అచ్చంపేట రూరల్ : ఏడు నెలల పెండింగ్ జీతాలు ( Pending Salaries ) వెంటనే విడుదల చేయాలని
పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో డైలీ వేజ్ వర్కర్లు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె (Indefinite strike) 11వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా అంబేద్కర్ చౌరస్తాలో బతుకమ్మ ( Batukamma ) ఆడుతూ నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి శంకర్ నాయక్ మాట్లాడుతూ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్లో పనిచేసే ఉద్యోగులకు సంవత్సరాల తరబడి జీతాలు వేయకపోతే కుటుంబాలు ఎలా గడుస్తాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మంత్రి, జేఏసీ నాయకులతో చర్చించి సమస్య పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
డైలీ వేజ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని. ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డైలీ వేజ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సురేందర్, నాయకులు భరత్, జిల్లా అధ్యక్షులు పర్వతాలు, అంజమ్మ, పద్మ, బాలుమణి, చిట్టెమ్మ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.