Srisailam Temple | శ్రీశైలం : జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైలం దేవస్థానంలో సోమవారం నుంచి దసరా మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తొమ్మిదిరోజుల పాటు వేడుకలు కొనసాగి.. అక్టోబర్ 2న ముగియనున్నారు. వేడుకల కోసం దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు శ్రీస్వామివారికి విశేష అర్చనలు, అమ్మవారికి ప్రత్యేకపూజలు, రుద్రయాగం, చండీయాగం, అమ్మవారి ఉత్సవమూర్తికి నవదుర్గ అలంకరణలు, స్వామిఅమ్మవార్లకు వివిధ వాహనసేవలు, లోకకల్యాణం కోసం జపపారాయణలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ ఉత్సవాలకు నాందిగా సోమవారం ఉదయం 9 గంటలకు అమ్మవారి ఆలయ మండపంలో యాగశాల ప్రవేశం చేసి గణపతిపూజ, స్తిపుణ్యాహవచనం, దీక్షాసంకల్పం, కంకణపూజ, ఋత్విగ్వరణం, కంకణపూజ, కంకణధారణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం పేర్కొంది.
అమ్మవారి యాగశాలలో అఖండదీపస్థాపన, వాస్తుపూజ, వాస్తు హోమం, మండపారాధన, చండీ కలశస్థాపన, శ్రీచక్రార్చన, నవగ్రహ జపాలు, చతుర్వేద పారాయణలు, విశేష కుంకుమార్చనలు, కుమారీపూజలు నిర్వహించనున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. అలాగే, 9.30 గంటలకు శ్రీస్వామివారి యాగశాలలో యాగశాలప్రవేశంచేసి వేదస్వస్తి, శివసంకల్పం, గణపతిపూజ, పుణ్యాహవాచనం, చండీశ్వరపూజ, కంకణపూజ, ఋత్విగ్వరణం, కంకణధారణ, అఖండదీపస్థాపన, వాస్తుపూజ, మండపారాధనలు, రుద్రకలశస్థాపన, స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మధ్యాహ్నకాలార్చనలు, మహానివేదన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ ఉత్సవాల్లో భాగంగానే సాయంకాలం నుంచి అంకురార్పణ, అగ్నిప్రతిష్ఠాపన, రుద్రహోమం, అమ్మవారికి నవావరణార్చన, కుంకుమార్చనలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆ తరువాత రుద్రహోమం, చండీహోమం.. అనంతరం రాత్రి 9 గంటల నుంచి సువాసినిపూజ, నీరాజనమంత్రపుష్పం, మహదాశీర్వచనం, తీర్థప్రసాదవితరణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపింది.
మహా దసరా సందర్భంగా అక్టోబర్ ఒకటి మహర్నవమి రోజున రాష్ట్రప్రభుత్వం తరఫున శ్రీస్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఆయా కార్యక్రమాల కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 50 మందిని దేవస్థానం పిలిపించింది. దేవస్థానం అర్చకస్వాములు, వేదపండితులతో పాటు వీరు కూడా ఉత్సవనిర్వహణలో పాలుపంచుకోనున్నారు. ఉత్సవాల్లో తొలిరోజు భ్రమరాంబ అమ్మవారు శైలపుత్రి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. భృంగివాహనంపై భ్రమరాంబ సమేత మల్లికార్జునులు విహరించనున్నారు.
వాహన సేవల వివరాలు..