Srisailam | శ్రీశైలం : అమావాస్య సందర్భంగా శ్రీశైలం క్షేత్రపాలకుడైన బయలు వీరభద్రస్వామి వారికి ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. మంగళవారం, అమావాస్య రోజుల్లో విశేష అర్చనలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. భక్తులు పరోక్ష సేవలో పాల్గొనేందుకు దేవస్థానం అవకాశం కల్పించింది. ఈ పరోక్ష సేవలు 30 మంది భక్తులు విశేష పూజ జరిపించుకున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, పశ్చిమ బెంగాల్‌తో పాటు పలు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు పూజలు చేయించుకుంటున్నారని పేర్కొన్నారు.
కార్యక్రమంలో భాగంగా మొదట మహాగణపతి పూజ నిర్వహించారు. పంచామృతాలతోనూ, బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, భస్మోదకం, గంధోదకం, పుష్పోదకం, శుద్ధజలాలతో వీరభద్రస్వామివారికి అభిషేకం చేశారు. ఈ స్వామి ఆరాధనతో గ్రహదోషాలు, అరిష్టాలు తొలగిపోతాయని.. ఎంత క్లిష్ట సమస్యలైనా పరిష్కారమవుతాయని.. సర్వకార్యానుకూలత లభించి అభీష్టం నెరవేరుతుందని పండితులు పేర్కొంటున్నారు. పరోక్షసేవ ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించేందుకు వీలుగా ప్రసార వివరాలు, ప్రసారాల సమయం మొదలైనవాటిని ఎప్పటికప్పుడు భక్తులకు వివరించనున్నట్లు తెలిపింది. శ్రీశైలం టీవీ, యూట్యూబ్ ద్వారా కార్యక్రమాన్ని వీక్షించవచ్చని తెలిపింది. పరోక్ష సేవలో పాల్గొనాలనుకునే భక్తులు 8333901351/52 /53 నంబర్లలో సంపద్రించాలని కోరారు. కార్యక్రమంలో ఈవో ఎం శ్రీనివాసరావు దంపతులు పాల్గొన్నారు.