనం అవసరం లేదని, బలగం లాంటి సినిమాలతో తెలంగాణ కళాకారుల సత్తాచాటిన వారు ఉన్నారని, విభజన జరిగితే అలాంటి వారికి మరింత చేయూతనిచ్చినవారమవుతామన్నారు.
సినీ డిజిటల్ యూనియన్‌లో భారీ అక్రమాలు..
తెలంగాణ సినిమా వేదిక అధ్యక్షుడు లారా మాట్లాడుతూ.. తెలుగు సినీ డిజిటల్ యూనియన్‌లో భారీ అక్రమాలు జరిగాయన్నారు. కార్యవర్గంలో ఆంధ్రా, కర్నాటక రాష్ర్టాలకు చెందినవారు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఉన్నారని.. అందులోనూ సభ్యుల్లో అధిక శాతం మంది ఆర్టిస్ట్ కానివారే ఉన్నారని, సభ్యత్వం కోసం ఒక్కొక్కరి వద్ద వేలాది రూపాయలు తీసుకున్నారని విమర్శించారు. బోగస్ ఆర్టిస్టులకు చిత్రపురిలో ఇండ్లు ఇప్పించి వారి వద్ద నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు.
ఈ వ్యవహారంలో సుమారు రూ.300 కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు. చిత్రపురి కాలనీ హౌజింగ్ సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కన్నుసన్నల్లోనే అక్రమాలు జరిగాయని లారా ఆరోపించారు. ఈ నెల 28న తెలంగాణ సినీ డిజిటల్ యూనియన్‌కు జరిగే ఎన్నికలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణ సినిమా వేదిక గౌరవ అధ్యక్షులు ప్రపుల్ రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి మోహన్ బైరాగి, ఆర్టిస్టులు.. ఉజ్జయిని శంకర్, గోవింద్ రాజు, బాలు, సంతోష్, భద్రా, కస్తూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.