Supreme Court : మహిళలకు ప్రసూతి సెలవులు (Maternity Leaves) ఇవ్వడాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు (Supreme Court) మరోసారి సమర్థించింది. మహిళలు మాతృత్వపు లబ్ధిని, సంతానాన్ని పొందే హక్కుల్లో ప్రసూతి సెలవులు అత్యంత కీలకమైనవని పేర్కొంది. ఏ సంస్థ కూడా మహిళలకు ఉన్న ప్రసూతి సెలవు హక్కును హరించలేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు తన రెండో పెళ్లి తర్వాత బిడ్డకు జన్మనిచ్చేందుకు వీలుగా ప్రసూతి సెలవులను ఇచ్చేందుకు అక్కడి అధికారులు నిరాకరించారు. దాంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన మొదటి వివాహం ద్వారా ఇప్పటికే ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చినందున ఇప్పుడు ప్రసూతి సెలవులు ఇచ్చేందుకు అధికారులు నిరాకరించినట్లు ఆమె కోర్టుకు తెలియజేశారు.
అయితే తమిళనాడు రాష్ట్ర నిబంధనల ప్రకారం తొలి ఇద్దరు పిల్లలకు మహిళలు ప్రసూతి సెలవులు పొందే అవకాశం ఉంది. ఆ నిబంధన ప్రకారం సదరు మహిళ మరోసారి ప్రసూతి సెలవులు పొందేందుకు అర్హురాలు కాదని తమిళనాడు సర్కారు తన వాదన వినిపించింది. కానీ తాను రెండో వివాహం చేసుకున్న తర్వాత మాత్రమే ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన విషయాన్ని ఆ ఉపాధ్యాయురాలు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.
అంతేగాక తన తొలి రెండు కాన్పులకు ఎలాంటి ప్రసూతి సెలవులు తీసుకోలేదని, ఎందుకంటే అప్పటికి తాను ప్రభుత్వ ఉద్యోగంలోనే లేనని ఆమె కోర్టుకు తెలియజేశారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కేవీ ముత్తుకుమార్ వాదనలు వినిపించారు. తమిళనాడు ప్రభుత్వ నిర్ణయం తన క్లయింట్ ప్రాథమిక హక్కులను హరించేలా ఉందని వ్యాఖ్యానించారు.