Rekha Gupta : ఆమ్ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal).. ఢిల్లీ సీఎం (Delhi CM) రేఖాగుప్తా (Rekha Gupta) మాట్లాడుతున్నట్టుగా ఉన్న ఓ ఏఐ వీడియో (AI Video) ను షేర్చేస్తూ ‘సీఎం ఏం మాట్లాడుతున్నారు..’ అనే క్యాప్షన్‌తో పోస్టు పెట్టారు. దాంతో కేజ్రీవాల్‌పై రేఖాగుప్తా సెటైర్లు వేశారు. కేజ్రీవాల్ తన రీల్స్ చూడటం ఆపేయాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఆ వీడియోలో.. ‘70 ఏళ్లపాటు కాంగ్రెస్ ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడినంత కాలం అంతా బాగానే ఉంది. ఇప్పుడు మేం చేస్తే మాత్రం వారు బాధపడుతున్నారు. వారు విజయం సాధిస్తే ప్రజాతీర్పు అంటారు. మేం గెలుపొందితే ఈవీఎంలు హ్యాక్ అయ్యాయని ఆరోపిస్తారు. రాహుల్ గాంధీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూనే ఉంటారు’ అని సీఎం రేఖాగుప్తా చెబుతున్నట్టుగా ఉంది. ఆ వీడియో క్లిప్‌ను ‘సీఎం ఏం మాట్లాడుతున్నారు..?’ అనే క్యాప్షన్‌తో కేజ్రీవాల్ షేర్ చేశారు.
దాంతో అదొక ఎడిటెడ్ వీడియో అని బీజేపీ ఇప్పటికే తోసిపుచ్చింది. తాజాగా అదే వీడియోపై రేఖాగుప్తా స్పందించారు. ‘కేజ్రీవాల్ సార్.. నాకు సంబంధించిన రీల్స్ చూడటం తగ్గించుకోవాలి. మేడమ్ ఏం చెప్పారో.. ఏం చెప్పలేదో..? తెలుసుకునేందుకు మీరు ఉరోజంతా నా రీల్స్ చూస్తున్నట్టుంది. మీరు నిజంగా దృష్టి పెట్టాలనుకుంటే వరదలతో ఇబ్బందిపడిన పంజాబ్ ప్రజలపై పెట్టండి. ఆయన బాధితుల దగ్గరకు వెళ్లినట్లు నాకైతే కనిపించలేదు’ అని సెటైర్లు వేశారు.