Vijayawada Utsav | దసరా శరన్నవరాత్రుల సందర్భంగా నిర్వహించనున్న విజయవాడ ఉత్సవ్‌కు ఆలయ భూములు వినియోగించుకుండా చూడాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. అవి వ్యవసాయ భూములైతే రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత ఆలయ అధికారులు చూసుకుంటారని జస్టిస్ విక్రమ్‌నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇందులో మూడో వ్యక్తి అభ్యంతరాలు ఏంటని ప్రశ్నించింది.
విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో గొడుగుపేట శ్రీవేంకటేశ్వర స్వామి భూములను దేవాదాయ శాఖ ఇప్పటికే 56 రోజులకు గానూ విజయవాడ ఉత్సవన్ నిర్వాహకులైన సొసైటీ ఫర్ వైబ్రెంట్కు ఏపీ ప్రభుత్వం లీజుకు ఇచ్చింది. దీనికి సంబంధించిన మొత్తాన్ని దేవస్థానానికి ఉత్సవ్ నిర్వాహకులు చెల్లించారు. అయితే దేవాదాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు ఉపయోగించడంపై ఇటీవల ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారించిన సింగిల్ బెంచ్.. విజయవాడ ఉత్సవ్‌పై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై నిర్వాహకులు మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై సీజే ధర్మాసనం స్టే విధించింది. దీంతో హైకోర్టు ఉత్తర్వులపై జోక్యం చేసుకోవాలని పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించాడు. ఆ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణకు వచ్చింది.
ఆలయ భూములను కమర్షియల్‌గా వినియోగిస్తున్నారని విచారణ సందర్బంగా పిటిషనర్ న్యాయవాది తెలిపారు. వ్యవసాయ భూములను ఎగ్జిబిషన్ పేరుతో వాడటం నిబంధనలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు. ఎవరికీ సమస్యలు లేవని, కలెక్టర్ నేతృత్వంలో ఏర్పాటైన సొసైటీ ఆ భూముల నిర్వహణ చూస్తోందని ప్రభుత్వం తరఫు న్యాయవాది ఆదినారాయణ తెలిపారు. కార్యక్రమ నిర్వాహణకు 56 రోజులకుగానూ రూ.45లక్షలు దేవాదాయ శాఖకు చెల్లించారని పేర్కొన్నారు. భక్తుల పేరుతో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేశారని పేర్కొన్నారు. దీంతో ఆ భూములతో పిటిషనర్‌కు నేరుగా ఏమైనా సంబంధం ఉందా అని జస్టిస్ విక్రమ్‌నాథ్ ధర్మాసనం ప్రశ్నించింది. వ్యవసాయ భూములైతే రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత ఆలయ అధికారులు చూసుకుంటారని స్పష్టం చేశారు. మూడో వ్యక్తికి అభ్యంతరాలు ఏంటని ప్రశ్నించింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై జోక్యానికి విషయమేమీ కనిపించడం లేదని పేర్కొంటూ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.